మన ఆహారం మనమే పండించుకుందాం!

26 Aug, 2020 02:12 IST|Sakshi

‘మనం ఏం తింటామో అదే మనం’ అంటారు. ఆ సామెతను పూర్తిగా పాటిస్తున్నారు సమంత. లాక్‌డౌన్‌ సమయాన్ని గార్డెనింగ్‌కి కేటాయించారు. ఇంటికి కావాల్సిన కూరగాయలను, పండ్లను సొంతంగా పండించి, వాటికి కావాల్సిన ఎరువులను కూడా కొన్నింటిని తయారు చేసి ఓపికగా పండించారు సమంత. వీటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. తనతో పాటు గార్డెనింగ్‌ ప్రారంభించండి అని రకుల్‌ ప్రీత్, మంచు లక్ష్మీలకు  ‘గ్రో విత్‌ మీ’ చాలెంజ్‌ విసిరారు. 

ఈ చాలెంజ్‌ స్వీకరించిన రకుల్‌ మాట్లాడుతూ – ‘‘గ్రో విత్‌ మీ’ చాలెంజ్‌కి నన్ను నామినేట్‌ చేసినందుకు థ్యాంక్యూ సమంత. మనం నాటిన గింజలు మొక్కలుగా మారే ప్రక్రియను గమనించడం వర్ణించలేని అద్భుతమైన అనుభూతి. మనం తినేది మనమే పండిస్తే మన శరీరానికి కావాల్సినవన్నీ అవే మనకు సమకూరుస్తాయి అని విన్నాను. గార్డెనింగ్‌ ద్వారా ప్రకృతితో పాటు మనతో మనం మమేకం అవుదాం’’ అన్నారు. గార్డెనింగ్‌ ప్రారంభించిన ఓ వీడియోను షేర్‌ చేశారు కూడా. 

లక్ష్మీ మంచు మాట్లాడుతూ– ‘‘ఈ కరోనా వల్ల మనందరం తెలుసుకున్న ఓ ముఖ్య విషయం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం అని. మొక్కలు మనందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. మనకు కావాల్సిన ఆహారం, స్వచ్ఛమైన గాలి ఇలా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఏదైనా లేకుండా బతకొచ్చు గానీ ఆహారం లేకుండా కచ్చితంగా బతకలేం. అందుకే నేను, నివీ (లక్ష్మీ కుమార్తె నిర్వాణ మంచు) కలసి గార్డెనింగ్‌ ప్రారంభిస్తున్నాం’’ అని విత్తనాలు నాటుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

సమంత తన గార్డెన్‌లో పండించిన క్యారెట్స్‌ను చూపిస్తూ, ‘‘ఈ వారం మా ఇంట్లో అన్నీ క్యారెట్‌ ఐటమ్సే. క్యారెట్‌ హల్వా, క్యారెట్‌ పచ్చడి, క్యారెట్‌ జ్యూస్, క్యారెట్‌ ఫ్రై, క్యారెట్‌ పకోడి, క్యారెట్‌ ఇడ్లీ, క్యారెట్‌ సమోస’’ అని సరదాగా క్యాప్షన్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా