ప్రతి స్త్రీ తన శక్తిని తెలుసుకోవాలి

25 Oct, 2020 02:31 IST|Sakshi

‘‘ఆడవాళ్లందర్లోనూ అన్యాయాన్ని ఎదిరించగల దుర్గాదేవి అవతారముంది. అది తెలుసుకుని, ఆ శక్తిని బయటకు తీస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలం’’ అంటున్నారు రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి, అదా శర్మా, మెహరీన్, నభా నటేశ్‌.
సమాజంలో స్త్రీ నెగ్గుకురావాలంటే దుర్గాదేవిలా మారాల్సి ఉంటుందా?
ఆడవాళ్లకు పలు సమస్యలు ఉంటాయి. అవకాశం వస్తే మీరు పూర్తిగా నిర్మూలించాలనుకునే సమస్య ఏంటి?
చెడును ఎదుర్కోవడానికి మీరు దుర్గాదేవిలా మారిన సందర్భాలేమైనా?
దసరా పండగ సెలబ్రేషన్‌ గురించి?
వంటి ప్రశ్నలకు రాశీ, అదా, లావణ్య, మెహరీన్, నభా చెప్పిన అభిప్రాయాలు దసరా ప్రత్యేకం.

హద్దు దాటితే సహించను
– మెహరీన్‌

తన క్యారెక్టర్‌ని తక్కువ చేసినా, తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా ఉన్నా, అనవసరమైన నిందలకు గురైనా తప్పకుండా దుర్గాదేవిలా మారాల్సిందే. ఏం జరిగినా సరే ఒకరి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆడవాళ్లను అగౌరవపర్చకూడదు.

అసమానతను నిర్మూలించాలనుకుంటున్నాను. ఆడవాళ్లను బలహీనమైనవాళ్లలా చూస్తారెందుకో అర్థం కాదు. శారీరకంగా మగవాళ్ల అంత బలంగా ఆడవాళ్లు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఆడవాళ్లు ఎంత బలవంతులో అందరికీ తెలుసు. శారీరకంగానూ మాకు వీలైనంతగా చేస్తూనే ఉంటాం. ఎంతో సమర్థవంతంగా ఇంటి పనిని, ప్రొఫెషనల్‌ పనిని బ్యాలెన్స్‌ చేయగలం. మల్టీటాస్క్‌ చేయగలం. స్త్రీ, పురుషులందరూ సమానమే అనే భావన పెంపొందించాలి అందరిలో.

నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. ఓపిక ఎక్కువ. నా పనేదో నేను చూసుకునే మనస్తత్వం. కానీ దేనికైనా ఒక లిమిట్‌ ఉంటుంది కదా. ఆ లిమిట్‌ వరకూ నేను కామ్‌గా ఉంటాను. అన్యాయంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా అస్సలు సహించలేను. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు నిలబడతాను.

పండగ వస్తుందంటే నాకు భలే సంతోషమేస్తుంది. స్నేహితులు, బంధువులను కలవచ్చు. ప్రస్తుతం అందరం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కువమందితో కలిసి పండగలు జరుపుకునే పరిస్థితిలో లేము. ఇలాంటి సమయాల్లో ఒకరికోసం ఒకరు నిలబడదాం.

మన కళ్లు కూడా ఆయుధమే
– అదా శర్మ

ప్రతీ ఒక్కరిలోనూ దుర్గాదేవి ఉంటుంది. కానీ కొందరు తెలుసుకోగలుగుతారు. కొందరికి తెలియదు.. అంతే. మన లోపల శక్తి దాగి ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రావాలి కూడా.

ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కావడం చూస్తుంటాం. ఒకరిని ఒకరు తక్కువ చేయడం తీసేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ మరో స్త్రీ కోసం నిలబడాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలసి పైకి ఎదగాలి.

చాలాసార్లు మారాను. కర్రను కూడా ఆయుధంగా చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు కళ్లను కూడా ఆయుధాలుగా మార్చుకోవచ్చు.

దసరా పండగకి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి ముందు రంగోలీ వేస్తాను. ఇంటిని పూలతో అలంకరిస్తాను. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటాము.

అందుకే తొమ్మిది అవతారాలు
– నభా నటేశ్‌

ప్రతి ఒక్కరికి తనలో ఉన్న ప్లస్, మైనస్‌ కచ్చితంగా తెలియాలి. వాళ్ల బలమేంటో తెలుసుకుని బలహీనతలను తొలగించుకోవటం కోసం ఫైట్‌ చెయ్యాలి. దుర్గాదేవి ప్రపంచంలోని అందరికీ  సమానమే, అందరికీ అమ్మే. దుర్గాదేవి అంటే ప్రపంచానికే శక్తి. ఆమె తెచ్చిన విజయంతోనే ప్రపంచానికి వెలుగొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా ఆడవాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని దానికోసం జీవితంలో కష్టపడాలి. దుర్గాదేవి చేసింది అదే. నాకు కావాల్సిందేంటో నాకు కచ్చితంగా తెలుసు, దానికోసం నేను అమ్మవారిలా ఫైట్‌ చేస్తాను. అదే నా బలం ఆనుకుంటాను.

అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తను సాధించాలనుకున్నది సాధించింది. అందుకే ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది రకాలుగా తయారుచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఉంచి పూజ చేస్తారు. నేను పుట్టి పెరిగింది శృంగేరిలో. దేశంలోని శారదా శక్తి పీఠాల్లో అది కూడా ఒకటి. నవరాత్రి సమయంలో గుళ్లో అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆ అలంకారాలను చూసి భక్తితో మొక్కుతాను. ఆ అమ్మవారి అలంకారాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు అలా గుడికి వెళ్లి ఆడుకుంటూ సెలబ్రేషన్స్‌లో పిల్లలందరం పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ పండగలంటే నాకు చాలా శ్రద్ధ. వీలు కుదిరినంతవరకూ పూజలు చేస్తుంటాను.

మన యుద్ధం మనమే చేయాలి
– రాశీ ఖన్నా

మనందరిలోనూ దుర్గాదేవి అవతారం ఉంటుంది. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే ఒక్కోసారి ఆ అవతారాన్ని బయటకు తీస్తేనే బతకగలం అనిపిస్తుంది. ఎప్పుడూ అమాయకంగా కూర్చోలేం కదా. కలియుగంలో మన యుద్ధం మనమే చేయాలి.

మానభంగం, లింగ వివక్ష అనేది సమాజంలో లేకుండా చేయాలన్నది నా కోరిక. మన ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన బట్టలు వేసుకొని బయటకు వెళ్లడానికి ఎందుకు భయపడాలి?  అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్పుదాం. రేప్‌ కేసుల్లో దోషుల మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికీ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. లింగ బేధాలు లేకుండా సమాన అవకాశాలు ఇవ్వగలగాలి?

నా కోసం నేను నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని వచ్చాయి. నిలబడ్డాను. మా ఇంట్లో నాకు చిన్నప్పటినుంచీ ‘నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్‌ చేయ్‌’ అని చెబుతూ వచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్‌ టు ఫేస్‌ మాట్లాడటానికే ఇష్టపడతాను. ముసుగులో మాట్లాడటానికి ఇష్టపడను. నాకోసం నేను నిలబడాల్సి వస్తే కచ్చితంగా ధైర్యంగా నిలబడతాను.

చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోనే జరుపుకునేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక పండగలకు ఇంట్లో ఉండటం తక్కువైంది. షూటింగ్స్‌ హడావిడిలో ఉంటాం. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి రామ్‌లీలా చూడటానికి మా ఇంటి (ఢిల్లీ) దగ్గర ఉన్న గ్రౌండ్‌కి వెళ్లేదాన్ని. మాది చాలా పెద్ద కుటుంబం. పండగ వస్తే చాలు అందరం కలిసే వాళ్లం. పని వల్ల హైదరబాద్‌లోనే ఉండిపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి.

అదే నా సూపర్‌ పవర్‌
– లావణ్యా త్రిపాఠి

ఈ భూమ్మీద పుట్టిన ప్రతి స్త్రీలో దుర్గా మాత ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీలో శక్తి దాగుందని నేను నమ్ముతాను. మగపిల్లలు సూపర్‌హీరోస్‌ అయినట్లే అమ్మాయిలు అవసరమొచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలరు. అలాగే తమ గొంతును ప్రపంచానికి గట్టిగా వినిపించగలరు. తన అనుకున్నవారి కోసం  నిలబడి ఫైట్‌ చేయగలరు. మనం చేయాల్సిందల్లా ఆడపిల్లలపై నమ్మకాన్ని ఉంచటం అంతే. నేను వ్యక్తిగతంగా దుర్గామాతను నమ్ముతాను, నన్ను నేను దుర్గగా అనుకుంటాను. దుర్గ అంటే కోపం, భయం, ప్రేమ మాత్రమే కాదు ఆలోచనాపరమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఆమె ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది.

మనకొచ్చే ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. స్త్రీ అనే కాదు ప్రతి ఒక్కరూ యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలి. నేను చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాను. పరిష్కరించుకుంటాను కూడా. అదే నా సూపర్‌పవర్‌. నా కోపాన్ని ఎప్పుడూ నేను కంట్రోల్‌లో పెట్టుకుంటాను.

మా ఇంట్లో చిన్నపిల్లలకు పండగ విశేషాలు చెప్పడం నా అలవాటు. నేను నా మేనకోడలికి కొంచెం క్రియేటివ్‌గా స్కెచ్‌తో బొమ్మలేసి, రాక్షస సంహారం ఎందుకు జరిగింది? దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? అనే విషయాలు చెప్పాను. రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటాం అని చెప్పాను. అలా చెప్తేనే  కదా మన సంస్కృతి సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి.

మరిన్ని వార్తలు