తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు..

8 Jun, 2021 00:19 IST|Sakshi

నాలుగు పాటలు.. కొన్ని కబుర్లు... ఎప్పుడూ ఇవేనా? ఇంకేదో చేయాలి. కానీ చాన్స్‌ రావాలి కదా! ఆ భలే చాన్స్‌ వస్తే.. సత్తా చూపిస్తాం అంటారు కథానాయికలు. ఇప్పుడు కొందరు తారలు గ్లామర్‌ని పక్కన పెట్టారు. అందంగా మాత్రమే కాదు.. పవర్‌ఫుల్‌గా కనిపించడానికి రెడీ అయ్యారు. తుపాకీ పట్టారు. ప్రేక్షకుల మనసులను గెలుచు కోవడానికి గురి పెట్టారు.

ఇప్పటివరకూ యాభైకి పైగా సినిమాలు చేశారు హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. గ్లామర్‌ సెక్షన్‌లో ఉన్న అన్ని రకాల పాత్రలు పోషించారు. అయితే కాజల్‌ ఇప్పుడు రూట్‌ మార్చారు. సీరియస్‌ పాత్రలపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టారు. తన తాజా చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా నటించనున్నారు. నాగార్జున హీరోగా నటించనున్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం కోసం స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నారు కాజల్‌. ఈ సినిమాలో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయనున్నట్లు ఓ సందర్భంలో కాజల్‌ వెల్లడించారు. అలాగే తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

2014లో తమిళంలో వచ్చిన విజయ్‌ ‘జిల్లా’లో కాజల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘విరాటపర్వం’ కోసం ఉద్యమకారులుగా అక్రమాలపై తుపాకీతో గురి పెట్టారు ప్రియమణి, నందితా దాస్‌. ఈ చిత్రంలో కామ్రేడ్‌ భారతక్క పాత్రలో కనిపించనున్నారు ప్రియమణి. నందితా దాస్‌ కూడా ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ ఇద్దరూ అడవుల్లో తుపాకీ పట్టుకుని తాము నమ్మిన సిద్ధాంతాల కోసం వెండితెర ‘విరాటపర్వం’లో పోరాటం చేస్తారు‡. అలాగే ఈ సినిమాలోని పాత్రలకు తగ్గట్లుగా డీ గ్లామరస్‌గా కనిపిస్తారు ప్రియమణి, నందితా దాస్‌. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు.

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో గ్లామరస్‌ హీరోయిన్‌గా ప్రేక్షకుల్లో పాయల్‌ రాజ్‌పుత్‌కు మంచి పేరు వచ్చింది. అయితే తాను గ్లామరస్‌ పాత్రలు మాత్రమే కాదు.. పవర్‌ఫుల్‌ రోల్స్‌ కూడా చేయగలనని అంటున్నారు పాయల్‌. అందుకు నిదర్శనంగా పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రస్తుతం చేస్తున్న ‘5 డబ్ల్యూస్‌ (హూ, వాట్, వెన్, వేర్, వై) చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఇందులో వపర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు పాయల్‌. ఈ పాత్ర కోసం తాను ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు పాయల్‌ చెబుతున్నారు. అలాగే కొన్ని యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను పాయల్‌ డూప్‌ లేకుండా చేశారట. ప్రాణదీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘బ్లఫ్‌మాస్టర్‌’, ‘కల్కి’ వంటి సినిమాల్లో గ్లామరస్‌ అండ్‌ గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌ వంటి పాత్రలకే పరిమితమైన హీరోయిన్‌ నందితా శ్వేత తన తాజా చిత్రం ‘ఐపీసీ 376’ కోసం లాఠీ పట్టారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఫస్ట్‌ టైమ్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటించనుండటంతో నందితా శ్వేత బాగా ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌కుమార్‌ సుబ్బరామన్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. కెరీర్‌లో యాభైకి పైగా సినిమాలు చేసినప్పటికీ రాయ్‌లక్ష్మీ పేరు చెప్పగానే గ్లామరస్‌ హీరోయిన్‌ అనేస్తారు చాలామంది. కానీ రాయ్‌లక్ష్మీ ఇప్పుడు గేర్‌ మార్చారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు యాక్షన్‌ మూవీస్‌కు కూడా పచ్చజెండా ఊపుతున్నారు. కన్నడ ‘ఝాన్సీ ఐపీఎస్‌’ చిత్రంలో రాయ్‌లక్ష్మీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.

ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించే కథానాయికలకు ఇలాంటి పాత్రలు ఓ సవాల్‌. తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు. ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు