ఈ ఏడాది దంపతులుగా, తల్లిదండ్రులుగా ప్రమోట్‌ అయిన స్టార్స్‌

21 Dec, 2022 03:24 IST|Sakshi

ఈ ఏడాది ఇటు సౌత్‌.. అటు నార్త్‌లో పెళ్లి కళ కనిపించింది. అన్నీ కూడా దాదాపు ప్రేమ వివాహాలే. పెద్దల అనుమతితో వైభవంగా స్టార్స్‌ పెళ్లి చేసుకున్నారు. ఇక గతంలో పెళ్లి చేసుకున్న కొందరు స్టార్స్‌ ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాదే పెళ్లి చేసుకుని, పేరెంట్స్‌ అయినవారూ ఉన్నారు. పెద్దల అక్షింతలతో పెళ్లి చేసుకున్న, పిల్లల కేరింతలతో మురిసిపోతున్న స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.   

దక్షిణాదిలో లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. తన ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో జూన్‌ 9న ఏడడుగులు వేశారామె. విజయ్‌ సేతుపతి, నయన  జంటగా విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కించిన ‘నానుమ్‌ రౌడీదాన్‌’ (‘నేను రౌడీ’) చిత్రం వీరి ప్రేమకు పునాది అయింది. ఈ చిత్రనిర్మాణంలో భాగస్వామ్యం అయిన విఘ్నేష్‌–నయన నిజ జీవితంలోనూ భాగస్వాములు కావడం విశేషం. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు వీరు. కాగా పెళ్లయిన నాలుగు నెలలకే విఘ్నేష్‌–నయన తల్లిదండ్రులు కావడం హాట్‌ టాపిక్‌ అయింది.

కారణం సరోగసీ ద్వారా వీరు తల్లిదండ్రులు అయ్యారు. ఇక యువ హీరో నాగశౌర్య ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో నవంబర్‌ 20న మూడు ముళ్లు వేశారాయన. అనూషతో కొంత కాలంగా ఉన్న స్నేహం ప్రేమగా మారడం.. ఆ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వీరి వివాహం జరిగింది. అలాగే వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ఆది పినిశెట్టి పెళ్లి పీటలెక్కారు. తన ప్రేయసి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీతో ఆయన ఏడడుగులు వేశారు.

మే 18న వీరి వివాహం జరిగింది. అదే విధంగా ‘దేశముదురు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ హన్సిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన మిత్రుడు, ప్రియుడు అయిన వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాను ఆమె వివాహమాడారు. జైపూర్‌లో డిసెంబర్‌ 4న వీరి పెళ్లి జరిగింది. అలాగే హీరోయిన్‌ పూర్ణ దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్‌ గ్రూప్‌ కంపెనీ ఫౌండర్, సీఈవో షానిద్‌ ఆసిఫ్‌ అలీని వివాహం చేసుకున్నారు.

అక్టోబర్‌ 25న వీరి వివాహం దుబాయ్‌లో జరిగింది. కాగా సీనియర్‌ నటుడు కార్తీక్‌ తనయుడు, హీరో గౌతమ్‌ కార్తీక్, నటి మంజిమా మోహన్‌ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ‘దేవరాట్టం’ సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డ గౌతమ్, మంజిమా నవంబర్‌ 28న చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. ఇలా దక్షిణాదిన మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన జంటలు కొన్ని ఉన్నాయి. 

వచ్చే ఏడాది పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నారు రామ్‌చరణ్‌–ఉపాసన. కోడలు గర్భవతి అనే విషయాన్ని ఈ నెల 12న అధికారికంగా ప్రకటించారు చిరంజీవి. 2012 జూన్‌ 14న రామ్‌చరణ్, ఉపాసనల వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తమిళ దర్శకుడు అట్లీ కూడా తన భార్య ప్రియా మోహన్‌ గర్భవతి అని ఇటీవల ప్రకటించారు.  

అగ్రనిర్మాత ‘దిల్‌’ రాజు రెండో వివాహం 2020లో డిసెంబరు 10న తేజస్వినీతో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది జూన్‌ 29న తేజస్విని ఓ బాబుకు జన్మనిచ్చారు. తనయుడికి అన్వయ్‌ రెడ్డి అని నామకరణం చేశారు.

ఈ ఏడాది నుంచి కాజల్‌ అగర్వాల్‌ మాతృత్వం తాలూకు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం అంటే.. 2020 అక్టోబరు 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూతో కాజల్‌ అగర్వాల్‌ ఏడడుగులు వేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న కాజల్‌ ఓ బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబుకి నీల్‌ కిచ్లు అని నామాకరణం చేశారు. మరోవైపు గత ఏడాది మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజుని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. తమకు కుమార్తె పుట్టిన విషయాన్ని జూన్‌ 10న ప్రకటించారు. పాపకు అర్నా అని పేరు పెట్టుకున్నారు. మరోవైపు నమిత కూడా ఈ ఏడాదే పేరెంట్స్‌ క్లబ్‌లో చేరారు.

వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరితో కలిసి 2017 నవంబరు 24న తిరుపతిలో ఏడడుగులు వేశారు నమిత. ఈ ఏడాది ఆగస్టులో మే 10న తాను గర్భవతిననే విషయాన్ని నమిత అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కవలలకు (ఇద్దరు మగశిశువులు) జన్మనిచ్చినట్లు ఆగస్టులో ప్రకటించారు. కృష్ణ ఆదిత్య, కిరణ్‌ రాజ్‌ అనేవి వీరేంద్ర చౌదరి, నమిత దంపతుల కుమారుల పేర్లు. ఇక దర్శక–నటుడు రాహుల్‌ రావీంద్రన్, ప్రముఖ సింగర్, డబ్బింగ్‌ ఆర్టిస్టు చిన్మయి ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాది జూన్‌లో కవలలకు (మగశిశువు, ఆడశిశువు) జన్మనిచ్చారు చిన్మయి. శర్వస్, ద్రిప్త అనేవి వీరి పేర్లు.

కాగా రాహుల్‌ రవీంద్రన్, చిన్మయిల వివాహం 2014 మేలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్‌ౖ వెపు వెళితే ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనాస్‌ సరోగసీ ద్వారా మాల్టీ మారీ చోప్రా జోనస్‌ అనే పాపకు తల్లిదండ్రులైనట్లు జనవరిలో ప్రకటించారు. కాగా నిక్‌ జోనాస్, ప్రియాంకా చోప్రాల వివాహం 2018 డిసెంబరులో జరిగింది. మరోవైపు 2016 ఏప్రిల్‌ 30న నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ను పెళ్లాడిన హీరోయిన్‌ బిపాసా ఈ ఏడాది నవంబరు 12న ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ పాప పేరు దేవి బసు సింగ్‌ గ్రోవర్‌.

హిందీలో కూడా ఈ ఏడాది కొన్ని జంటలు షాదీ ముబారక్‌ (వివాహ శుభాకాంక్షలు) అందుకున్నాయి. బాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ ఏప్రిల్‌ 14న ఏడడుగులు వేశారు. ఈ ఇద్దరూ ‘బ్రహ్మాస్త్ర’లో జంటగా నటిస్తున్నప్పుడు ప్రేమలో పడి, నిజజీవితంలోనూ జంట అయ్యారు. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదే తల్లిదండ్రులయ్యారు కూడా. నవంబర్‌ 6న ఆలియా ఒక పాపకు జన్మనిచ్చారు. పాపకు రహా అని పేరు పెట్టారు.

మరో జంట అలీ ఫజల్‌–రిచా చద్దా దాదాపు పదేళ్లు ప్రేమించుకున్నారు. ‘ఫక్రి’ చిత్రం షూటింగ్‌లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. అక్టోబర్‌ 4న వీరి వివాహం జరిగింది. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే భార్యాభర్తలుగా తమ జీవితాన్ని ఆరంభించారు సూరజ్‌ నంబియార్‌–మౌనీ రాయ్‌. జనవరి 27న వీరి వివాహం జరిగింది. మరోవైపు ప్రేమికుల దినోత్సవానికి నాలుగు రోజుల తర్వాత  ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్నారు ఫర్హాన్‌ అక్తర్‌–షిబానీ దండేకర్‌.

ఫర్హాన్‌ హోస్ట్‌ చేసిన ‘ఐ కేన్‌ డూ దట్‌’ షోలో షిబానీ పాల్గొన్నారు. ఆ షోలోనే ఈ ఇద్దరూ తొలిసారి కలిశారు. 2015లో ఏర్పడిన వీరి పరిచయం ఈ ఏడాది పెళ్లి వరకూ వచ్చింది. ఇంకోవైపు దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని ఏడడుగులు వేశారు విక్రాంత్‌ మస్సే–షీతల్‌ ఠాకూర్‌. ఈ ప్రేమికుల దినోత్సవానికి (ఫిబ్రవరి 14) మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యారు విక్రాంత్‌–షీతల్‌. ఇక దర్శకురాలు గునీత్‌–వ్యాపారవేత్త సన్నీల వివాహం ఈ నెల 12న జరిగింది. ఇలా ఈ ఏడాది హిందీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి బాగానే కనిపించింది.  

మరిన్ని వార్తలు