కరోనాతో ప్రముఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కన్నుమూత

31 May, 2021 14:40 IST|Sakshi

కల చెదిరింది.. కన్నీరు మిగిలింది

కరోనా కాటుకు సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బలి

ప్రస్తుతం ఆచార్య సినిమాకు పనిచేస్తున్న శ్రీనివాస్‌

సాక్షి, వరంగల్‌: ఓ గిరిజన యువకుడికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టమే సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను చేసింది. ప్రస్తుతం మూడు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ బిజిగా గడుపుతున్న అతడిని విధి వెంటాడింది. కరోనా రూపంలో మృత్యువు కబళించగా.. ఇంతకాలం కన్న సినిమా కలలన్నీ చెదిరిపోయాయి. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం లూనావత్‌ తండా గ్రామ పంచాయతీకి చెందిన లూనావత్‌ శ్రీనివాస్‌ (30)కు చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన వనజతో 2011 సంవత్సరం వివాహం అయింది. వారికి ఇద్దరు కుమారులు అర్జున్‌(7), అదర్వ(22 నెలలు) ఉన్నారు. కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనివాస్‌.. మూడేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య సినిమాకు డైరెక్టర్‌ కొరటాల శివ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌ పనిచేస్తున్నారు. అలాగే నందినిరెడ్డి అనే మరో మహిళా డైరెక్టర్‌ వద్ద.. పొలిమేరు అనే మరో సినిమాకు కూడా శ్రీనివాస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న క్రమంలో ఈనెల 2వ తేదీన శ్రీనివాస్‌ కరోనా బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌ నుంచి ఖమ్మం తీసుకొచ్చి ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ఈనెల 12న మృతి చెందారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం పుట్టిల్లు అయిన ఉగ్గంపల్లికి వచ్చింది. వనజ అత్తగారి ఇంటివద్ద ఎకరం భూమి తప్ప ఈ కుటుంబానికి ఏ ఆధారం లేదు. దీంతో దిక్కుతోచని స్థితితో ఇద్దరు చిన్నారులతో తల్లి కన్నీటి పర్యంతం అయింది.

చదవండి: అజయ్‌ కొత్త బంగ్లా: ఖరీదు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

మరిన్ని వార్తలు