సినిమా తీయాలంటే కోరిక తీర్చాలి!

20 May, 2022 07:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కథా రచయిత్రిని వేధించిన చోటా నిర్మాత 

పట్టుకున్న షీ–టీమ్స్, గోల్కొండ ఠాణాలో కేసు 

ఈ ఏడాది ఇప్పటి వరకు 423 ఫిర్యాదులు

సాక్షి,హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ కథా రచయిత్రికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఆమె రాసిన కథను సినిమాగా తీస్తానంటూ ముందుకు వచ్చిన చోటా నిర్మాత అలా చేయాలంటే తన కోరిక తీర్చాలని షరతు పెట్టాడు. ఆమె తిరస్కరించడంతో ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. బాధితురాలు హైదరాబాద్‌ షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. సాంకేతిక ఆధారాలతో అతడిని పట్టుకుని గోల్కొండ ఠాణాలో కేసు నమోదు చేయించి, కటకటాల్లోకి పంపినట్లు అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ గురువారం వెల్లడించారు.

సిటీ షీ–టీమ్స్‌కు ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 423 ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. 203 మంది నేరుగా, 181 మంది సోషల్‌మీడియా ద్వారా ఫిర్యాదులు చేసినట్లు వివరించారు. వీటికి సంబంధించి ఆయా ఠాణాల్లో 57 క్రిమినల్‌ కేసులు, 25 పెట్టీ కేసులు నమోదయ్యాయని, 52 మంది పోకిరీలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని 15 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. షీ–టీమ్స్‌కు చిక్కిన వారిలో 191 మంది మేజ ర్లు, 23 మంది మైనర్లు ఉన్నారన్నారు. వేధింపులు బారినప డిన వారు ఎవరైనా నేరుగా భరోస సెంటర్‌లోని షీ–టీమ్స్‌ కేంద్రానికి వచ్చి లేదా వాట్సాప్‌ నం.94906 16555ల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏఆర్‌ శ్రీనివాస్‌ కోరారు.  

ఇద్దరికి ఎనిమిది రోజుల చొప్పున జైలు... 
షీ–టీమ్స్‌కు చిక్కుతున్న పోకిరీలు, వేధింపురాయుళ్లకు న్యాయస్థానం జైలు శిక్షలు విధిస్తోందని ఏఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. చార్మినార్‌కు చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ (68) తన పక్కింట్లో ఉండే మహిళను వేధించాడు. కోరిక తీర్చాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో షీ–టీమ్స్‌ అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి నిందితుడికి ఎనిమిది రోజుల జైలు, రూ.250 జరిమానా విధించింది.

చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సోహైల్‌ (21) సంతోష్‌నగర్‌ చౌరస్తా సమీపంలోని ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని అక్కడి షీ–టీమ్స్‌ గుర్తించాయి. అతడిని అనుసరించగా... ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడం గమనించారు. ఈ తతంగాన్ని వీడియో రికార్డు చేసిన షీ–టీమ్స్‌  అతడిని కోర్టులో హాజరుపరచగా ఎనిమిది రోజుల శిక్ష పడింది. సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన యువతిని వేధిస్తున్న షేక్‌ ముఖ్రమ్‌ అహ్మద్, ఓయూ ఠాణా పరిధిలో మహిళలకు వాట్సాప్‌ సందేశాలు పంపి బెదిరిస్తున్న ఇ.శ్రీనివాస్‌లను షీ–టీమ్స్‌ పట్టుకుని స్థానిక ఠాణాలకు అప్పగించగా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.  

చదవండి: Mahesh Babu: 'నేను డైరెక్టర్‌ అయితే ఆ సినిమాను రీక్రియేట్‌ చేస్తా'

మరిన్ని వార్తలు