బీ పాజిటివ్‌

6 Sep, 2020 03:28 IST|Sakshi
తమన్నా, జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌, కృతీ సనన్‌

ప్రస్తుతం ఎటు చూసినా కరోనా పాజిటివిటీ. సామాజిక వేదికల నిండా నెగటివిటీ. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా ముఖ్యం. కరోనాకి నెగటివ్‌గా ఉంటూ... మానసికంగా పాజిటివ్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. ఎనర్జీలు మన మాట వినేలా చేసుకోవాలి.  ఈ కరోనా కష్టకాలాన్ని దాటే మాత్రను కనిపెట్టే పనిలో ఉన్నారు పరిశోధకులు. ఆ మందు వచ్చేలోగా పాటించాల్సిన మంత్రం ఒకటుందంటున్నారు మన కథానాయికలు.
‘‘బీ పాజిటివ్‌’ – అదే మనందర్నీ ఉంచుతుంది యాక్టివ్‌’’ అని తమ అభిప్రాయాల్ని షేర్‌ చేసుకున్నారు పలువురు కథానాయికలు. ఈ అందాల తారలు ఏమంటున్నారో చూద్దాం.

ప్రేమను పంచుదాం
– తమన్నా
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా నెగటివ్‌ ఎనర్జీ కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపుతున్నారు. ప్రస్తుతం మనందరం సాధారణమైన పరిస్థితుల్లో లేము. అందరం ఓ విపత్తును ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయాల్లో మనందరం ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. మన తోటి వారికి ప్రేమను పంచుదాం. ద్వేషాన్ని కాదు. సోషల్‌ మీడియాను ఒకరితో ఒకరం కనెక్ట్‌ అవ్వడానికి ఉపయోగిద్దాం. నిందించడానికి, నెగటివిటీని పంచడానికి కాదు. ఒకరికి ఒకరం నిలబడితే ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చు.

నిరాశను దగ్గరకు రానివ్వకండి
– జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌
ఈ లాక్‌డౌన్‌లో నేను ఆచరించింది ఏంటంటే.. పాజిటివ్‌గా ఆలోచించడం, నన్ను నేను స్ట్రాంగ్‌గా ఉంచుకోవడం. మనసు పాజిటివ్‌గా ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం మనకు ఏర్పడుతుంది. జీవితానికి కొత్త ఆశ కలుగుతుంది. మనం ఏదైనా చేయాలన్నా, కొత్త మనిషిగా మారాలన్నా ముందు మన ఆలోచనల నుంచి మొదలుపెట్టాలి. మన ఆలోచనలే మనం. వాటిని సక్రమంగా ఉంచుకుని, ఆచరించగలిగితే చాలు. ప్రస్తుతం అందరం ఒకలాంటి అనిశ్చితిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మనందరం మరింత ధైర్యంగా నిలబడాలి. నిరాశను దగ్గరకు రానివ్వకండి. నెగటివిటీ పంచకండి. పాజిటివ్‌గా ఉందాం.

ఏది ఇస్తే అదే తిరిగొస్తుంది
– కృతీ సనన్‌
మనందరం మన ఆలోచనల ద్వారా ఓ ఎనర్జీను మన చుట్టూ నింపుకుంటాం అని నమ్ముతాను. ఆ ఎనర్జీ ద్వారానే మరొకరితో కనెక్ట్‌ అవుతాం. నువ్వు పాజిటివ్‌గా ఆలోచిస్తే నీ చుట్టూ పాజిటివ్‌ ఎనర్జీయే ఉంటుంది. పాజిటì వ్‌గా ఆలోచించేవాళ్లే నీతోనూ కనెక్ట్‌ అవుతారు. ఒకవేళ నెగటివ్‌ అయితే నెగటివ్‌గా ఆలోచించేవాళ్లను ఆకర్షిస్తావు. అంటే మనం ఏది ఇస్తే అదే తిరిగి మన దగ్గరకు వస్తుంది. అందుకే ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. తీసుకున్న నిర్ణయాన్ని బలంగా నమ్మండి. అదే ఆచరించండి. ఇదే నా మంత్రం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైన మంత్ర ఏంటంటే... ప్రేమను పంచండి. తిరిగి ప్రేమనే పొందండి.

మరిన్ని వార్తలు