-

P Chandra Shekar Reddy: ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు కన్నుమూత

4 Jan, 2022 08:47 IST|Sakshi

Tollywood Director P Chandra Shekar Reddy Died: ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (పి. చంద్రశేఖరరెడ్డి) ఇకలేరు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో చెన్నైలో టీ నగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. పీసీ రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. సొంత ఊరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామం. 1933 అక్టోబర్‌ 15న పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. 1959లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకులు వి. మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావుల చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. దర్శకుడిగా మారాక ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు తదితర స్టార్స్‌తో సినిమాలు తెరకెక్కించారు.

చదవండి: దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్‌ తనయుడు డేటింగ్‌, ఫొటోలు వైరల్‌

దర్శకుడిగా ఆయన అంగీకరించిన తొలి చిత్రం ‘అనురాధ’ (1971). కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందింది. అయితే ఇది మూడో చిత్రంగా విడుదలైంది. అదే ఏడాది కృష్ణతో ‘అత్తలు – కోడళ్లు’, శోభన్‌బాబు హీరోగా ‘విచిత్ర దాంపత్యం’ చిత్రాలు తెరకెక్కించారు. విశేషం ఏంటంటే... ఈ రెండు చిత్రాలూ ఒకే రోజు (1971, ఏప్రిల్‌ 14) విడుదల కావడంతో పాటు దర్శకుడిగా మంచి పేరు తెచ్చాయి. ఇక మాస్‌ హీరోగా ఎన్టీఆర్‌ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఆయన హీరోగా పీసీ రెడ్డి తెరకెక్కించిన ‘బడి పంతులు’ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో ఎన్టీఆర్‌ని వృద్ధ బడిపంతులుగా చూపించి, ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆయన సరసన కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.

కృష్ణతో పీసీ రెడ్డిది ప్రత్యేక అనుబంధం. కృష్ణతో 20 పై చిలుకు చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ‘పాడి పంటలు’, ‘పచ్చని కాపురం’ వంటి హిట్‌ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఏసు ప్రభువు పాత్రలో కృష్ణతో ‘శాంతి సందేశం’ కూడా తెరకెక్కించారు. ఇంకా కృష్ణతో పాటు ఇతర స్టార్స్‌తో పీసీ రెడ్డి చేసిన చిత్రాల్లో ‘భలే అల్లుడు’, ‘మానవుడు – దానవుడు’, ‘రగిలే గుండెలు’, ‘నవోదయం’, ‘బంగారు కాపురం’, ‘రాజకీయ చదరంగం’, ‘అన్నా వదిన’, ‘పట్నవాసం’, ‘అన్నా చెల్లెలు’, ‘పెద్దలు మారాలి’ వంటివి ఉన్నాయి. పీసీ రెడ్డి కెరీర్‌లో నాలుగైదు సినిమాలు ఆగిపోయినవి ఉన్నాయి. వాటిలో చిరంజీవి హీరోగా ఆరంభమైన ‘చిన్న పులి – పెద్ద పులి’ ఒకటి. పీసీ రెడ్డి చివరి చిత్రం ‘జగన్నాయకుడు’. దివంగత నేత వైయస్‌ రాజశేఖర రెడ్డి జీవిత విశేషాలతో భానుచందర్, రాజా, మమత తదితరుల కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది.

పలు పౌరాణిక, సాంఘిక టీవీ సీరియల్స్‌ కూడా తెరకెక్కించారు. కృష్ణతో చేసిన ‘అన్నయ్య’ సీరియల్‌ మంచి హిట్‌. 40 ఏళ్లకు పైబడిన కెరీర్‌లో 75 సినిమాల వరకూ దర్శకత్వం వహించారాయన. పీసీ రెడ్డి భార్య కొంతకాలం క్రితం కన్ను మూశారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు శ్రీదేవి, అనురాధ. పీసీ రెడ్డి భౌతిక కాయానికి దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, తమిళ దర్శకుడు ఆర్వీ ఉదయ్‌ కుమార్, నటుడు వైభవ్‌ తదితరులు నివాళులర్పించారు. కాగా పీసీ రెడ్డి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం చెన్నైలోని కొట్టూరుపురంలోని శ్మశానవాటికలో జరిగాయి.

మరిన్ని వార్తలు