కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!

5 Feb, 2021 00:09 IST|Sakshi
నాగ్‌ అశ్విన్‌, నందినీ రెడ్డి, తరుణ్‌ భాస్కర్‌, సంకల్ప్‌ రెడ్డి

నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించిన యాంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’. నాలుగు కథలున్న ఈ యాంథాలజీను తరుణ్‌ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్‌ అశ్విన్, సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మీ మంచు, జగపతి బాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, ఈషా రెబ్బా, సత్యదేవ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ కానున్న ఈ యాంథాలజీ ట్రైలర్‌ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ నలుగురు దర్శకులు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీలో ఎక్కువ శాతం వీక్షకులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అని సర్వేలో ఉంది. పెనం మీద నీళ్లు వేస్తే ఆవిరైపోయినట్టు అయిపోతుంది కంటెంట్‌. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్‌ లేదు. ఆ డిమాండ్‌ చాలా ఉంది. ఓటీటీ అవకాశం వచ్చినప్పుడు ఆడియన్స్‌ చూస్తారా? చూడరా? అని ఆలోచించలేదు. కొత్త ఫార్మాట్‌లో కథ చెప్పగలుగుతున్నాం అని ఎగ్జయిట్‌ అయ్యాను. మమ్మల్ని మేం టెస్ట్‌ చేసుకోవచ్చు అనిపించింది. కొత్తదారిలో వెళ్లొచ్చు అనిపించింది. ఎంత సమయంలో కథ చెబుతున్నాం అనేది చాలెంజ్‌ కాదు అనిపించింది. యాడ్‌ ఫిల్మ్‌లోనూ ఒక కథ చెప్పొచ్చు. 30 నిమిషాల్లో కథ చెప్పడం బావుంది’’ అన్నారు.

తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే సినిమా కథకు ఇది సరిపోతుందా? సరిపోదా అని ఆలోచించుకోవాలి. కానీ చాలా కథలు 20–30 నిమిషాల్లో చెప్పేవి ఉంటాయి. దాన్ని సినిమాగా చేయలేం. ఇలాంటి యాంథాలజీల్లో, డిజిటల్‌లో ఈ కథలు చెప్పొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది. ఈ యాంథాలజీ చేస్తూ దర్శకులుగా మమ్మల్ని మేం కనుగొన్నాం అనిపించింది. ఇది భారీ మార్పుకు దారి తీస్తుంది. మనం కథల్ని చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ధైర్యం చేసేయాలి. మేం చేశాం. ఇలా చేసినప్పుడు కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం. స్టార్స్‌ కూడా ఓటీటీలో చేయాలి. చిన్న తెరపై కనిపిస్తే స్టార్‌డమ్‌ తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రతీ స్క్రీన్‌కి వెళ్లి.. కథల్ని ఇంకా ఎంత కొత్తగా చెప్పగలం అని ప్రయత్నిస్తూనే ఉండాలి’’ అన్నారు.

నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘30 నిమిషాల్లో కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది.  అందరి కంటే లాస్ట్‌ నా పార్ట్‌ షూట్‌ చేశాను. మార్చిలో షూట్‌ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్‌ వచ్చింది. కోవిడ్‌ తర్వాత షూట్‌ చేయడం మరో చాలెంజ్‌. కోవిడ్‌ టెస్ట్‌ వల్ల కాస్త బడ్జెట్‌ యాడ్‌ అయింది (నవ్వుతూ). మారుతున్న టెక్నాలజీ మనకు బలం ఇస్తుందా? లేక దానికి మనం బలం ఇస్తున్నామా అనే ఆలోచనతో నా కథను తెరకెక్కించాను’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌.

సంకల్ప్‌ రెడ్డి మాట్లాడుతూ –‘‘అన్ని కథలు థియేటర్‌కి సెట్‌ కావు. అలాంటి కథలు ఓటీటీలో ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు చూసుకోవచ్చు. ఈ పిట్ట కథలు అలాంటివే. చిన్న కథలోనూ సంపూర్ణంగా అనిపించే ఫీలింగ్‌ కలిగించొచ్చు. ఈ కొత్త ఫార్మాట్‌ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలు ఇంకా చెప్పాలనుంది’’ అన్నారు.
 

మరిన్ని వార్తలు