కెల్విన్‌తో కలిపి నందు విచారణ

8 Sep, 2021 01:44 IST|Sakshi

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ 

వాంగ్మూలాల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసిన అధికారులు 

గడువుకు ముందే ఈడీ విచారణకు సినీనటుడు నందు 

నేడు విచారణకు రానా

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌. ఈ కేసుకు సంబంధించిన మనీల్యాండరింగ్‌ వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటివరకు ముగ్గురిని ప్రశ్నించగా... మంగళవారం సినీ నటుడు నందు విచారణ సమయంలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు తెర తీశారు.

డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌ను సైతం ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు ఇద్దరినీ విడివిడిగా, ఆ తర్వాత కలిపి విచారించారు. దాదాపు ఏడు గంటల విచారణ తర్వాత నందును పంపించగా, కెల్విన్‌ విచారణను కొనసాగించారు. ఆయనను రాత్రి 10 గంటలకు పంపించారు.  కెల్విన్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.  

ఈడీ ముందుకు ముందే... 
షెడ్యూల్‌ ప్రకారం నందు ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 20న హాజరుకావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో నందు మంగళవారమే ఈడీ ముందు హాజరయ్యారు. కెల్విన్‌తో నందుకు కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌ కొనుగోలుకు నగదు వెచ్చించారా? లేక కెల్విన్‌కు బదిలీ చేశారా? అన్న కోణంలో నందు విచారణ సాగింది.

ఈ ఆరోపణలు నిరాధారమంటూ కొట్టేసిన నందు తన బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్‌ను అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. అధికారులు నందు సమగ్ర వాంగ్మూలం నమోదు చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటీమణులు చార్మీ, రకుల్‌ప్రీత్‌సింగ్‌ల విచారణ సమయంలో కెల్విన్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకురాని అధికారులు నందు విచారణ సమయంలో మాత్రం ఆయనను తీసుకురావడం గమనార్హం.

నందు ఉదయం ఈడీ ఎదుటకు రాగా... మధ్యాహ్నం కేంద్ర బలగాలతో కూడిన ప్రత్యేక బృందం కెల్విన్‌ను తీసుకొచ్చింది. అతడి ఇంటి నుంచి కొన్ని పత్రాలు, ల్యాప్‌టాప్, ఫోన్లనూ అధికారులు తెచ్చారు.  

ఎదురెదురుగా ఉంచి ప్రశ్నలు 
కెల్విన్‌ కాల్‌ డేటాలో నందు నంబర్‌ ఉన్నట్లు గతంలో ఎక్సైజ్‌ అధికారులూ గుర్తించారు. వాట్సాప్‌లోనూ వీరి మధ్య జరిగిన చాటింగ్స్‌నూ ఆరా తీశారు. ఇప్పుడు ఈడీ అధికారులు సైతం ప్రధానంగా ఈ అంశాలపైనే ఇద్దరినీ విచారించారు. కెల్విన్‌ ఈవెంట్‌ మేనేజర్‌ కావడం వల్ల సంప్రదింపులు జరిపానని, అంతకుమించి తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని నందు చెప్పినట్టు తెలిసింది.

సినిమా రంగంలో ఎవరైనా డ్రగ్‌ వాడతారా? అని ఈడీ అధికారులు ప్రశ్నించగా.. తన వద్ద ఎలాంటి సమాచారం లేదని నందు చెప్పినట్లు తెలిసింది. రెండు గంటలపాటు నందు, కెల్విన్‌లను విడివిడిగా విచారించిన అధికారులు.. ఆపై ఇద్దరినీ కలిపి విచారిస్తూ కొన్ని సందేహాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈడీ నందుతోపాటు మరికొందరిని మరోసారి విచారించే అవకాశం ఉంది.  

రానాకు అనూహ్యంగా.. 
ఈడీ జారీ చేసిన సమన్ల ఆధారంగా బుధవారం సినీ నటుడు దగ్గుబాటి రానా విచారణకు హాజరుకావాలి. 2017లో సిట్‌ విచారణలో ఆయన పేరు రాలేదు. అయితే అనూహ్యంగా ఈడీ అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. మరోపక్క కెల్విన్‌ను ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేయడానికి ముందే 2016లో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి న్యాయస్థానం కెల్విన్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.   

మరిన్ని వార్తలు