పండగ సందడి: ద‘సరదా’ షురూ

27 Sep, 2021 23:50 IST|Sakshi
‘మహాసముద్రం’లో సిద్ధార్థ్, శర్వానంద్‌ 

సినీప్రియులకు పండగ ఎప్పుడంటే బోలెడన్ని సినిమాలు విడుదలైనప్పుడు. పండగలప్పుడు సినిమా రిలీజుల సందడి, పండగ సందడితో డబుల్‌ ఆనందం దక్కుతుంది. అయితే గత ఏడాది దసరా పండగ సినీ లవర్స్‌ని నిరుత్సాహపరిచింది. థియేటర్ల లాక్‌డౌన్‌ వల్ల గత దసరాకి సినిమాలు విడుదల కాలేదు. ఈ దసరాకి సరదా షురూ అయింది. దసరా ఆరంభం నుంచి ముగిసే వరకూ ఈ నవరాత్రికి అరడజను సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.

ఉద్యోగం వేటలో అలసిపోయిన రవీంద్ర యాదవ్‌ జీవితం ఆటలోనైనా గెలవాలని గొర్రెల కాపరిగా కొండపొలం వెళతాడు. అక్కడ ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. అడవిలోని క్రూరమైన జంతువులతో పాటు హానికరమైన మనుషులతో కూడా రవీంద్ర యాదవ్‌ పోరాడాల్సి వస్తుంది. మరి.. ఈ పోరాట ఫలితం ఏంటి? అనేది థియేటర్స్‌లో తెలుస్తుంది. కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ తేజ్, ఓబులమ్మ పాత్రలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండపొలం’.


‘కొండపొలం’లో వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌

సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. బిబో శ్రీనివాస్‌ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదల కాగా, దేవీ నవరాత్రులు మొదలైన మరుసటి రోజు.. అంటే అక్టోబరు 8న ‘కొండపొలం’ థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.

ఇక నెల్సన్‌ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’ చిత్రం తెలుగులో ‘వరుణ్‌ డాక్టర్‌’గా అక్టోబరు 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కోటపాడి జె. రాజేష్‌ ఈ చిత్రానికి నిర్మాత.


‘డాక్టర్‌’లో శివకార్తికేయన్‌

అమ్మాయిల కిడ్నాప్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రియాంకా అరుల్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వినయ్‌రాయ్, యోగిబాబు, మిళింద్‌ తదితరులు కీలక పాత్రధారులు.

మరోవైపు ‘ఆర్‌ ఎక్స్‌ 100’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మహాసముద్రం’ కూడా పండగకి వస్తోంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్‌ హైదరీ హీరోయిన్లు. ఒక అమ్మాయి ప్రేమ, ఇద్దరు అబ్బాయిల జీవితాలను ఎలా మార్చింది? అనే అంశంతో ఈ సినిమా కథనం సాగుతుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది.

దసరాకి ‘ఎనిమి’గా థియేటర్స్‌లోకి వస్తున్నాడు విశాల్‌. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్య మరో హీరో. స్నేహితుడి నమ్మకద్రోహం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది.


‘ఎనిమీ’లో విశాల్, ఆర్య

ఇక ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ కూడా దూసుకొస్తున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది.


‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో పూజా హెగ్డే, అఖిల్‌

పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ కుర్రాడు, స్టాండప్‌ కమెడియన్‌ అయిన ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? అనే అంశం ఆధారంగా ఈ చిత్ర కథనం సాగుతుంది.

మరోవైపు ఇదే రోజు ‘వరుడు కావలెను’ అంటూ థియేటర్స్‌కు వస్తున్నారు హీరోయిన్‌ రీతూ వర్మ. నాగశౌర్యనే ఈ వరుడు.


‘వరుడు కావలెను’ లో రీతూవర్మ

వీరి కల్యాణం పెళ్లి పీటలపైకి వెళ్లే క్రమంలో జరిగే సంఘటనల డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య డైరెక్టర్‌.

ఈ సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా దసరా రిలీజ్‌ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. మరి.. ఈ విజయ దశమికి ప్రేక్షకులు ఏ చిత్రానికి విజయాన్ని అందిస్తారో? ఎవరి దశను తిప్పుతారో చూడాలి.

మరిన్ని వార్తలు