అడవి బాట... బాక్సాఫీస్‌ వేట

8 Jun, 2022 08:16 IST|Sakshi

అడవిలో వేటకు దిగారు హీరోలు.. ఒకరి వేట అక్రమార్కులను అంతం చేయడం కోసం.. ఒకరి వేట స్మగ్లింగ్‌ చేయడం కోసం.. ఎవరి వేట ఏదైనా అంతిమంగా బాక్సాఫీస్‌ వసూళ్ల వేట కోసమే. కొందరు తెలుగు హీరోలు, దర్శకులు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంలో కథలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ మధ్య ‘అడవి’ సినిమాలు కొన్ని వచ్చాయి. ఇక రానున్న ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాల గురించి తెలుసుకుందాం. 

హీరో అల్లు అర్జున్‌– దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు లవ్‌స్టోరీగా ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. కంప్లీట్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీ అని తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ ‘పుష్ప: ది రైజ్‌’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ రెచ్చిపోయి నటించారు. ‘పుష్ప: ది రైజ్‌’ ఇచ్చిన విజయంతో మరింత జోష్‌తో ‘పుష్ప’లో రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్‌’పై ఫోకస్‌ పెట్టారు అల్లు అర్జున్, సుకుమార్‌. 

‘పుష్ప: ది రైజ్‌’ అడవి బ్యాక్‌డ్రాప్‌లో సాగినట్లే ‘పుష్ప: ది రూల్‌’ కూడా అడవి బ్యాక్‌డ్రాపే. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిసింది. ఇక ‘విరాటపర్వం’ కోసం వెండితెర విప్లవకారుడు రవన్న అవతారం ఎత్తారు హీరో రానా. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. 1990 నాటి పరిస్థితుల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్‌ అడవిలోనే జరిగింది. ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వాహబ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది.

మరోవైపు ఇటీవలి కాలంలో మారేడుమిల్లి ఫారెస్ట్‌లోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేశారట ‘అల్లరి’ నరేశ్‌. ఎందుకంటే... ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కోసం. అడవిలో నివాసం ఉండే ఓ ఆదివాసీ  తెగ సమస్యలను పరిష్కరించే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్‌. ఈ సినిమా కథనం కూడా అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఈ చిత్రానికి ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ‘సింబా’ చిత్రం కోసం ఫారెస్ట్‌మేన్‌గా మారిపోయారు జగపతిబాబు. దర్శకుడు సంపత్‌ నంది కథ అందిచడంతో పాటు ఓ నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మురళీ మోహన్‌ రెడ్డి దర్శకుడు.

ఈ చిత్రంలో ప్రకృతి ప్రేమికుడి పాత్రలో కనిపిస్తారు జగపతిబాబు. పర్యావరణ అంశాల నేపథ్యంలో సినిమా కాబట్టి ‘సింబా’ మేజర్‌  షూటింగ్‌ అడవి బ్యాక్‌ డ్రాప్‌లో ఉంటుందనుకోవచ్చు. అలాగే దివంగత నటుడు హరనాథ్‌ మనవడు విరాట్‌రాజ్‌ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఇక ఈ ఏడాది  రిలీజైన ‘భీమ్లా నాయక్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’, చిత్రాలు కూడా అడవి నేపథ్యంతో కూడుకున్నవే. రాబోయే రోజుల్లో మరికొన్ని అడవి కథలు వెండితెర పైకి రానున్నాయి.   

అడవి బాటలోనే మహేశ్‌-రాజమౌళి సినిమా కూడా:
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కథ అందిస్తున్న రచయిత విజయేంద్రప్రసాద్‌ సైతం మహేశ్‌ సినిమా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు