ఫిల్మ్‌ మేకింగ్‌లో నాకు నచ్చింది అదే!

5 Oct, 2021 01:05 IST|Sakshi

‘‘దర్శకులంతా కలిసినప్పుడు పుస్తకాల గురించి చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో ఓసారి డైరెక్టర్స్‌ అందరం కలిసినప్పుడు ‘కొండపొలం’ నవల గురించి ఇంద్రగంటి మోహనకృష్ణ, సుకుమార్‌ గార్లు చెప్పడంతో చదివాను.. బాగా నచ్చడంతో సినిమాగా తీశా’’ అని దర్శకుడు క్రిష్‌ అన్నారు. వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్‌ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు  నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా క్రిష్‌ చెప్పిన విశేషాలు. 

సాహసం నేపథ్యంలో ఓ కథ చెప్పాలనుకున్నాను. ఆ సమయంలో ‘సప్తభూమి, కొండపొలం’ పుస్తకాలు చదివా. ‘కొండపొలం’ బాగా నచ్చడంతో ఆ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిని కలిసి హక్కులు తీసుకున్నాం. ‘కొండపొలం’ హక్కులు కొన్నావా? అని సుకుమార్‌ అడిగారు. నేను తీసుకున్నానని చెప్పడంతో వదిలేశారు. లేకుంటే ఆయన తీసుకోవాలనుకున్నారు. ‘సప్తభూమి’ నవల హక్కులు కొనేందుకు ట్రై చేశాం.. కానీ కుదరలేదు. 

రచయితకు విపరీతమైన పరిధి ఉంటుంది. పుస్తకం రాయడం వేరు.. సినిమాగా తీయడం వేరు. సన్నపురెడ్డి ‘కొండపొలం’ అద్భుతమైన కథ.. స్క్రీన్‌ప్లే చక్కగా ఉంటుంది. ఆ కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. కానీ దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే బాగుంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్‌ చేశాం. దాన్ని సన్నపురెడ్డికి చెప్పాను.. ఆయనే ఈ సినిమాకు కథనం రాయడం వల్ల నాకు సులభం అయ్యింది.

వైష్ణవ్‌ను తన పదో తరగతి అప్పుడో ఇంటర్‌లోనో చూశాను. ‘కొండపొలం’ అనుకున్నప్పుడు తనను ఓ పార్టీలో చూశా. అప్పటికింకా తన ‘ఉప్పెన’ చిత్రంలోని ‘నీ కళ్లు నీలి సముద్రం..’ పాట రాలేదనుకుంటాను. ఆ పాట చూడమన్నాడు.. చూడగానే వైష్ణవ్‌ తేజ్‌ కళ్లు బాగా అట్రాక్ట్‌ చేశాయి. కొండపొలం’లో రవీంద్ర పాత్రకు వైష్ణవ్‌ తేజ్‌ సరిపోతాడనిపించింది. వైష్ణవ్‌ని ఇంటికి పిలిపించి సినిమా గురించి చెప్పాను. వైష్ణవ్‌కి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్‌ ఉండదు. నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది.. అందుకే ‘ఉప్పెన’, ‘కొండపొలం’ లాంటి కథలు ఎంచుకున్నాడు.

ఓబులమ్మ పాత్రకు రకుల్‌ ప్రీత్‌ సరిపోతారని కెమెరామేన్‌ జ్ఞానశేఖర్‌ చెప్పారు. ఈ కథను రకుల్‌కు చెబుతున్నప్పుడే ఆమె హావాభావాలు చూసి ఈ పాత్రకు సరిపోతుందనుకున్నాను. తనకూ కథ నచ్చడంతో పాత్ర కోసం మరింత సన్నబడింది. 

గొర్రెలను అడవులకు తీసుకెళ్తే పులులు వస్తాయని గోవాలో షూటింగ్‌కి పర్మిషన్‌ ఇవ్వలేదు. నల్లమలలో తీద్దామనుకుంటే కోవిడ్‌ వల్ల కుదరలేదు. అందుకే వికారాబాద్‌ అడవుల్లో చేశాం. కొండపై దాదాపు 1000 గొర్రెలతో షూటింగ్‌ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఉదయం 6:30 గంటలకే అందరం సెట్స్‌లో ఉండేవాళ్లం. ఈ సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరిలా భావిస్తాం.. అంతలా కథలో లీనమవుతాం. 

‘కొండపొలం’ కోసం సంగీత దర్శకునిగా ముందుగా కీరవాణిగారి తనయుడు కాలభైరవకి ఫోన్‌ చేశాను. ‘కొండపొలం’ చదివి కీరవాణిగారు ఎగై్జట్‌ అయ్యారు. మీ కంటే ముందు ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఫోన్‌ చేశానని కీరవాణిగారికి చెప్పడంతో ఎవరు? అన్నారు. కాలభైరవ అంటే నవ్వారు. ‘ఎవరు కావాలో నువ్వే తేల్చుకో?’ అనడంతో ‘మీరే కావాలి’ అన్నాను.
∙ఫిల్మ్‌ మేకింగ్‌లో నాకు నచ్చింది రచనే. ఇప్పుడు నేను హాట్‌ స్టార్‌కు ఓ కథ రాస్తున్నాను. నేను చేసే ప్రతి సినిమా ఓ కొత్త అధ్యాయంలా ఉంటే ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ‘అతడు అడవిని జయించాడు’ స్ఫూర్తితో వెంకటేశ్‌గారితో అడవి నేపథ్యంలో సినిమా చేయాల్సింది... కానీ కుదర్లేదు. 

మరిన్ని వార్తలు