పెద్ద దిక్కును కోల్పోయాం : చిరంజీవి

29 Jul, 2020 03:04 IST|Sakshi

‘నేను హీరోగా పరిచయం అయిన తొలి రోజుల నుంచి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించాను. ముఖ్యంగా మా కాంబినేషన్‌లో వచ్చిన ‘చంటబ్బాయ్, మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఆయన మరణం తీరని లోటు. కొండలరావు, ఆయన సతీమణి రాధాకుమారిగార్లు జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి, వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేది. రావి కొండలరావుగారి మరణంతో  చిత్రపరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది’ అని నటుడు చిరంజీవి అన్నారు.

నా కథలు కొండలరావుకి చెప్పేవాణ్ణి – నటుడు గిరిబాబు
మద్రాసులో ఉన్నప్పటి నుంచి రావి కొండలరావుగారితో నాకు పరిచయం ఉంది. ఆయన చాలా గొప్పవారు.. మంచి మనిషి. స్నేహశీలి. చక్కని ప్రవర్తన ఉన్నవాడు. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయా ప్రొడక్షన్స్‌ సంస్థకు ఆయన ఎంతో నమ్మకస్తుడు. అందుకే ‘భైరవద్వీపం, బృందావనం, శ్రీకృష్ణార్జున విజయం’ వంటి చిత్రాలు కొండలరావుగారి నిర్మాణ నిర్వహణలోనే పూర్తి చేశారు. నేను, ఆయన కలిసి చాలా సినిమాలు చేశాం.

నేను హీరోగా చేసిన ‘వధూవరులు’ చిత్రంలో మంజు భార్గవి తండ్రి పాత్ర చేశారాయన. నా సొంత సినిమా ‘సంధ్యారాగం’లోనూ ఆయనకు మంచి పాత్ర ఇచ్చా. నా సొంత సినిమాలన్నింటికీ నేనే కథలు రాసుకునేవాణ్ణి. జడ్జిమెంట్‌ కోసం ఆ కథలను ఆయనకు వినిపించేవాణ్ణి. ‘చాలా బాగా రాశావు గిరిబాబు’ అని అభినందించేవారు. మంచి మనిషి ఈ రోజు మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. 

ఐదు రోజుల క్రితమే మాట్లాడాను – నటుడు–రచయిత–దర్శకుడు తనికెళ్ల భరణి
నేను కాలేజీలో చదువుకునే రోజుల నుండి రావి కొండలరా వుగారు పరిచయం. అదేదో ౖyð రెక్ట్‌ ముఖ పరిచయం కాదు, మేము నాటకాలు వేసేవాళ్లం కదా.. అలా మాది నాటక పరిచయం. ఆయన రాసిన నాటకాల్ని చదివి ఎంజాయ్‌ చేసేవాళ్లం. తర్వాత నేను చెన్నై వెళ్లాను. అక్కడ రాళ్లపల్లిగారి ద్వారా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పట్లో విజయచిత్ర అని సినిమా వారపత్రిక ఉండేది. ఆయన దానికి సంపాదకునిగా ఉండేవారు. నేను ఆ పుస్తకాన్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాణ్ని. అందులో ఆయన రాసే ఆర్టికల్స్, ఇంటర్వ్యూలు చదివేవాడిని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సినిమాకి సంబంధించిన ఏ సాహిత్య సమావేశం అయినా ఆయన లేకుండా జరిగేది కాదు.

అంతటి సాహితీప్రియుడు ఆయన. మంచి వక్త, అందరినీ సరదాగా నవ్విస్తూ ఉండేవారు. కరెక్ట్‌గా ఐదు రోజుల క్రితం అనుకుంటా.. ఫోన్‌ చూస్తుంటే ‘ఆర్‌’ అనే అక్షరం దగ్గర ఆయన ఫోన్‌ నంబర్‌ కనిపిస్తే, ఆయనకు ఫోన్‌ చేశాను. గతేడాది ఆయన ఒక సాహిత్య కార్యక్రమం చేయమని అడిగారు. అప్పుడు నేను రాసిన ‘శృంగారా గంగావతరణం’ అనే కావ్యం సత్సంగం ఆయన ఇంట్లో జరిగింది. ఆయనకు తెలిసిన సాహితీ మిత్రులందరినీ ఆహ్వానించారు. ఆయన నాకు సన్మానం చేసి ఆశీర్వదించారు. అది గుర్తుకు వచ్చి నేను ఆయనకు ఫోన్‌ చేస్తే, ‘ఏమిటి స్వామీ.. ఎలా ఉన్నారు’  అని బాగా మాట్లాడారు. ‘ఏమీ లేదండీ.. కోవిడ్‌లో ఎలా ఉన్నారని ఊరికే పలకరిద్దా’మని అన్నాను. ‘చాలా మంచిదయ్యా.. మాలాంటి వారిని అప్పుడప్పుడు పలకరిస్తే ఉత్సాహంగా ఉం టుంది’ అన్నారు. ‘ఏమిటి మరి హూషారుగా ఉన్నారా’ అంటే... ‘లేదండీ... ఈ మధ్య నేను కింద పడిపోయాను. వాకర్‌ సాయంతో నడుస్తున్నాను’ అన్నారు. ‘సరేనండీ జాగ్రత్త’  అన్నాను. ఇంతలోనే వెళ్లిపోయారు. ఇండస్ట్రీలోని మరో పెద్ద తలకాయి దూరమైంది. 

ఆల్‌రౌండర్‌ అంటే రావి కొండలరావు గారే – రాజేంద్ర ప్రసాద్‌
‘‘సినిమా పరిశ్రమలో ఎక్కువ సంవత్సరాలు పని చేసిన వ్యక్తి కొండలరావుగారు. సినిమా నటునిగా పక్కన పెడితే బయట నాటకాల్లోlఆయన చాలా గొప్ప నటుడు. జర్నలిస్ట్, కథకుడు, రచయిత, నటుడు.. ఇలా ఆయన చాలా గొప్పవాడు. సినిమా పరిశ్రమలో ఆల్‌ రౌండర్‌ అంటే ఆయన పేరే చెప్పొచ్చు. వాళ్ల ఊర్లో ఆయన ఫేమస్‌ టీచరు. ఆయన టీచర్‌గా ఎంత ఫేమస్‌ అంటే మేమందరం ఎప్పుడు కలిసినా ఆయన టీచర్‌గా చేసినప్పటి విశేషాలే మాట్లాడుకునేవాళ్లం.

ఆయన భాషలో ఇప్పుడున్న పరిస్థితిని చెప్పాలంటే ‘‘యూ రాస్కెల్‌ కరోనా, సైలెంట్‌గా ఉండు, ఉండమన్నానా, యూ ఇడియట్‌...’ ఇలా ఉంటుంది ఆయనతో సంభాషణ. సింపుల్‌ లివింగ్, గ్రేట్‌ పర్సన్‌ అంటే ఆయన పేరే చెప్పాలి. వ్యక్తిగతంగా నేనంటే విపరీతమైన లవ్‌. లొకేషన్‌కి వచ్చిన దగ్గర్నుండి ప్రసాదూ, ప్రసాదు... అని కలవరించేవారు. ఒక జీవితానికి మరపురాని కలలు ఆ రోజలు. సినిమా పరిశ్రమలో నాకున్న అతి పెద్ద వయసున్న బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆయనే.

నన్ను బిడ్డలా చూసుకునేవారు  – సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ 
రావికొండలరావుగారు మా మాధవపెద్ది కుటుంబాలకు మూడు తరాల నుంచి అత్యంత ఆప్తులు. ఆయన్ను వరసకి తాతయ్యా అని పిలుస్తాను. మా చిన్నాన్నలు సత్యం, గోఖ్లే ఆయనతో ఫ్రెండ్లీగా ఉండేవారు. వైజాగ్‌లో ఓ ప్రోగ్రామ్‌ కోసం ట్రైన్లో ఆయనా, నేను కలసి ప్రయాణించాం. అప్పుడు సంగీతం పట్ల నాకు ఉన్న అభిరుచినంతా ఆయనతో  చెప్పడం జరిగింది. అప్పటికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా 4–5 సినిమాలు చేశాను. వైజాగ్‌ నుంచి వచ్చిన తర్వాత  ‘విజయా ప్రొడక్షన్స్‌ వాళ్లు టీవీ సీరియల్స్‌ చేయాలనుకుంటున్నారు. దానికి సంగీతం అందించాలి’ అని రావి కొండలరావుగారు అన్నారు. 2పాటలు కంపోజ్‌ కూడా చేశాను. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఆ తర్వాత 1992లో సింగీతం శ్రీనివాసరావు, నేను, రాజేంద్ర ప్రసాద్, డీవీ నరసరాజు.. ఇలా అందరం ఓ సినిమాకి పని చేశాం. ఆ సినిమాకు నిర్మాణ సంచాలకుడిలా ఉంటూనే రావి కొండలరావుగారు చాలావరకు మాటలు కూడా రాశారు.

‘భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలకు నా పేరు సూచించింది ఆయనే. ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కొండలరావుగారు చేసిన ‘కన్యాశుల్కం’ సీరియల్‌కి నేను పని చేశాను. నన్ను ఆయన బిడ్డలానే చూసుకునేవారు. ఈ ఏడాది మార్చి 4న ఆయనకు, ముళ్ళపూడి వెంకట రమణగారి భార్య శ్రీదేవిగారికి, జంధ్యాలగారి భార్య అన్నపూర్ణగారికి, వేటూరిగారి భార్య సీతా మహాలక్ష్మిగారికి సన్మానం చేసుకునే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషం. అప్పుడు చాలా బాగా మాట్లాడారు. అదే ఆయన్ను చివరిసారి చూడటం. ఆరోగ్యం బావుండటం లేదని తెలిసింది. గురువుగారికి ఎలా ఉంది అని వాళ్ల అబ్బాయితో మాట్లాడాను. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో గురువుగారు చాలా ముఖ్యమైనవారు. తాతినేని చలపతిరావు నన్ను మ్యూజిషియన్‌గా పరిచయం చేస్తే, జంధ్యాలగారు నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. రావి కొండలరావుగారు నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎలివేట్‌ చేశారు. నేను, నా కుటుంబం ఆయనకు రుణపడి ఉంటాం. ఆయన లేని లోటు నాకు ఎప్పుడూ ఉంటుంది.

మృత్యోర్మా అమృతంగమయా – దర్శకుడు వీఎన్‌ ఆదిత్య
రావి కొండలరావుగారితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం వయస్సు నలభై ఐదు ఏళ్లకు పైనే. 1970లలో మా నాన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ ఆఫీస్‌లో కల్చరల్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు రావి కొండలరావు, శ్రీమతి రాధాకుమారి దంపతులతో స్నేహం ఏర్పడింది. ‘ఉగాది శుభాకాంక్షలతో... మీ రావికొండలరావు, రాధాకుమారి’ అనే పోస్ట్‌ కార్డు దాదాపు ముప్పై ఏళ్లు క్రమం తప్పకుండా మేం ఏ ఊరికి ట్రాన్స్‌ఫర్‌ అయితే ఆ అడ్రస్‌కి వచ్చేది. ఆ కార్డు ఆధారంగానే నేను వాళ్లింటికి వెతుక్కుంటూ వెళ్లడం, ‘బృందావనం’ సినిమాకి సింగీతం శ్రీనివాసరావుగారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడం, దర్శకుడవ్వాలన్న నా కల సాకారం కావడం.. నాకు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహా మనీషి రావి కొండలరావుగారు.

‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ రెండు చిత్రాలకు ఆయన సంభాషణల రచయిత కూడా. సింగీతంగారి దర్శకత్వంలో వచ్చిన ఆ రెండు సినిమాలకు రావి కొండలరావుగారి ప్రోద్బలంతో నేను ఆయనకు అసిస్టెంట్‌ రైటర్‌గా పని చేయడం నా కెరీక్‌కి గొప్ప బలం. పదిహేను రోజుల క్రితం వెళ్లినప్పుడు ‘నేనో కథ చెప్తాను సినిమాకి, నాకు అసిస్టెంట్‌గా వచ్చి, నేను డిక్టేట్‌ చేసింది రాస్తావా, డైరెక్టర్‌ అయిపోయాను కదా, రాయనంటావా’ అనడిగారు. నేను నవ్వి, ‘ఆ అమృతం ఆస్వాదించే అవకాశం నేనింకొకడికి ఎందుకిస్తాను అంకుల్‌. నేను రోజూ వచ్చి, మీకు అసిస్ట్‌ చేస్తాను’ అన్నాను. ఇంతలోనే ఇలా... రావి కొండలరావుగారి ప్రతి రచనా తెలుగు సాహిత్య యవనికపై ఒక అమృత ధారగా సజీవంగా ఉంటుంది. ఆయన సినిమాలు, నటన తెలుగు జాతి ఉన్నంతకాలం అమృతంలా మనని అలరిస్తూనే ఉంటాయి. మృత్యువు నుంచి అమృతత్వానికి రావి కొండలరావుగారి కొత్త ప్రయాణం మొదలైందనే భావిస్తాను నేను.

ఆయన ప్రోత్సాహాన్ని మరువలేను – ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత రాంభట్ల నృసింహ శర్మ
రావి కొండలరావుగారితో నాది ఇరవయ్యేళ్ల పైబడిన సాంస్కృతిక ప్రయాణం. 2000సంవత్సరంలో ‘విశాఖ హ్యూమర్‌ క్లబ్‌’ స్థాపన, నిర్వహణలో, యాడ్స్‌ ఫర్‌ యూ పత్రికలో కాలమిస్ట్‌గా వారు నాకిచ్చిన ప్రోత్సాహం మరువలేను. ‘కన్యాశుల్కం’ టెలీఫిల్మ్‌ ధారావాహిక శీర్షిక గీతం రచనకు ఇచ్చిన అవకాశం వల్లే నాకు ఉత్తమ గీత రచయితగా ‘నంది పురస్కారం’ లభించింది.

ఆయన నాకు తండ్రిలాంటి వారు – రచయిత–దర్శకుడు వర ముళ్లపూడి
‘‘నేను చిన్నప్పటి నుండి రావి కొండలరావుగారిని చూస్తూ పెరిగాను. ఆయన, రాధాకుమారి ఆంటీ మా ఇంటి మనుషుల్లానే ఉండేవారు. నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మా నాన్న తర్వాత మరో తండ్రిలాంటివారాయన. ఈ ఏడాదితో ‘బాలరాజు కథ’ (బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రావి కొండలరావు నటించారు) విడుదలై యాభై ఏళ్లయింది. అప్పుడు నేను ఆయన దగ్గర చిన్న వీడియో బైట్‌ కావాలని అడిగితే, బాపు, రమణ గార్ల గురించి రెండు గంటలు ఆపకుండా చెబుతాను.. నువ్వు రా అన్నారు. ఈ లోపు కోవిడ్‌ కారణంగా ఆటంకం వచ్చింది. ఆయనేమో పెద్దవారు, నేను అటూ ఇటూ తిరుగుతుంటాను.

ఈ సమయంలో ఆయనేకేమైనా ఎఫెక్ట్‌ అవుతుందేమో, ఎందుకులే అని తర్వాత కలుద్దాం అనుకున్నాను. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయనతో ఆ ఇంటర్వ్యూ చేసినా బావుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మంచి మనిషి. చెన్నైలో వాళ్లబ్బాయి ఇంట్లో ఆయన ఉండేవారు. అప్పుడు వెళ్లి ఆయన్ని అనేక సార్లు కలవటం జరిగింది. నాకు, బాపుగారబ్బాయికి ఫాదర్‌ ఫిగర్‌లా అయినప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మాతో. బెస్ట్‌ హ్యూమన్‌ బీయింగ్‌. ఆయనకు ఎక్స్‌లెంట్‌ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉండేది. స్పాంటేనియస్‌గా జోకులు పేల్చేవారు. ‘పెళ్లి పుస్తకం’ సినిమా టైమ్‌లో నాన్న, బాపుగారు, కొండలరావుగారు.. ముగ్గురూ  ఒకచోట కూర్చుని వర్క్‌ చూస్తుంటే కడుపు నిండిపోయేది. ఆ సినిమా కథ ఈయనదే. ఆయనతో నాకెన్నో మంచి అనుభూతులు ఉన్నాయి. సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ గొప్ప చరిత్ర తెలిసిన మనిషి ఈ రోజుతో కనుమరుగయ్యారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు