Tollywood: ఈ సినిమాల్లో ట్రైన్‌కి చాలా సీన్‌ ఉంది!

25 Feb, 2022 00:38 IST|Sakshi

ట్రైన్‌లో ప్రేమ.. ట్రైన్‌లో ఫైట్‌.. ట్రైన్‌లో కామెడీ.. ట్రైన్‌లో ఎమోషన్‌.. ట్రైన్‌ జర్నీలో ఎన్నో... వెండితెరపై ఎన్నో భావోద్వేగాలను ట్రైన్‌ చూపించింది. ఆడియన్స్‌ని ఎంటర్‌‘ట్రైన్‌’ చేసింది. ట్రైన్‌కి చాలా సీన్‌ ఉన్న సినిమాలు ఇప్పుడు ట్రాక్‌లో ఉన్నాయి. ఆ ఎంటర్‌‘ట్రైన్‌’మెంట్‌లోకి వెళదాం...

Tollywood Movies With A Train Backdrop: ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాధేశ్యామ్‌’. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్‌ ప్రేరణగా పూజా హెగ్డే కనిపిస్తారు. 1970నాటి యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీలో ఓ ట్రైన్‌ ఎపిసోడ్‌ కీలకంగా నిలవనుంది. ‘రాధేశ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌లో ట్రైన్‌లో ప్రభాస్, పూజ కనిపిస్తారు. ప్రేరణగా పూజా హెగ్డే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా ట్రైన్‌లో ఉన్న స్టిల్‌నే విడుదల చేశారు.

ఓ ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగే ట్రైన్‌ యాక్సిడెంట్‌లో విడిపోయిన విక్రమాదిత్య, ప్రేరణ మళ్లీ ఎలా కలుసుకుని వారి ప్రేమకు శుభం కార్డు వేశారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని సమాచారం. ఈ చిత్రం మార్చి 11న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ‘రాధేశ్యామ్‌’ చిత్రంలోని హీరో పాత్ర పేరు విక్రమాదిత్యనే టైటిల్‌గా పెట్టి దర్శకుడు తేజ 1836 నేపథ్యంలో సాగే ఓ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ విడుదలైంది. ఈ పోస్టర్‌లో ట్రైన్‌ విజువల్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

సో.. ‘విక్రమాదిత్య’లో ట్రైన్‌ ఎపిసోడ్‌ కీలకంగా ఉండటమే కాకుండా, ట్రైన్‌ బ్యాక్‌డ్రాప్‌లో మేజర్‌ కథ సాగుతుందని ఊహించవచ్చు. అలాగే ‘సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ధవళేశ్వరం’ బ్యారేజ్‌కు, ‘విక్రమాదిత్య’ చిత్రకథకు లింక్‌ ఉందని చిత్రం యూనిట్‌ హిట్‌ ఇచ్చింది. ఇక రవితేజ కెరీర్‌లో ఓ హిట్‌ మూవీగా నిలిచిన ‘వెంకీ’లోని ట్రైన్‌ ఎపిసోడ్‌ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ఎపిసోడే కథను ముందుకు నడిపిస్తుంటుంది. తాజాగా కథను ముందుకు నడిపే ట్రైన్‌ ఎపిసోడ్‌తో రవితేజ చేస్తోన్న చిత్రం ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ ఇటీవల రిలీజైంది.

సినిమాలో ట్రైన్‌ ఎపిసోడ్‌ ఉన్నట్లుగా ఈ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది. అయితే రవితేజ ‘వెంకీ’ చిత్రంలోని ట్రైన్‌ ఎపిసోడ్‌ కామెడీతో ఉంటే, ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’లోని ట్రైన్‌ ఎపిపోడ్స్‌ సీరియస్‌గా ఉంటాయని తెలుస్తోంది. ట్రైన్‌లో మంటలు చెలరేగడం, బాధితులకు న్యాయం చేసే ఓ ఎమ్మార్వోగా రవితేజ పోరాటం చేయడం అనే అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న విడుదల కానుంది.

ఇక రవితేజ కెరీర్‌లో ఫస్ట్‌ పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా రూపొందుతోన్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ఇది. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ట్రైన్‌లో దొంగతనాలు చేసే నాగేశ్వరరావుగా కొన్ని సీన్స్‌లో రవితేజ కనిపిస్తారట. ఇంకోవైపు ‘వి’ చిత్రం తర్వాత హీరో నాని కాస్త నెగటివ్‌ రోల్‌లో కనిపిస్తారని ప్రచారం అవుతోన్న చిత్రం ‘దసరా’. ‘నేను లోకల్‌’ చిత్రం తర్వాత నాని, కీర్తీ సురేష్‌ హీరోహీరోయిన్లుగా నటించనున్న ఈ పీరియాడికల్‌æఫిల్మ్‌కు శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ మోషన్‌ పోస్టర్‌ స్టార్టింగ్‌లో పొగతో వచ్చే రైలు బండి కనబడుతుంది.

ఇక ఈ సినిమాలో రైలు ఎపిసోడ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? గోదావరి ఖనిలోని సింగరేణి కోల్‌మైన్స్‌ సమీపగ్రామంలో ‘దసరా’ స్టోరీ సాగుతుంది. మార్చిలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. మరోవైపు కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘డెవిల్‌: ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ట్రైన్‌లో నుంచి కల్యాణ్‌ రామ్‌ తుపాకీతో ప్రత్యర్థులపై గురి పెట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. దీన్నిబట్టి ఈ ట్రైన్‌ ఎపిసోడ్‌ సినిమాను మలుపు తిప్పుతుందని అనుకోవచ్చు. 1945లో బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వ సారథ్యంలోని అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో అనుకోని çఘటనల వల్ల ఓ గూఢచారి జీవితం ఎలా ప్రభావితం అయింది? అనే అంశం నేపథ్యంలో ఈ  చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి నవీన్‌ మేడారం దర్శకుడు.

ఈ సినిమాలే కాక మరికొన్ని తెలుగు చిత్రాల్లో ట్రైన్‌ సన్నివేశాలు సెట్స్‌లో ట్రాక్‌పై ఉన్నాయి. రైలు జర్నీ బాగుంటుంది. సినిమాలో రైలు ఎపిసోడ్లూ దాదాపు బాగుంటాయి కాబట్టి వెండితెరపై ట్రైన్‌ జర్నీ కొనసాగాలని కోరుకుందామా!

మరిన్ని వార్తలు