Chalapathi Rao: చలపతిరావు సినీప్రస్థానం.. ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే భార్య చనిపోయినా..

25 Dec, 2022 08:03 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు(78) గుండెపోటుతో హఠాన్మరణం చెందడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఐదున్నర దశాబ్దాల సీనిప్రస్థానంలో 1200లకు పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు చూద్దాం.

చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బలిపర్రులో 1944 మే 8న జన్మించారు. 22 ఏళ్లకే 1966లో సీనిరంగంలోకి అడుగుపెట్టారు. సూపర్‌స్టార్ కృష్ణ సూపర్‌హిట్ చిత్రం గూఢచారి 116.. చలపతిరావు మొదటి సినిమా. ఆ తర్వాత 1967లో సాక్షి చిత్రంలో ఓ పాత్ర పోషించారు. ఆ తర్వాత రెండేళ్లు అవకాశాలు రాలేదు. మళ్లీ 1969లో బుద్ధిమంతుడులో నటించారు.

ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోయారు. విలనిజంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా మొత్తం 1200కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విలన్‌గానే కాకుండా అన్ని రకాల పాత్రల్లో చలపతిరావు ప్రేక్షకులను మెప్పించారు. నిన్నేపెళ్లాడతా చిత్రంలో నాగార్జునకు తండ్రిగా నటించడం ఆయన కెరీర్‌ను మలుపుతిప్పిందని చెబుతారు.

చలపతిరావు ఏడు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు. కలియుగ కృష్ణుడు, కడపరెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంటుగారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి చిత్రాలు ఆయన నిర్మించినవే.

ఫ్యామిలీ..
చలపతిరావు తండ్రిపేరు మణియ్య. తల్లి పేరు వియ్యమ్మ.  భార్యపేరు ఇందుమతి. వీరికి ముగ్గురు సంతానం. కుమారుడు రవిబాబు టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు.

ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే చలపతిరావు సతీమణి ఇందుమతి అగ్నిప్రమాదంలో చనిపోయారు. వీళ్లు చెన్నైలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. వేకువజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పంటుకుంది.

కేకలు వేయడంతో చలిపతిరావు వెళ్లి మంటలార్పారు. ఆస్పత్రిలో మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఆమె మరణించింది. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ తర్వాత చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదు.
చదవండి: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నటుడు చలపతిరావు హఠాన్మరణం

మరిన్ని వార్తలు