Telugu Remake Movies: రీమేక్‌ సినిమాలపై ఓ కన్నేసిన తెలుగు హీరోలు

21 Apr, 2022 08:33 IST|Sakshi

ఒక భాషలో హిట్టయిన సినిమా వేరే భాషలవాళ్లకు నచ్చుతుందా? ఆ సినిమా కథ కనెక్ట్‌ అయితే నచ్చుతుంది.. అలా అందరికీ కనెక్ట్‌ అయ్యే కథలతో కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్‌ అవుతుంటాయి. ఇప్పుడు తెలుగులో అలాంటి కథలపై కొందరు స్టార్స్‌ ఓ చూపు చూశారు. ఆ కథలను రీమేక్‌ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.

చిరంజీవి మంచి జోరు మీద ఉన్నారు. నాలుగైదు సినిమాలకు డేట్స్‌ ఇచ్చేసి, డైరీని ఫుల్‌ చేసేశారు. ఈ నాలుగైదు చిత్రాల్లో ఇప్పటికే రెండు రీమేక్స్‌ సెట్స్‌ మీద ఉండటం విశేషం. మలయాళం సూపర్‌ హిట్‌ ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’లో చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నయనతార, దర్శకుడు పూరి  జగన్నాథ్, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘బోళా శంకర్‌’. ఇది తమిళంలో అజిత్‌ నటించిన ‘వేదాళం’కు రీమేక్‌ అని తెలిసింది. ఈ  చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకుడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. అలాగే మలయాళంలో మరో హిట్‌గా నిలిచిన ‘బ్రో డాడీ’ చిత్రంలో చిరంజీవి నటిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక కెరీర్‌లో దాదాపు పాతిక రీమేక్‌ సినిమాలు చేశారు వెంకటేశ్‌. ఈ మధ్య రెండు రీమేక్స్‌లో నటించారాయన. ధనుష్‌ తమిళ హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌ ‘నారప్ప’, మోహన్‌లాల్‌ మలయాళం హిట్‌ ‘దృశ్యం 2’ రీమేక్‌ ‘దృశ్యం 2’లో నటించారు వెంకటేశ్‌. ఈ రెండు చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అయ్యాయి. అయితే ఇదే టైమ్‌లో వెంకీ డిజిటల్‌ ఎంట్రీ కూడా ఖరారైంది. ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌కు వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో వెంకీతో పాటు రానా మరో ప్రధాన పాత్రధారి. కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ వర్మ ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకులు. అమెరికన్‌ పాపులర్‌ డ్రామా సిరీస్‌ ‘రే డోనోవన్‌’కు ఈ ‘రానా నాయుడు’ అడాప్షన్‌ అన్న మాట. అంటే ఆల్మోస్ట్‌ రీమేక్‌ అనుకోవాలి. ఇక ఈ వెబ్‌ సిరీస్‌లో ఓ హీరోగా ఉన్న రానా దీనికంటే ముందు ‘భీమ్లానాయక్‌’ చిత్రంలో నటించారు. ఇది మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు తెలుగు రీమేక్‌. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ ఓ హీరోగా నటించారు.

అయితే పవన్‌ కల్యాణ్‌ మరో రీమేక్‌లో నటించనున్నారని సమాచారం. తమిళ హిట్‌ చిత్రం ‘వినోదాయ చిత్తమ్‌’ తెలుగు రీమేక్‌లో పవన్‌ కల్యాణ్, సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తారనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తోంది. ‘శంభో శివ శంభో’, ‘జెండాపై కపిరాజు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. అలాగే తమిళ హిట్‌ విజయ్‌ ‘తేరి’ తెలుగు రీమేక్‌లోనూ పవన్‌ కనిపిస్తారని, ‘సాహో’ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వం వహిస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ధనుష్‌ నటించిన తమిళ చిత్రం ‘కర్ణన్‌’ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించనున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. ఇటు చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’లో ఓ కీ రోల్‌ చేస్తున్న సత్యదేవ్‌ నటించిన తాజా చిత్రాల్లో ‘గుర్తుందా.. శీతాకాలం’ ఒకటి. ఇది కన్నడ సినిమా ‘లవ్‌ మాక్‌టైల్‌’కు రీమేక్‌. నాగశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యా శెట్టి హీరోయిన్లుగా నటించారు.

ఇక తమిళ హిట్‌ ‘ఓ మై కడవులే..’ రీమేక్‌ ‘ఓరి దేవుడా..’లో విశ్వక్‌ సేన్, మలయాళ ఫిల్మ్‌ ‘కప్పెలా’ రీమేక్‌ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్‌ టైటిల్‌)లో సిద్ధు జొన్నలగడ్డ (‘డీజే టిల్లు’ ఫేమ్‌), మలయాళ హిట్‌ ‘హెలెన్‌’ రీమేక్‌ ‘బటర్‌ ఫ్లై’లో అనుపమా పరమేశ్వరన్, మలయాళ ‘నాయట్టు’ రీమేక్‌లో అంజలి, ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ రీమేక్‌లో నివేదా, రెజీనా.. ఇలా... మరికొందరు నటీనటులు రీమేక్స్‌ వైపు ఓ చూపు చూశారు. హిందీ ‘బదాయీ దో’, ‘దేదే ప్యార్‌ దే’, తమిళ ‘విక్రమ్‌ వేదా’, మలయాళ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’, సౌత్‌ కొరియన్‌ ‘లక్కీ కీ’ వంటి చిత్రాలూ తెలుగులో రీమేక్‌ కానున్నాయి.    

చదవండి: విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్‌ రిలీజ్‌..

క్యాన్సర్‌తో బాధపడుతున్న బుల్లితెర నటి.. ఎమోషనల్‌గా పోస్ట్‌

మరిన్ని వార్తలు