చిరు, పవన్‌, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు?

5 May, 2021 17:23 IST|Sakshi

ఒకవైపు తెలుగు సినిమాలు భారతీయ చిత్ర రంగంలో దూసుకెళ్తుంటే.. మన స్టార్‌ హీరోలు మాత్రం పర భాష చిత్రాలనే నమ్ముకుంటున్నారు. ఫలితంగా రీమేక్‌ల హవా పెరిగిపోయింది.ముఖ్యంగా టాలీవుడ్‌ స్టార్ హీరోలు రీమేక్‌లనే నమ్ముకుంటున్నారు. తమిళ, మలయాళంలో హిట్టైన కథనలను వెతికి మరీ తెచ్చుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవీ మొదలు... యంగ్‌ హీరో నితిన్‌ వరకు అంతా రీమేక్‌ చిత్రాలనే నమ్ముకుంటున్నారు.

చిరంజీవి ఇప్పటికే రెండు రీమేక్‌ చిత్రాలను లైన్‌లో పెట్టాడు. వాటిలో ఒకటి తమిళ మూవీ ‘వేదాళం’ కాగా ఇంకొకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’. ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ పూర్తిగాగానే వాటిని పట్టాలెక్కించబోతున్నాడు.

ఇక పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీకి కూడా రీమేక్‌ చిత్రాన్నే నమ్ముకున్నాడు. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ ‘పింక్‌’ సినిమాని ‘వకీల్‌సాబ్‌’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో చిత్రం కూడా రీమేకే కావడం గమనార్హం. రానా, పవన్‌ కల్యాణ్‌ ముఖ్యపాత్రలో మలయాళం మూవీ ‘అయ్యప్పనున్‌ కోషియమ్‌’ని తెరకెక్కిస్తున్నారు.

రీమేక్‌లతో ఎక్కువ హిట్స్‌ అందుకున్న విక్టరీ వెంకటేశ్‌ ఇప్పటికీ అదే సూత్రాన్ని నమ్ముకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు చిత్రాలు రీమేకులే. వాటిలో ఒకటి ధనుష్‌ నటించిన తమిళ చిత్రం ‘అసురన్‌’. ఈ మూవీని ‘నారప్ప’గా రీమేక్‌ చేస్తున్నారు. మరో చిత్రం మలయాళం చిత్రం  ‘దృశ్యం-2’. అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇవి రెండూ కాకుండా తాజాగా మరొక మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ను కూడ ఆయన రీమేక్ చేయాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఇక యంగ్‌ హీరో నితిన్‌ కూడా రీమేక్‌ చిత్రాన్నే నమ్ముకున్నాడు. ఈ ఏడాది ‘చెక్‌’, ‘రంగ్‌దే’ చిత్రాలతో అలరించిన నితిన్‌.. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇది బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ ‘అంధాదున్’కి రీమేక్‌. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ ‘కర్ణన్’ను రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇలా తెలుగు హీరోలు చాలామంది రీమేక్ కథల నమ్ముకుంటున్నారు.

రీమేక్‌లను నమ్ముకుంటే సేఫ్‌ జోన్‌లో ఉండొచ్చని నిర్మాతల మాట. బాక్సాఫీస్‌ బద్దలైయ్యే కాసుల వర్షం రాకపోవచ్చు కానీ, నష్టమైతే రాదని వారి అంచనా. అందుకే మన నిర్మాతలు రీమేక్‌లను నమ్ముకుంటున్నారేమో. అదీ కాక మన రచయితలు అవసరమైన కథలను అందించలేకపోతున్నారా? లేదా అగ్రహీరోలు వాటిని టేకాప్‌ చేయడం లేదా?అనేది తెలియడం లేదు. 

మరిన్ని వార్తలు