సూపర్‌ హిట్‌ చిత్రాలు.. సీక్వెల్‌కు రెడీ

23 Feb, 2021 08:46 IST|Sakshi

కొన్ని కథలు భలే ఉంటాయి. ఇంకోసారి వినాలనిపించేలా. 
ఇంకా ఉంటే బావుండు అనిపించేలా. 
సినిమాకు సీక్వెల్‌ పుట్టడానికి ఇదో కారణం. 
బాక్సాఫీస్‌ విజయం, కాంబినేషన్‌లు చేసే మ్యాజిక్‌ కూడా
కొన్నిసార్లు సినిమా సీక్వెల్‌కి కారణం అవుతాయి. 
కథను కొనసాగించే స్కోప్‌ ఉంటే.. సీక్వెల్‌ తీయొచ్చు.
అలాంటి కథలు కొన్ని ఉన్నాయి.
వాటితో సీక్వెల్స్‌ తెరకెక్కిస్తున్నారు. 
కొన్ని చర్చల దశలో ఉన్నాయి. సీక్వెల్‌ కథేంటో చూద్దాం. 

బంగార్రాజు ఈజ్‌ బ్యాక్‌
‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో 2016 సంక్రాంతికి బాక్సాఫీస్‌ హిట్‌ సాధించారు నాగార్జున. బంగార్రాజుగా ఆయన ఎనర్జీ స్క్రీన్‌  మీద బాగా పండింది. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌ తెరకెక్కనుంది. ‘బంగార్రాజు’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. బంగార్రాజు నేపథ్యం ఏంటి? అనేది ఈ సినిమా ప్రధానాంశం. మార్చిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తారు.

కేబుల్‌ ఆపరేషన్‌  స్టార్ట్‌
అనుకోకుండా ఎదురైన ఆపదను కేబుల్‌ ఆపరేటర్‌ రాంబాబు తెలివిగా తప్పించాను అనుకుంటాడు. కానీ పోలీసులు ఈ కుటుంబాన్ని అనుమానిస్తుంటారు. మరి ఇప్పటికైనా ఆ ఆరోపణల నుంచి బయటపడ్డారా? ‘దృశ్యం 2’ వచ్చేవరకూ ఆగాలి. వెంకటేశ్‌ హీరోగా 2014లో వచ్చిన థ్రిల్లర్‌ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ తెరకెక్కుతోంది. కేబుల్‌ ఆపరేటర్‌ రాంబాబు పాత్రలో మళ్లీ కనిపించనున్నారు వెంకటేశ్‌. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. 

డోస్‌ డబుల్‌
మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్‌ లో వచ్చిన ‘ఢీ’ పెద్ద హిట్‌ అయింది. చురుకైన బబ్లూగా స్క్రీన్‌ మీద కామెడీ బాగా పండించారు విష్ణు. ఇప్పుడు దాని డోస్‌ పెంచనున్నారు. ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఢీ 2 : డబుల్‌ డోస్‌’ టైటిల్‌తో ఈ సీక్వెల్‌ తెరకెక్కనుంది. ఈ సినిమాలో నటిస్తూ, నిర్మించనున్నారు విష్ణు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. 

డబుల్‌ ఇస్మార్ట్‌
రామ్, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన హై ఎనర్జిటిక్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు పూరి పేర్కొన్నారు. ఈ సీక్వెల్‌కి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అనే టైటిల్‌ కూడా రిజిస్టర్‌ చేశారు. 

చిత్రం 1.1  
‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు తేజ. కేవలం నలభై లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్‌ అయింది. ఉదయ్‌ కిరణ్, రీమా సేన్‌ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు తేజ. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ను ప్రకటించారు తేజ. ఈ సినిమా ద్వారా సుమారు 45 మంది కొత్తవాళ్లను పరిచయం చేయనున్నారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. 

గూఢచారి రిటర్న్స్‌
ఏజెంట్‌ గోపీగా అడివి శేష్‌ చేసిన సాహసాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ యంగ్‌ గూఢచారిని సూపర్‌ హిట్‌ చేశారు. అడివి శేష్‌ కథను అందించి, హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్‌ తిక్కా దర్శకుడు. చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుంది. రెండో భాగానికి కూడా కథను అందిస్తున్నారు అడివి శేష్‌. రాహుల్‌ పాకాల దర్శకుడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. 

సందడి రెండింతలు
సంక్రాంతి అల్లుళ్లుగా ‘ఎఫ్‌ 2’ చిత్రంలో సందడి చేశారు వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌. ‘ఫన్‌  అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ ’ అంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి థియేటర్స్‌లో నవ్వులు పూయించారు. ఇప్పుడు ఈ సందడిని రెండింతలు చేయనున్నారు. ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ సిద్ధమవుతోంది. మొదటి చిత్రంలో కనిపించిన వెంకటేశ్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌ నటిస్తున్నారు.  ఫస్ట్‌ పార్ట్‌ భార్యాభర్త గొడవ, కాబోయే భార్యాభర్త మధ్య అలకలతో సాగింది. రెండో భాగంలో వెంకీ, వరుణ్‌ డబ్బు చుట్టూ తిరిగే పాత్రలు చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మాత. ఆగస్ట్‌ 27న ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ కానుంది.

రెండో కేసు
క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ గత ఏడాది ఓ కేసుని సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు. ఇప్పుడు రెండో కేస్‌ పని పట్టడానికి రెడీ అయ్యారు. హీరో నాని నిర్మాణంలో విశ్వక్‌ సేన్‌  హీరోగా నటించిన చిత్రం ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’. శైలేష్‌ కొలను దర్శకుడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్‌ : ది సెకండ్‌ కేస్‌’ రానుందని చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. 

ఇంకొన్ని సీక్వెల్స్‌ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘అ!, కల్కి, జాంబీ రెడ్డి’ చిత్రాలకు కూడా సీక్వెల్స్‌ ఉండొచ్చు. సీక్వెల్‌ చేసే ఉద్దేశం ఉన్నట్లు ఆయనే స్వయంగా పేర్కొన్నారు.

చదవండి :
దృశ్యం 2: అజయ్‌ కూడా తప్పించుకుంటాడు

‘అలా నటించడం ఆనందంగా ఉంది’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు