Top Gun Maverick Review In Telugu: టామ్‌ క్రూజ్‌ 'టాప్‌ గన్‌: మావెరిక్‌' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే ?

27 May, 2022 17:59 IST|Sakshi
Rating:  

టైటిల్‌: టాప్‌ గన్‌ మావెరిక్‌ (హాలీవుడ్)
నటీనటులు: టామ్‌ క్రూజ్‌, మైల్స్‌ టెల్లర్‌, జెన్నిఫల్ కాన్‌లీ, వాల్‌ కిల్మర్‌, గ్లెన్‌ పావెల్‌ తదితరులు
నిర్మాతలు: టామ్‌ క్రూజ్‌, జెర్రీ బ్రూక్‌హైమర్, క్రిస్టోఫర్‌ మెక్‌ క్యూరీ, డేవిడ్‌ ఎల్లిసన్, డాన్‌ గ్రాంగర్‌
దర్శకత్వం: జోసెఫ్‌ కోసిన్స్కీ
సినిమాటోగ్రఫీ: క్లాడియో మిరిండా
విడుదల తేది: మే 26, 2022

హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కెరీర్‌ ప్రారంభంలో హిట్‌ సాధించిన సినిమాల్లో 'టాప్‌ గన్‌' ఒకటి. 1986లో వచ్చిన ఈ చిత్రానికి సుమారు 36 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ 'టాప్‌ గన్‌: మావెరిక్‌'. ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా రావడం టీజర్లు, ట్రైలర్లతో మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ మూవీ ట్రైలర్‌ 2019లోనే విడుదలైంది. సినిమా కూడా అప్పట్లోనే రావాల్సింది. కానీ కరోనా వల్ల, పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ మూవీ చివరికీ మే 27న విడుదల కావాల్సింది కానీ మే 26 నుంచే షోలు ప్రదర్శించారు. మరీ భారీ అంచనాల నడుమ విడుదలైన 'టాప్‌ గన్‌: మావెరిక్‌' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:
పీట్‌ మావెరిక్‌ మిచెల్‌ (టామ్‌ క్రూజ్‌) అమెరికా ఆర్మీలో ఫైటర్‌ పైలెట్‌గా పనిచేస్తాడు. అతనికి 36 ఏళ్ల అనుభవం ఉంటుంది. ఒక యుద్ధ విమానాన్ని టెస్ట్‌ చేసేందుకు అపరిమిత స్పీడ్‌లో వెళతాడు. అది చూసిన తన పైఅధికారులు పైలెట్‌గా విధుల నుంచి తప్పించి 'టాప్‌ గన్‌' అకాడమీలో బెస్ట్‌ పైలెట్స్‌కు శిక్షణ ఇవ్వమని పంపిస్తారు. 36 ఏళ్ల అనుభవం ఉన్న పీట్‌ మావెరిక్‌ ఎందుకు పైలెట్‌గానే ఉండిపోవాల్సి వచ్చింది ? అతన‍్ని బెస్ట్ పైలెట్స్‌కు శిక్షణ ఇవ్వమని చెప్పడానికి అసలు కారణం ఎవరు ? వారికి ఎందుకోసం శిక్షణ ఇవ్వమంటారు ? ఆ శిక్షణ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ ? హీరో ఫ్రెండ్ గూస్ కొడుకు రూస్టర్‌కు పీట్‌ అంటే ఎందుకు కోపం ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ:
'టాప్ గన్‌' సినిమాను గుర్తు చేస్తూ 'టాప్‌ గన్‌ మావెరిక్‌' మూవీ ప్రారంభం అవుతుంది. టాప్‌ గన్‌ మూవీ నచ్చిన వాళ్లకు ఈ మూవీ కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. ఉన్నతాధికారులను ఏమాత్రం లెక్కచేయిని పాత్రగా మావెరిక్‌ను పరిచయం చేశారు. 36 ఏళ్ల తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు లేదన్నట్లుగా చూపించారు. ఆకాశంలో సాహోసోపేతమైన విన్యాసాలు, ఏరియల్‌ స్టంట్స్‌ సూపర్బ్‌గా అనిపిస్తాయి. యుద్ధ విమానాలతో వాళ్లు చేసే ఫీట్లు ఆసక్తికరంగా ఉంటాయి. కంబాట్‌ సీన్స్‌, ట్రైనింగ్‌ సీన్స్‌ బాగున్నాయి. సినిమాలో అడ్వెంచర్‌ షాట్స్‌, కామెడీ డైలాగ్స్‌తోపాటు ఎమోషనల్‌ ఫీల్‌ సీన్లు ఎంతో ఆకట్టుకుంటాయి. 

కథలో భాగంగా పీట్‌ ఫ్రెండ్‌ గూస్‌ మరణం కారణంగా తనపై అనుమానాలు తలెత్తడం, వాటన్నింటిన దాటుకొని తిరిగి విధుల్లోకి రావడం, గూస్ కుమారుడు రూస్టర్‌తో వచ్చే సన్నివేశాలు ఉద్వేగభరితంగా బాగున్నాయి. సినిమా ప్రారంభం నుంచి గూస్‌ కొడుకు రూస్టర్‌ను పీట్‌ చూసే విధానం ఎమోషనల్‌గా ఉంటుంది. మావెరిక్‌కు అతని లవర్‌ మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్లు నవ్వు తెప్పిస్తాయి. పీట్‌ ఫ్రెండ్‌ ఐస్‌ మ్యాన్‌ (వాల్‌ కిల్మర్‌) మధ్య సంభాషణ ఎమోషనల్‌గా సాగి చివరిగా ఒక్కసారి నవ్వు తెప్పించడం భలే హాయిగా ఉంటుంది. వాల్‌ కిల్మర్‌కు రియల్‌ లైఫ్‌లో ఉన్న ఆరోగ్య సమస్యలను సినిమాలోని పాత్రకు ఆపాదించడం బాగుంది. క్లైమాక్స్‌, చివరి అరగంట ముందు మంచు కొండల్లో వచ్చే సీన్లు ఉత్కంఠభరితంగా ఆకట్టుకుంటాయి. 

ఎవరెలా చేశారంటే? 
హీరోగా చేసిన టామ్‌ క్రూజ్ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. యాక్షన్‌ సీన్స్‌, రియల్‌ స్టంట్స్‌కు పెట్టింది పేరు. సినిమాలో ఆయన నటన హైలెట్‌. 1986లో టాప్‌ గన్‌ మూవీ వచ్చినప్పుడు టామ్‌ వయసు 24. ఈ సీక్వెల్‌ సమయానికి 59 ఏళ్లు. అయినా ఆయనలో ఏమాత్రం జోరు తగ్గలేదు. అదే జోష్‌, అదే బాడీ లాంగ్వేజ్‌, అదే సిక్స్‌ ప్యాక్ బాడీతో యాక్షన్‌, ఫైట్స్‌, రొమాన్స్‌లో తనదైన స్పెషాల్టీ చూపించాడు. మిగతా క్యారెక్టర్లు వారి పాత్రలకు అనుగుణంగా అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ బాగుంది. నిర్మాణ విలువలు, టెక్నికల్‌ వర్క్‌ సూపర్బ్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే కచ్చితంగా మంచి అనుభూతి కలుగుతుంది.  

-సంజు, సాక్షి వెబ్‌డేస్క్‌

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు