Bollywood Movies: అభిమానుల మెప్పు పొందని 5 బాలీవుడ్‌ సినిమాలు

21 Dec, 2021 13:08 IST|Sakshi

2021 Bollywood Flop Movies: సినిమా సినిమా.. కొబ్బరికాయ కొట్టి మొదటి క్లాప్‌ ఇచ్చినప‍్పటినుంచి మూవీ విడుదలై, సక్సెస్‌ మీట్‌ వరకూ ఒక రకమైన పండుగల ఉంటుంది. హిట్‌ అయితే 'అబ్బా సాయిరామ్‌' అని అనిపించిన దర్శక నిర్మాతలకు సినిమా సరిగా ఆడకుంటే మాత్రం 'చాలా బాగోదు'. కానీ ఏం చేద్దాం. కొన్ని సినిమాలు బాగా టేకాఫ్‌ అయితే.. మరికొన్ని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో టేకాఫ్‌ కాకుండా కుప్పకూలిపోతాయి. ఇలా ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని ఐదు హిందీ చిత్రాలు మీకోసం. 

1. రాధే (యువర్‌ మోస్ట్‌ వాంటేడ్ భాయ్‌)
బాలీవుడ్‌ భాయిజాన్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన యాక్షన్‌ చిత్రం రాధే. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలను ఎంతమాత్రం రీచ్‌ కాలేకపోయాడు రాధే. ఇందులో సల్మాన్‌.. రాజ్‌వీర్‌ షికావత్‌ అకా రాధే  పాత్రను పోషించాడు. సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై సోహైల్ ఖాన్‌, రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ నిర్మించిన ఈ చిత‍్రంలో దిశా పటానీ, జాకీ ష్రాఫ్‌, రణదీప్‌  హుడా తదితరులు నటించారు. ఈ సినిమాకు ఐఎండీబీ 1.8 (IMDb) రేటింగ్‌ను ఇచ్చింది. 

2. హంగామా 2
2003లో విడుదలైన హంగామా సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే హంగామా 2. మొదటి చిత్రం 7.6 ఐండీబీ రేటింగ్‌ను సాధించగా రెండో సినిమా మాత్రం 2.1 కి పరిమితమైంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నటించిన ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ హాస్య నటులు పరేష్‌ రావల్‌, రాజ్‌ పాల్‌ యాదవ్‌, జానీ లివర్‌ ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 

3. లాహోర్‌ కాన్ఫిడెన్షియల్‌
జీ5 ఒరిజినల్ నిర్మించిన రొమాంటిక్‌-థ్రిల్లర్‌ చిత్రం వన్‌ లాహోర్‌ కాన్ఫిడెన్షియల్‌. ఈ సినిమాలో రిచా చద్దా, అరుదోదయ్ సింగ్, కరిష్మా తన్నా, ఖలీద్ సిద్ధిఖీ నటించారు. చిత్రంలో స్పై-థ్రిల్లర్‌ అంశాలు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. కునాల్‌ కోహ్లీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాకు 2.8 రేటింగ్‌ ఇచ్చింది ఐఎండీబీ (IMDb).

4. రూహి
బాలీవుడ్‌ హీరో రాజ్‌ కుమార్ రావు నటించిన కామెడీ-హార్రర్‌ చిత్రం రూహి. ఇందులో జాన్వీ కపూర్‌, వరుణ్ శర్మ నటించారు. ఈ చిత్రానికి హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహించారు. మాడాక్‌ ఫిల్మ్స్‌ బ్యానర్పై దినేష్‌ విజన్‌ నిర్మించిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను నిరాశపరిచింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్‌ 4.3.

5. ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌ నిర్మించిన చిత్రం ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌. పౌలా హాకిన్స్‌ రాసిన నవల ఆధారంగా 2016లో హాలీవుడ్‌లో విజయం సాధించిన ఈ సినిమాకు ఇదే పేరుతో హిందీలో రీమెక్‌ చేశారు. ఈ చిత్రం ప్రోమోలు, టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయినా పరిణీతి చోప్రా, అదితి రావు హైదరీ నటించిన ఈ సైకాలజికల్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులకు అంతగా థ్రిల్‌ ఇవ్వలేకపోయింది. ఈ సినిమాకు 4.4గా ఐఎండీబీ (IMDb) రేటింగ్‌ ఇచ్చింది. 

ఇదీ చదవండి: వచ్చే ఏడాది అలరించనున్న సినిమాలు ఇవే..

మరిన్ని వార్తలు