వాటిని ఆస్వాదించడంలో హైదరాబాద్‌ తర్వాతే ఏదైనా: అమిత్‌ అగర్వాల్‌

2 Dec, 2022 09:02 IST|Sakshi

నా జీవితంలో విడదీయరాని అనుబంధం 

సరికొత్త డిజైనింగ్‌ హబ్‌గా భాగ్యనగరం 

సంస్కృతి నుంచి ఆవిష్కృతమైన సిటీ ఇది 

బాలీవుడ్‌కు దీటుగా దక్షిణాది సినిమాలు 

అవకాశాలకు ఇక్కడ కొదవ లేదు 

ప్రముఖ ట్రెండీ డిజైనర్‌ అమిత్‌ అగర్వాల్‌ 

జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికలపై ఆయనో స్టార్‌.. దేశవ్యాప్తంగా మోడ్రన్‌ ఫ్యాషన్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ట్రెండీ డిజైనర్‌ అమిత్‌ అగర్వాల్‌. నగరం వేదికగా నిర్వహించిన ఫ్యాషన్‌ ఈవెంట్‌లో పాల్గొనడానికి ఇటీవల వచ్చిన ఆయన.. గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు. సిటీ అంటే తనకెంతో ఇష్టమని, క్రియేటివిటీ ఉండాలే గాని ఫ్యాషన్‌ రంగంలో అవకాశాలకు కొదవ లేదని, ముఖ్యంగా హైదరాబాద్‌ వేదికగా ఫ్యాషన్‌ ఔత్సాహికులకు విభిన్నమైన అవకాశాలున్నాయంటున్న అమిత్‌ ఆలోచనలు. అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..     
– సాక్షి, హైదరాబాద్‌

ఆస్వాదించడంలో హైదరాబాద్‌ తర్వాతే..  
ఫ్యాషన్‌ అనేది ఒక ప్రాంతానికో, నగరానికో పరిమితమయ్యేది కాదు. సంస్కృతిలో భాగంగా అధునాతన హంగులను ప్రతిబింబిచేది. హైదరాబాద్‌ వంటి నగరంలో ఫ్యాషన్‌ ఈ మధ్య వచ్చింది కాదు. ఇక్కడ మొదటి నుంచే అధునాతన జీవన విధానం, ఫ్యాషన్‌ హంగులకు కేంద్రం. అంతర్జాతీయంగా మారుతున్న మార్పులను ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకుంటోంది. కరోనాకు ముందు ఇక్కడ అతిపెద్ద ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నాను. మళ్లీ ఈ మధ్యనే నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో నా డిజైన్స్‌ను ప్రదర్శించాను.  

సౌత్‌ ఇండియన్‌ సినిమా పరిశ్రమ, ముఖ్యంగా హైదరాబాద్‌ వేదికగా నిర్మాణమవుతున్న సినిమాలు బాలీవుడ్‌కు దీటుగా ఫ్యాషన్‌ ట్రెండ్‌లను వాడుకుంటున్నాయి. కొత్త ఐడియాలను ఎప్పటికప్పుడు ఆస్వాదించడంలో నగరం తర్వాతే ఏదైనా. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలను దక్షిణాదిన డబ్‌ చేసేవారు. ప్రస్తుతం ఇక్కడి సినిమాలు బాలీవుడ్‌లో రిలీజ్‌ అవుతున్నాయి. పాన్‌ ఇండియా సినిమాలు, త్రీడీ సినిమాలు అవలీలగా తీసేయడం అభినందనీయం.  దక్షిణాదిలో స్టోరీ టెల్లింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి సంస్కృతిని సినిమాల్లో చూపించే విధానం బాగుంటుంది. సౌత్‌లో నిర్మించిన సూపర్‌ డీలక్స్‌ చిత్రం నన్నెంతగానో ఆకట్టుకుంది.  

చదవండి: (హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ)

సంస్కృతుల సమ్మేళనమే ‘వైవిధ్యం’.. 
నా జీవితంతో ఫ్యాషన్‌ విడదీయరాని అనుబంధంగా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఫ్యాషన్‌ నా కెరీర్‌గా నిర్ణయించుకున్నాను. కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి జీవితం సంతృప్తినిచ్చేది ఫ్యాషన్‌ అనే నమ్ముతాను. డిజైనింగ్‌లో మల్టిఫుల్‌ కలర్స్‌ వాడటం ఎంతో ఇష్టం. నా ప్రత్యేకత కూడా. మోల్డింగ్, గ్రిప్పింగ్‌లో జాగ్రత్తలు తీసుకుంటాను. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఎవరి ప్రత్యేకత వారిదే. విభిన్నంగా, వినూత్నంగా, సరికొత్తగా డిజైన్లను రూపొందిస్తున్న వారికి అవకాశాలకు కొదవ లేదు. 

కరోనా అనంతరం ఫ్యాషన్‌ రంగం మరింత అభివృద్ధి చెందింది, అవకాశాలు పెరిగాయి. అధునాతన స్టైల్స్, కలర్‌ కాంబినేషన్, ఆకట్టుకునే కలర్‌ మిక్సింగ్‌ డిజైనర్‌ భవిష్యత్‌ను నిర్దేషిస్తాయి. ఈ రంగంలో రాణించాలంటే వివిధ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో నైపుణ్యం సాధించాలి. అందుకే విభిన్న ప్రాంతాల వేదికలపై అనుభవాన్ని సాధించాలి. అలాంటి వారికి మంచి భవిష్యత్‌తో పాటు అమితమైన ప్రేమ, ఆదరణ లభిస్తుంది. దాని విలువ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు