Trolls On Rupankar Bagchi: ఎవరీ కేకే, ఆయనకంటే మేమే బాగా పాడతామన్న సింగర్‌.. నెట్టింట ట్రోలింగ్‌

1 Jun, 2022 16:25 IST|Sakshi

సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. కానీ ఆయన గొంతు సవరించుకుని పాడే పాటలకు దేశమే ఫిదా అయింది. సౌత్‌ నుంచి నార్త్‌ దాకా ఎన్నో భాషల్లో పాటలు పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రేమగీతాల కంటే విరహ గీతాలతోనే బాగా పాపులర్‌ అయ్యారు. కానీ అర్ధాంతరంగా ఆయన గొంతు మూగబోయింది. సింగర్​ కేకే అలియాస్​ కృష్ణకుమార్​ కున్నాత్‌ (53) మంగళవారం రాత్రి కోల్​కతా ప్రదర్శన తర్వాత​ గుండెపోటుతో కన్నుమూశారు. 

కేకే మృతి చెందడానికి కొన్ని గంటల ముందు బెంగాలీకి చెందిన సింగర్‌ రూపాంకర్‌ బగ్చీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అసలు కేకే ఎవరు? ఆయన్ను కీర్తిస్తున్నారెందుకు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? అంటూ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మండిపడ్డాడు. దీంతో ఈయన శాపనార్థాలే కేకే మృతికి కారణమయ్యాయంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

ఫేస్‌బుక్‌ లైవ్‌లో రూపాంకర్‌ మాట్లాడుతూ.. 'కోల్‌కతాలో కేకే షో ఉందనగానే ఎక్కడలేని ఎగ్జయిట్‌మెంట్‌ కనిపిస్తోంది. నేను, అనుపమ్‌ రామ్‌, సోమత, ఎమాన్‌ చక్రవర్తి, ఉజ్జయినీ ముఖర్జీ, కాక్టస్‌, ఫాజిల్స్‌, రూపమ్‌ ఇస్లామ్‌.. ఇంకా మరెందరో కోల్‌కతాకు చెందిన ఆర్టిస్టులు కేకే కంటే బాగా పాడతారు. మరి మా గురించి మీరెందుకు అంత ఎగ్జయిట్‌ అవరు? కారణమేంటో చెప్పండి. అసలు కేకే ఎవరు? అలాంటి వాళ్లకంటే మేము చాలా చాలా బాగా పాడతాం. నేను పైన చెప్పిన వారందరూ కేకే కంటే ఉత్తమంగా ఆలపించేవాళ్లే. దయచేసి ప్రాంతీయ గాయకులను ప్రోత్సహించండి. బెంగాలీవాసులుగా మసులుకోండి' అని చెప్తూ లైవ్‌ ముగించాడు.

ఈ లైవ్‌ జరిగిన కాసేపటికే కేకే మరణించడంతో అతడి ఫ్యాన్స్‌ రూపాంకర్‌పై ఫైర్‌ అవుతున్నారు. 'మరీ అంత అసూయనా, మీ శాపనార్థాల వల్లే ఆయన ఉసురు పోయింది', 'నిన్ను జైల్లో వేయాలి' అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రూపాంకర్‌ స్పందిస్తూ.. తాను కేవలం బెంగాలీ సంగీత సాహిత్యాన్ని ఆదరించకుండా పోతున్న ధోరణిపైనే ఆవేదన వ్యక్తం చేశానని కానీ అందరూ కేకే గురించి అన్నమాటలనే పట్టించుకుంటున్నారని చెప్పుకొచ్చాడు.

చదవండి:  సింగర్‌ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి..​
సింగర్‌ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు!

మరిన్ని వార్తలు