ఆస్పత్రిలో నటుడు.. ఆర్థిక సాయం కావాలంటూ..!

28 Jul, 2020 16:42 IST|Sakshi

ముంబై: టీవీ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నాడని చికిత్స కోసం ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అనుపమ్‌ సోదరుడు అనురాగ్‌ విజ్ఞప్తి చేశాడు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి డయాలసిస్‌ చేయించిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ముంబైలోని లైఫ్‌లైన్‌ ఆసుపత్రిలో చేర్పించామని, చికిత్సకు తమ వద్ద డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు.

అనుపమ్‌ శ్యామ్‌ ‘మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’ సీరియల్‌లో నటించాడు. అనుపమ్ ఆరోగ్యంపై ఆయన సోదరుడు మాట్లాడుతూ.. ‘అన్నయ్య గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడంతో ముందుగా హిందూజా ఆసుపత్రిలో చేర్పించాం. ఒకటిన్నర నెలలు చికిత్స చేయించాము. కానీ ఎప్పటికప్పుడు అతనికి డయాలసిస్ చేయించాలని వైద్యులు సూచించారు. దీనికి చాలా ఖర్చవుతున్నందున ఆయుర్వేద చికిత్స కోసం వెళ్లాలని అన్నయ్య నిర్ణయించుకున్నాడు. కానీ అది పనిచేయలేదు’ చెప్పుకొచ్చాడు. 

డయాలసిస్‌ చేయకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడని, వెంటనే ఆయనకు మళ్లీ డయాలసిస్‌ ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆయన డయాలసిస్ తర్వాత కుప్పకూలిపోయాడని చెప్పాడు. ప్రస్తుతం ఆయనకు ఖరీదైన చికిత్స అందించేందుకు తమ వద్ద డబ్బు లేదని, అన్నయ్య సంపాదించిందంతా ఆయన మందుల ఖర్చులకే సరిపోయిందన్నాడు. ఎవరైనా ముందుకు వచ్చి డబ్బు సహాయం చేసేలా చూడాలని అనురాగ్‌ అభ్యర్థించాడు. అనుపమ్‌ శ్యామ్‌ వైద్యానికి డబ్బు సాయం చేయాలంటూ ఆమిర్‌ ఖాన్‌, సోనుసూద్‌లకు ఓ ట్విటర్‌ యూజర్‌ ట్యాగ్‌ చేశాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు