-

టీవీ నటులను తాకిన డ్రగ్స్‌ సెగ

23 Sep, 2020 16:53 IST|Sakshi

ముంబై: నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్‌సీబీ ఎదుట హాజరుకాగా, తాజాగా డ్రగ్స్‌ సెగ టీవీ నటులను కూడా తాకింది. ప్రముఖ బుల్లితెర నటి అబిగేల్‌ పాండే, ఆమె ప్రియుడు, కొరియోగ్రాఫర్‌ సనం జోహార్‌ నివాసాల్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. (చదవండి: డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?)

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ జంట ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈ క్రమంలో డ్రగ్‌ డీలర్లు, మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్న తీరు గురించి అధికారులు వీరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా అబిగేల్‌ పాండే, సనం జోహార్‌ నచ్‌ బలియే వంటి పలు ప్రముఖ షోల్లో పాల్గొని ప్రాచుర్యం పొందారు. ఇక బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోని ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్‌ వ్యవహారంలో స్టార్‌ హీరోయిన్లు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ పేర్లతో పాటు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నమ్రతా శిరోద్కర్‌, దియా మీర్జా పేర్లు తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ దగ్గర పనిచేసిన టాలెంట్‌ మేనేజర్‌ జయ సాహాతో మత్తు పదార్థాల గురించి చాట్‌ చేసినట్లుగా వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి అరెస్టైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు