ఓటీటీలోకి రానున్న ఉదయ్‌ కిరణ్‌ చివరి చిత్రం

3 Jun, 2021 18:33 IST|Sakshi

దివంగత నటుడు, హీరో ఉదయ్‌ కిరణ్‌ మరణించి దాదాపు ఏడేళ్లు అవుతుంది. చివరిసారిగా ఆయన నటించిన మూవీ ‘చిత్రం చెప్పన కథ’. ఉదయ్‌ కిరణ్‌ చనిపోయిన రెండు నెలలకు ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. కానీ ట్రైలర్‌ విడుదల అనంతరం ఇందులో హీరోయిన్‌గా నటించిన మదల్సా శర్మ తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీలలో కలిపి దాదాపు 15 సినిమాల్లో నటించింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ తన సినీ కేరీర్‌కు ప్లస్‌ అవుతుందని ఉదయ్‌ తన సన్నిహితులతో చెప్పుకున్నట్లు సమాచారం. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్‌ చివరి దశలో ఉండగానే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్నేళ్లకు ఈ మూవీని డిజిటల్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారట. అయితే 2020లో లాక్‌డౌన్‌లో విడుదల చేయాలని చూసినప్పటికీ రేటు విషయంలో మేకర్స్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా ఈ సెకండ్‌ వేవ్‌లో  చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ చివరి సినిమా అయిన ‘చిత్రం చెప్పిన కథ’  కూడా ఎలాగైనా ఓటీటీలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు కాస్త గట్టిగానే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికంగానే ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో సమాచారం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో హీరో తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదరయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. అలాగే ఉదయ్ కిరణ్ చివరి సినిమా కాబట్టి అభిమానులు కూడా చూస్తారని ఓటీటీ సంస్థలు నమ్ముతున్నాయి. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎనిమిదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న మాట.

మరిన్ని వార్తలు