Udhayanidhi Stalin: నటన వదిలినా సినిమా వదలను

19 Jan, 2023 09:44 IST|Sakshi

తమిళసినిమా: రాజకీయ కుటుంబం నుంచి సినీరంగ ప్రవేశం చేసి నిర్మాతగా మారి, ఆపై నటుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా అవతారమెత్తి, ఆ తరువాత ఎమ్మెల్యేగా గెలిచి, ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన యువ రాజకీయ నాయకుడు ఉదయనిధిస్టాలిన్‌. ఈయన మంత్రి అయిన తరువాత నటనకు స్వస్తి పలికారు. ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం మామన్నన్‌. కీర్తీసురేశ్‌ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్‌ తెరకెక్కించారు.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇకపోతే డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో నంబర్‌వన్‌ స్థాయికి ఎదిగిన ఆయనకు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకూ వదలకుండా విడుదల చేస్తోంది. ఇటీవల పొంగల్‌కు విడుదలైన విజయ్‌ వారిసు, అజిత్‌ తుణివు చిత్రాలు కూడా ఈ సంస్థ ద్వారా వచ్చినవే. ఆ మధ్య కమలహాసన్‌ నటించిన విక్రమ్‌ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థనే విడుదల చేసింది. ఇలా డిస్ట్రిబ్యూటర్‌గానూ భారీ లాభాలను గడిస్తున్నారు.

(వారిసు చిత్రం కొన్ని ఏరియాలు మాత్రమే) అలా ఉదయనిధి స్టాలిన్‌ నటనకు దూరం అయినా, సినిమాను మాత్రం వదులుకోవడం లేదు. ఇందుకు మరో ఉదాహరణ సినిమాల కోసం ఈయన రూ. 2వేల కోట్లు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల బ్లాక్‌ షీప్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ను కొనేసినట్లు సమాచారం. అది ఇప్పుడు టీవీ చానల్‌గా రూపాంతరం చెందింది. ఈ చానల్‌ కోసం, యూట్యూబ్‌ చానల్‌ కోసం కొత్తగా సినిమాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు