భారత్‌కు నీరవ్‌ మోదీ అప్పగింత!

17 Apr, 2021 01:14 IST|Sakshi

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వ అంగీకారం

ఉత్తర్వులపై యూకే హోం సెక్రెటరీ ప్రీతి పటేల్‌ సంతకం

నీరవ్‌ బెయిల్‌ పిటిషన్‌ను గతంలోనే తోసిపుచ్చిన వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు

లండన్‌ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్‌కు అవకాశం

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్‌ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్‌ కేసులు నీరవ్‌ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్‌ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు.

ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి
నీరవ్‌ మోదీ తన మామ మెహుల్‌ చోక్సీతో కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్‌ను భారత్‌ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్‌ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్‌ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్‌ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్‌ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తెలియజేసింది.  యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్‌ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్‌ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు.

అప్పగింత ఎప్పుడు?  
నీరవ్‌ మోదీని వాండ్స్‌వర్త్‌ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ కారాగారంలో ఉన్న 12వ నంబర్‌ బ్యారక్‌కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్‌ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్‌ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్‌మోదీ అప్పీల్‌ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్‌ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్‌ మోదీ లీగల్‌ టీమ్‌ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్‌ మోదీ భారత్‌కు చేరుకుంటారు.  

అసలేమిటి కేసు?  
నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ను (ఎల్‌ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్‌ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్‌ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్‌బీ బ్యాంక్‌ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్‌ కోర్టులో దాఖలు చేసింది.

2019 డిసెంబర్‌ 20న 30 మందిపై రెండో చార్జిషీట్‌ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్‌లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్‌లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్‌ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్‌ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్‌ కోర్టు అతడిపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్‌ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు, లండన్‌ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్‌ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు