Ponniyin Selvan: I: ఆ ఇద్దరు స్టార్స్‌ చేతులు కలిపుంటే వేరే లెవల్‌ ఉండేది!

8 Oct, 2022 18:33 IST|Sakshi

దేశంలో ఎంతమంది దర్శకులున్నా వారిలో కొందరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి నుంచి సినిమా వస్తుందంటే చాలు అందరూ కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఆయన తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ తెరకెక్కించారు. వెయ్యి ఏళ్లు వెనక్కి వెళ్లి చోళ రాజుల చరిత్రను తెరపై చూపించాడు. అందుకే ఆ వైబ్రేషన్ వరల్డ్ వైడ్ గా కనిపిస్తోంది. మణిరత్నం మేకింగ్‌పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి మనమూ పొన్నియిన్ సెల్వన్ లోకాన్ని ఓసారి చుట్టి వద్దాం.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా ట్రెండ్‌కు ప్రాణం పోసింది. ఏ సినిమా తీసినా, ఎంత పెట్టి తీసినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని బాహుబలి సిరీస్ నిరూపించింది. ఆ ధైర్యంతోనే మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ను పట్టాలెక్కించారు. మణిరత్నం 40 ఏళ్ల కల సాకారం అయిందంటే అందుకు కారణం మన బాహుబలి సినిమానే! ఒక సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసి కోట్లు కొల్లగొట్టవచ్చు అని ఈ సినిమాతో నిరూపితమైంది. అందుకే 5 భాగాలుగా ఉన్న పెద్ద నవల పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మణిరత్నం. మొదటి భాగం ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండవ భాగం సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత విడుదల చేస్తారట.

తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నవల పొన్నియిన్ సెల్వన్. 1899 నుంచి ఈ నవల ప్రాచుర్యంలో ఉంది. కల్కి మ్యాగజీన్‌లో ఈ నవలను ప్రచురిస్తూ వచ్చారు. అంతకు ముందు వచ్చిన ది చోళాస్, హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్, పల్లవాస్ ఆఫ్ కంచి పుస్తకాలను ఆధారంగా చేసుకుని పొన్నియిన్ సెల్వన్ నవలను రాసుకొచ్చారు కల్కి కృష్ణమూర్తి. 1958 నుంచే పొన్నియిన్ సెల్వన్ నవలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1980లో, 2000 సంవత్సరంలో, ఆ తర్వాత 2010లో పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలనుకున్నాడు మణిరత్నం. మొదట ఈ భారీ చిత్రాన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్‌లో ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. ఆ తర్వాత విజయ్, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కించాలనుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్‌తో ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది

2018లో మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ మంచి విజయాన్ని అందుకుంది.  దాంతో ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ పొన్నియిన్ సెల్వన్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 240 ఏళ్లుగా కోలీవుడ్ ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు మణిరత్నం తెరకెక్కిస్తున్నారని తెలిసి తమిళనాట ఆనందం వెల్లివిరిసింది. ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ లో వీరుడిగా నటించాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్‌,  ఇప్పుడు మిగతా హీరోలు లీడ్ రోల్స్ తీసుకోవడంతో కనీసం ఒక చిన్న పాత్రైనా ఇవ్వండి అని అడిగారట. సినిమాలో పెరియ పజువెట్టరాయర్ పాత్ర చేస్తానని అడిగితే రజనీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌కు ఆ పాత్ర సరితూగదని వద్దన్నారట. సినిమాలో ఇదే పాత్రను శరత్ కుమార్ చేసారు.

గతంలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించి ఉంటే కనుక, ప్రస్తుతం కార్తి చేసిన పాత్రను రజనీకాంత్ చేసి ఉండేవారట. అలాగే జయం రవి చేసిన పాత్రను కమల్ హాసన్, విక్రమ్ కనిపించిన పాత్రను విజయ్ కాంత్‌తో చేయించాలి అనుకున్నారు. ఐశ్వర్యారాయ్ పాత్రలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖను, త్రిష క్యారెక్టర్ లో శ్రీదేవిని, ముందుగా అనుకున్నారట.


ఏది ఏమైనా పొన్నియన్ సెల్వన్ కోసం రజనీ, కమల్ చేతులు కలిపి ఉంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేకంగా నిలిచిపోయేది. ప్రతీ మేకర్‌కు ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ డ్రీమ్ ఫుల్‌ఫిల్‌ కావాలంటే అందుకు సరైన టైమ్ రావాలి. ఆ టైమ్ కోసం 40 ఏళ్లు ఎదురు చూశారు మణిరత్నం. 

సుహాసినితో పెళ్లికి ముందు నుంచే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కు సంబంధించిన బుక్స్ బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నారంటే మీరు ఆశ్చర్యపోకమానరు. ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేసింది. ఆ విషయాన్ని మొదటి భాగం క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు దర్శకుడు మణిరత్నం. ఒక పాత్ర నెగిటివ్ మరొకటి పాజిటివ్. రెండో భాగంలో ఐశ్వర్యారాయ్ పాజిటివ్ క్యారెక్టర్ కు సంబంధించిన స్టోరీని రివీల్ చేయబోతున్నారు. పొన్నియిన్ లో భాగం అయ్యేందుకు ఐశ్వర్య రూ.10 కోట్లు పారితోషికం తీసుకుందట. విక్రమ్ రూ.15 కోట్లు, జయం రవి రూ.8 కోట్లు, కార్తి రూ.5 కోట్లు, త్రిష రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నారట.

రియల్ లొకేషన్స్ షూటింగ్స్‌కు ప్రాధ్యానతనిచ్చారు మణిరత్నం. అందుకే ఇంత భారీ చిత్రాన్ని పక్కా ప్రణాళికతో కేవలం 150 రోజుల్లో రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగలిగారు. రెండు భాగాలకు కలసి 300 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం మణిరత్నం రెహమాన్‌ను బాలి తీసుకువెళ్లి అక్కడ ట్యూన్స్ కంపోజ్ చేయించారట. వెయ్యేళ్ల కాలం నాటి ట్యూన్స్ ఎలా ఉండేవో అలా కావాలన్నారట.

చదవండి: గాడ్‌ ఫాదర్‌తో మరోసారి ఆ విషయం రుజువైంది
చిరంజీవి ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా?

మరిన్ని వార్తలు