posani krishna murali: పోసాని ఇంటిపై రాళ్లదాడి

1 Oct, 2021 04:19 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌ అభిమానుల పనే అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు

అమీర్‌పేట (హైదరాబాద్‌): ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తుతెలి యని దుండగులు రాళ్లతో దాడి చేశారు. పోసానితోపాటు కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారు. మూడు రోజుల క్రితం పోసానిపై దాడికి యత్నించడం, ఇంటి వద్ద రాళ్లదాడి చేయ డాన్ని బట్టి చూస్తే ఇది పవన్‌ కల్యాణ్‌ అభిమానుల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటి వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా రాళ్లతో ఇంటిపై దాడి చేశారు.

పెద్ద శబ్దం రావడంతో లోపల పడుకుని ఉన్న వాచ్‌మన్‌ యాకయ్య, అతని భార్య శోభ భయాందోళనకు గురయ్యారు. అప్పటికే రెండు రాళ్లు లోపల వచ్చి పడ్డాయి. గేటు వద్దకు వచ్చి చూడగా బయట ఇద్దరు వ్యక్తులు కనిపించారు. దీంతో వాచ్‌మన్‌ సమీపంలో ఉండే పురుషోత్తం అనే వ్యక్తికి ఫోన్‌ చేయగా, ఆయన వచ్చే లోపు దుండగులు పారిపోయారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు చుట్టుపక్కల గాలించినా ఆగంతకులు కనిపించలేదు.

ప్రాణ భయంతో గేటు తీసి బయటకు రాలేకపోయామని శోభ తెలిపారు. వాచ్‌మన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు చెప్పారు. పోసాని నివాసంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంతోపాటు ప్రైవేటు హాస్టల్‌ సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

పోసానిపై దాడితో సంబంధం లేదు: జనసేన  
తెలంగాణలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జి ఎన్‌.శంకర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్‌ కళ్యాణ్‌పై పోసాని చేసిన విమర్శలను ఆయన ఖండించారు. పోసానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తెలంగాణ నుంచి బహిష్కరించాలని డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు