Army Soldiers Biopics: రీల్‌ మీదకు రానున్న వీర జవాన్ల బయోపిక్స్‌ ఇవే

26 Jan, 2022 08:39 IST|Sakshi

కంటి నిండా నిదుర ఉండదు..
సేద తీరే తీరిక ఉండదు.
కుటుంబంతో గడిపే సమయం ఉండదు...
ఒక్కటే ఉంటుంది.. 
‘దేశం మీద ప్రేమ’ ఉంటుంది.
అందుకే నిదుర లేకుండా కాపలా కాస్తారు.
చల్లగాలికీ సేద తీరరు.
దేశమే కుటుంబం అనుకుంటారు.
దేశం కోసం ప్రాణాలు వదులుతారు.
అందుకే ‘సెల్యూట్‌ సైనికా’.

దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, పోరాడిన వీర జవాన్లను ‘గణతంత్ర దినోత్సవం’ సందర్భంగా స్మరించుకుందాం. రీల్‌ మీదకు రానున్న ఈ ‘రియల్‌ హీరో’ల బయోపిక్స్‌ గురించి తెలుసుకుందాం.

బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. అందులోనూ దేశం కోసం పోరాడిన సైనికుల జీవిత చిత్రాలకు ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. చరిత్ర చెప్పే ఈ చిత్రాలు చలన చిత్ర చరిత్రలోనూ ఓ చరిత్రగా మిగిలిపోతాయి. దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌’ ఒకరు. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. సందీప్‌ పాత్రను అడివి శేష్‌ చేశారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. సందీప్‌ పోరాటం ఈ తరానికి తెలుసు. ఇక ముందు తరానికి చెందినవారిలో 1971 భారత్‌–పాక్‌ యుద్ధం గురించి తెలియనివారు ఉండరు. ఈ యుద్ధంలో పోరాడిన వీరుల నేపథ్యంలో మూడు నాలుగు చిత్రాలు నిర్మాణంలో ఉండటం విశేషం.

భారత్‌–పాక్‌ యుద్ధంలో పోరాడిన సాహసోపేత సైనికుడు ‘సామ్‌ మానెక్‌ షా’ (పూర్తి పేరు సామ్‌ హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్‌ షా) ఒకరు. ఈ యుద్ధంలో ఆర్మీ చీఫ్‌గా భారత్‌కు పెద్ద విజయాన్ని సాధించిపెట్టిన ఘనత మానెక్‌ షాది. మొత్తం ఐదు యుద్ధాల్లో పాల్గొన్న వీరుడు మానెక్‌ షా. ఆయన జీవితం ఆధారంగా విక్కీ కౌశల్‌ టైటిల్‌ రోల్‌లో మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సామ్‌ బహదూర్‌’.

అలాగే 1971 భారత్‌ – పాక్‌ యుద్ధంలో పోరాడిన ఓ వీర జవాను బ్రిగేడియర్‌ బల్‌రామ్‌సింగ్‌ మెహతా. ఈ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి తూర్పు వైపున పోరాడారు మెహతా. ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్‌రామ్‌ సింగ్‌ మెహతా పాత్రను ఇషాన్‌  కట్టర్‌ చేస్తున్నారు. రాజా కృష్ణ మీనన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బల్‌రామ్‌ సింగ్‌ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్‌ చౌఫిస్‌’ (2016) పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి బల్‌రామ్‌ సింగ్‌ మోహతాను కూడా చిత్రబృందం ఆహ్వానించింది.

1971 యుద్ధంలోనే పోరాడిన అరుణ్‌ ఖేతర్పాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్‌’. యుద్ధంలో వీరమరణం పొందారు ఖేతర్పాల్‌. పరమవీర చక్ర సాధించిన యువసైనికుడు ఆయన. ఈ సైన్యాధికారి పాత్రను వరుణ్‌ ధావన్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకుడు. ఇక కార్తీక్‌ ఆర్యన్‌ నటిస్తున్న ‘కెప్టెన్‌ ఇండియా’ కూడా యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్‌ ఆధారంగా దర్శకుడు హన్సల్‌ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్‌ పైలెట్‌గా చేస్తున్నారు.

దేశభక్తి సినిమా కాదు కానీ...
‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేహం గురించి చెప్పిన కథే ఈ సినిమా’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో ఈ సినిమా తీశారు. అయితే అంతర్లీనంగా దేశభక్తి కనిపించే సినిమా కాబట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించారు. ఈ భారీ పాన్‌ ఇండియన్‌ సినిమాపై అందరి దృష్టి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో వంద శాతం సీటింగ్‌ ఆక్యుపెన్సీ ఉన్నట్లయితే మా సినిమాను ఈ ఏడాది మార్చి 18న విడుదల చేస్తాం. లేకపోతే ఈ ఏడాది ఏప్రిల్‌ 28న చిత్రం విడుదలవుతుంది’’ అని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. మొత్తం 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 

ఇంకా పలు దేశభక్తి చిత్రాలు వెండితెరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా చిత్రాలు ఎన్ని వస్తే అంత మంచిది. ఎందుకంటే సినిమా శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి చరిత్ర సులువుగా యువతరానికి చేరుతుంది.

మరిన్ని వార్తలు