హీరోయిన్లు సవాల్‌గా తీసుకుంటున్న లేడీస్‌ స్పెషల్‌ మూవీస్‌

24 Jan, 2022 08:21 IST|Sakshi

బస్సుల్లో లేడీస్‌ స్పెషల్‌ బస్సులుంటాయి.. గుడిలో లేడీస్‌ స్పెషల్‌ క్యూలుంటాయి.. లేడీస్‌ స్పెషల్‌ టికెట్‌ కౌంటర్లుంటాయి... మరి సినిమాల్లో... ఇక్కడా లేడీస్‌ స్పెషల్స్‌ ఉంటాయి. స్పెషల్‌గా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు వస్తాయి. ఈ సినిమాలను కథానాయికలు సవాల్‌గా తీసుకుంటారు. ఆ ‘లేడీస్‌ స్పెషల్‌’ సినిమాల గురించి తెలుసుకుందాం.

‘అనామిక’, ‘మాయ’, ‘డోర’... ఇలా ఇప్పటికే కెరీర్‌లో పలు లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్స్‌ చేసి, ప్రేక్షకులను మెప్పించారు నయనతార. ప్రస్తుతం ఆమె చేస్తున్న లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘కనెక్ట్‌’. 2015లో నయనతార నాయికగా ‘మాయ’ సినిమాను తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌ ఈ ‘కనెక్ట్‌’కు దర్శకుడు. ఇది థ్రిల్లర్‌ జానర్‌ మూవీ. ఈ చిత్రానికి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ నిర్మాతలు. ఇక 2007లో వచ్చిన ‘పరుత్తి వీరన్‌’లో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు సాధించిన  హీరోయిన్‌ ప్రియమణి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపై కూడా దృష్టి సారించారు.

ఇటీవల హిట్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్‌’లో ఓ లీడ్‌ రోల్‌ చేసి అందర్నీ మెప్పించిన ప్రియమణి చేతిలో ప్రస్తుతం ‘సైనైడ్‌’, ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ అనే రెండు ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిలింస్‌ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ క్రైమ్‌ థ్రిల్లర్సే కావడం విశేషం. ‘సైనైడ్‌’ చిత్రానికి రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకుడు కాగా, ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ చిత్రానికి వివేక్‌ దర్శకుడు. మరోవైపు ‘హ్యాపీ బర్త్‌డే’ అనే క్రైమ్‌ థ్రిల్లర్‌లో లావణ్యా త్రిపాఠి లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ‘మత్తువదలరా’ ఫేమ్‌ రితేష్‌ రాణా ఈ సినిమాకు దర్శకుడు.

ఇక యాభై సినిమాలు చేసిన అనుభవం ఉన్న సమంత ఒక్కసారిగా లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్స్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్లున్నారు. మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘శాకుంతలం’, ‘యశోద’, ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో శాంతరూబన్‌ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌లోనూ సమంత భాగమయ్యారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌లో ఉంది. హరి అండ్‌ హరీష్‌ ద్వయం తెరకెక్కిస్తున్న ‘యశోద’ చిత్రం షూటింగ్‌ దశలో ఉండగా, మిగతా చిత్రాల రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కావాల్సి ఉంది. ‘శాకుంతలం’ చిత్రం ఈ ఏడాది వెండి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డీకే దర్శకత్వంలో షూటింగ్‌ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న తమిళ చిత్రం ‘కరుంగా ప్పియమ్‌’లో కాజల్‌ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రధారులుగా నటించారు.

ఇక రెజీనా నటించిన మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమా ‘శాకిని డాకిని’. ఇందులో నివేదా థామస్‌ మరో హీరోయిన్‌. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో త్వరలో స్ట్రీమింగ్‌ కానుందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలంటే కీర్తీ సురేష్‌ గుర్తు రాకుండా ఉండరు. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’తో ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌కు ఓ బెస్ట్‌ ఆప్షన్‌గా మారారు కీర్తి. ఈ చిత్రం తర్వాత కీర్తి ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ వంటి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేశారు. తాజాగా చేసిన మరో ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘గుడ్‌లక్‌ సఖి’. నగేశ్‌ కుకునూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

ఇటు దాదాపు తొమ్మిది ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న హన్సిక చేతిలో మూడు ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ ఉన్నాయి. ‘మై నేమ్‌ శ్రుతి’, ‘105 మినిట్స్‌’, ‘రౌడీ బేబీ’.. హన్సిక చేస్తున్న ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ ఇవే. ఇంకోవైపు ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలు చేయడానికి ముందు వరుసలో ఉండే సాయిపల్లవి ఇటీవల ఓ లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ చేశారు. ఈ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక వీరితోపాటు మరికొందరు హీరోయిన్స్‌ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌తో సెట్స్‌లో బిజీగా ఉన్నారు. కెరీర్‌ మొత్తంలో ఏ హీరోయిన్‌కి అయినా గ్లామర్‌ క్యారెక్టర్స్‌కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అందుకే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు అవకాశం వస్తే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు. ఈ సినిమాలను ‘స్పెషల్‌’గా భావించి, హార్డ్‌ వర్క్‌ చేస్తారు. 

హిందీలో లేడీస్‌ స్పెషల్స్‌
బాలీవుడ్‌లోనూ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. బీ టౌన్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ చేతిలో ప్రస్తుతం మూడు (‘థాకడ్‌’, ‘ఎమర్జెన్సీ’, ‘తేజస్‌’) ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ ఉన్నాయి. అలాగే తాప్సీ చేతిలో ఐదు (శభాష్‌ మిథు’, దోబార’, లూప్‌ లపేట’, ‘బ్లర్‌’, ‘ఓ లడకీ హై కహాన్‌’) ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఇంకా ‘ద్రౌపది’లో దీపికా పదుకోన్, ‘గుంగూబాయి కతియావాడి’లో ఆలియా భట్, ‘జీ లే జరా’లో ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్, ‘ది లేడీ కిల్లర్‌’లో భూమీ ఫడ్నేకర్, ‘ఉమ’లో కాజల్‌ అగర్వాల్, ‘చత్రీవాలీ’లో రకుల్‌ప్రీత్‌ సింగ్, ‘గుడ్‌లక్‌ జెర్రీ’లో జాన్వీ కపూర్‌... ఇలా మరికొందరు హీరోయిన్స్‌ ఒకవైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే ఇలా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపైనా దృష్టి పెడుతున్నారు.

మరిన్ని వార్తలు