క్రిస్‌మస్‌ సిత్రాలు.. థియేటర్లలో సందడికి సిద్ధంగా..

20 Nov, 2021 11:04 IST|Sakshi

Upcoming Movies In Theaters On This Christmas Festival: సినిమా విడుదలకు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడుతుంటారు. పండగ వేళ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి అనేక కసరత్తులు చేస్తారు. పర్వదినాల్లో సినిమాలను ప్రదర్శించేందుకు ఆసక్తిగా సిద్ధమవుతుంటారు మేకర్స్‌. ఈ సవంత‍్సరం దసరా, దీపావళి సందడి ముగిసింది. దీపావళికి థియేటర్లలో రిలీజై హిట్‌ సాధించిన బాలీవుడ్‌ చిత్రం 'సూర్యవంశీ'. ఈ ఏడాది చివర్లో క్రిస్మస్‌ పండుగ. గతేడాది క్రిస్మస్‌కు కొవిడ్‌ కారణంగా ఏ చిత్రం థియేటర్లతో విడుదల కాలేదు. కరోనాతో దెబ్బతిన్న థియేటర్లకు మళ్లీ పాతవైభవాన్ని తీసుకురానున్నాయి పలు చిత్రాలు. 

1. గని

గద్దలకొండ గణేష్‌ తర్వాత వరుణ్‌తేజ్‌ నుంచి వస్తోన్న చిత్రం ‘గని’. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకుంటోంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌. ఈ సినిమా డిసెంబర్‌ 24న విడుదల కానుంది. 

2. శ్యామ్‌ సింగరాయ్‌

డిసెంబర్‌ 24న రిలీజ్‌ కానున్న నాని చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌. ఈ చిత్రంపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతకుముందు వచ్చిన టక్‌ జగదీష్‌, వీ చిత్రాలు ఓటీటీలో రిలీజ్‌ కాగా, చాలా కాలం తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బెంగాల్‌ నేపథ్యం ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ‘టాక్సీవాలా’తో విజయం అందుకున్న రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

3. '83'

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘83’. భారత క్రికెట్‌ జట్టు 1983లో సాధించిన ప్రపంచ కప్పు విజయం నేపథ్యంలో సాగే చిత్రమిది. రణ్‌వీర్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌గా ఆయన భార్య రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. ప్రముఖ దర్శకుడు కబీర్‌ఖాన్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2019 జూన్‌లో మొదలైంది. 2020 ఏప్రిల్‌ 10న విడుదల అనుకున్నా కరోనా కారణంగా ఆ ఏడాది డిసెంబరు 25కి మారింది. అప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఈ ఏడాది జూన్‌ 4న విడుదల అని ప్రకటించారు. ఎక్కువ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమల్లో ఉండటంతో మళ్లీ వాయిదా వేసి డిసెంబరు 24 అని ఖరారు చేశారు. ఈ తేదీ ఎట్టిపరిస్థితుల్లోనూ మారే అవకాశం లేదని చిత్రబృందం చెబుతోంది. ‘83’ విజయంపై బాలీవుడ్‌ వ్యాపార వర్గాలు చాలా నమ్మకంగా ఉన్నాయి.

4. జెర్సీ (హిందీ)

తెలుగు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ‘జెర్సీ’ చిత్రం అదే పేరుతో హిందీలోనూ రూపొందింది. ఆయనే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. షాహిద్‌కపూర్‌ కథానాయకుడిగా నటించారు. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’గా మెప్పించిన షాహిద్‌ ఈ చిత్రంపైనా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ  సినిమా డిసెంబర్‌ 31న విడుదల కానుంది. 

చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్‌ వెబ్ సిరీస్‌ ఇవే..

మరిన్ని వార్తలు