Horror Movies: ఆత్మ, ప్రేతాత్మల నేపథ్యంలో రానున్న సినిమాలివే!

3 May, 2023 07:43 IST|Sakshi

ప్రతి సినిమా కథకీ ఒక సోల్‌ ఉంటుంది. ఆ ఆత్మ ఎంత బలంగా ఉంటే సినిమా అంతగా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఒకవేళ సినిమా కథే ‘ఆత్మ’ చుట్టూ తిరిగితే.. ఆ ఆత్మ భయపెడుతుంది... థ్రిల్‌కి గురి చేస్తుంది. ఆత్మ చుట్టూ అల్లిన కథ బలంగా ఉంటే.. బాక్సాఫీస్‌ ఖజానాని వసూళ్లు ఆవహించినట్టే. ఇక ప్రస్తుతం ఆత్మ, ప్రేతాత్మల నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ‘ఆత్మ’కథా చిత్రాల గురించి తెలుసుకుందాం..

రాశీ ఖన్నాకి హారర్‌ జానర్‌ అంటే ఇష్టం. అందుకే హారర్‌ జానర్‌లో సాగే ‘అరణ్‌మణై 3’కి చాన్స్‌ వచ్చినప్పుడు హ్యాపీగా ఓకే చెప్పేశారు. ఇప్పుడు నాలుగో భాగంలోనూ నటిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుందర్‌.సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్‌మణై’, ‘అరణ్‌మణై 2’, ‘అరణ్‌మణై 3’ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు నాలుగో భాగం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రంలో ఆర్య హీరో. గత మూడు భాగాల్లో నటించిన చిత్రదర్శకుడు సుందర్‌ ఇందులోనూ కీలక పాత్రలో కనిపిస్తారు. రాశీ ఖన్నా ఒక కథానాయిక కాగా మరో నాయికగా తమన్నా నటిస్తున్నారు. మూడో భాగంలో ఆండ్రియా ఆత్మగా కనిపించారు. నాలుగో భాగంలో తమన్నానే ఆత్మ అని సమాచారం. మరి.. తమన్నా, రాశీల్లో ఆత్మ ఎవరనేది ఈ ఏడాది చివర్లో తెలిసిపోతుంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

క్యూట్‌ బ్యూటీ సమంత ప్రేతాత్మగా భయపెట్టనున్నారని సమాచారం. అది కూడా హిందీ ప్రేక్షకులను. ఆయుష్మాన్‌ ఖురానా, సమంత జంటగా అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హారర్‌–కామెడీ జానర్‌లో సాగే ఈ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఒకటి ప్రేతాత్మ పాత్ర అని టాక్‌. ‘వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌ నగర్‌’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ఆరంభమవుతుందని బాలీవుడ్‌ ఖబర్‌.

‘ఎవరికీ అంతు చిక్కని రహస్య ప్రపంచం భైరవ కోనలోకి ప్రవేశించండి’ అంటూ సందీప్‌ కిషన్‌ హీరోగా రూపొందుతున్న ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్‌ లుక్‌ విడుదలైన విషయం తెలిసిందే. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మిస్టరీ మూవీలో ఆత్మల నేపథ్యం కూడా ఉంటుందని సమాచారం. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఓ యువకుడు డిటెక్టివ్‌ కావాలనుకుంటాడు. ప్రేమలో పడిన అతడు తన ప్రేయసితో ఆనందంగా ఉంటాడు. అతని హ్యాపీ లైఫ్‌ ఒక టర్న్‌ తీసుకుంటుంది. రాత్రి సమయంలో రాకపోకలు నిషేధం అయిన మారేడు కోన ప్రాంతానికి అతను వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఊరికి ఆ యువకుడు ఎందుకు వెళ్లాడు? ఆ తర్వాత ఏం జరిగిందనే అంశంతో రూపొందుతున్న చిత్రం ‘అన్వేషి’. విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రకథ ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలో సాగుతుంది. 

ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని ‘ఆత్మ’కథలు కూడా ఉన్నాయి. హారర్‌ జానర్‌కి ట్రెండ్‌తో పని లేదు. ఎప్పుడు తీసినా.. సరిగ్గా తీస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. మరి.. రానున్న ‘ఆత్మ’కథల్లో ఎన్ని కథలు ప్రేక్షకులకు నచ్చుతాయో చూడాలి.

చదవండి: ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న స్టార్‌ హీరోయిన్‌
ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం

మరిన్ని వార్తలు