సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు

21 Dec, 2021 12:23 IST|Sakshi
అద్దరిపేట సమీపాన సముద్రాన్ని చీల్చుతున్నట్టుగా ఉన్న పంపు హౌస్‌ బ్రిడ్జి (ఇక్కడ చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయి)

వెండితెరపై అందాల సాగరం

‘ఉప్పెన’తో అందరి దృష్టీ ఇటువైపు.. 

పిఠాపురం(తూర్పుగోదావరి): పైన నీలాల నింగి.. కింద నీలి సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. వాటి అంచుల్లో పాలల్లా పరచుకున్న తెల్లని నురుగు.. మెత్తని ఇసుక తిన్నెలు.. వీనులకు ఆనందాన్నిచ్చే సాగర ఘోష.. ఇటు నేలకు.. అటు సాగరానికి సరికొత్త అందాలను అద్దే మడ అడవులు.. హోప్‌ ఐలాండ్‌.. మనసుకు ఆహ్లాదాన్ని అందించే ఇటువంటి విభిన్నమైన ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఉప్పాడ సాగర తీర సౌందర్యం.. వెండితెర ప్రముఖుల్ని మరోసారి ఎంతో ఆకర్షిస్తోంది.

‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..’ అంటూ ‘ఉప్పెన’ సినిమాలో హీరో వైష్ణవ్‌తేజ్‌ పాడిన పాట.. ఉల్లాసంగా ఆడిన ఆట కుర్రకారు గుండెల్ని ఊపేసింది. ఉప్పాడ సాగర తీర సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం బంపర్‌ హిట్‌ కొట్టడంతో.. దర్శకుల దృష్టి మళ్లీ ఈ ప్రాంతం వైపు మళ్లింది. ఉప్పాడ అందాలు వారిని ఈ ‘తీరానికి లాగేటి దారం’గా మారిపోయాయి. కొత్త సినిమాలతో పాటు టీవీ సీరియళ్ల చిత్రీకరణకు కూడా ఉప్పాడ తీరం కేంద్రంగా మారుతోంది.
 

గతంలో.. 
చాలాకాలం కిందట ఉప్పాడ తీరంలో సినిమా షూటింగ్‌లు జరిగాయి. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు హీరోగా, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితర అగ్రశ్రేణి నటులు నటించిన ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం ఉప్పాడ తీరంలో జరిగింది. తరువాత రణరంగం, పోరు, కనకం, డియర్‌ కామ్రేడ్, దుర్మార్గుడు, ఆగ్రహం, ఒక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా.. తదితర సినిమాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. తరువాత కొన్నాళ్లు అంతగా షూటింగ్‌లు లేవు.

కానీ ఉప్పెన సినిమాతో సాగరతీరం మరోసారి సినిమా షూటింగ్‌లకు నెలవుగా మారింది. ఇప్పుడు తీరంలో తరచుగా ‘క్లాప్‌.. స్టార్ట్‌.. రోల్‌.. కెమెరా.. యాక్షన్‌.. అంటూ సినిమా షూటింగ్‌ల సందడి కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమా షూటింగ్‌ ఈ ప్రాంతంలోని పండూరుతో పాటు అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది. వీటితో పాటు పలు ప్రముఖ బుల్లితెర సీరియల్స్‌ షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి.

ఉప్పెన సినిమా షూటింగ్‌ జరిగిన కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌ 

కాకినాడ నుంచి తుని సమీపంలోని అద్దరిపేట వరకూ ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ సమీపంలోని హోప్‌ ఐలాండ్, మడ అడవులు.. చూడచక్కటి లొకేషన్లతో సందర్శకులనే కాదు.. వెండితెర, బుల్లితెర దర్శకుల కళ్లను కూడా కట్టి పడేస్తున్నాయి. కడలి కెరటాలు.. పచ్చని చెట్లు.. ఇసుక తిన్నెలు.. మధ్యలో ఉన్న కాలువలు ఎక్కడో ఉన్న దీవులను తలపిస్తుంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయడంతో ఇక్కడ షూటింగ్‌లు జరుపుకునేందుకు ఎక్కువ మంది సినిమా వాళ్లు ఆసక్తి చూపుతున్నారు.

ఉప్పాడ.. నా కెరీర్‌ను మలుపు తిప్పింది 
నా తొలి సినిమా షూటింగ్‌ నా సొంత ఊరిలో జరుపుకోవడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఏ దర్శకుడికీ దక్కని అవకాశాన్ని నా సొంత ఊరిలో ప్రకృతి నాకు ఇచ్చింది. కాకినాడ – ఉప్పాడ సాగరతీరంలో ఎన్నో అందమైన లోకేషన్లున్నాయి. ఉప్పెన సినిమాలో లొకేషన్లు చూసి, హిందీ నటుడు ఆమిర్‌ఖాన్‌ సైతం ఇక్కడ షూటింగ్‌కు ఉత్సాహం చూపించారు. ఇప్పటికీ ఎంతో మంది ఫోన్‌ ద్వారా ‘ఉప్పాడలో అంత మంచి లొకేషన్లున్నాయా? మేమూ సినిమా తీస్తాం’ అని చెబుతున్నారు. షూటింగ్‌కు ఇక్కడి ప్రజల సహకారం ఎంతో బాగుంటుంది. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాల షూటింగ్‌లు ఉప్పాడ తీరంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
– సానా బుచ్చిబాబు, ఉప్పెన సినిమా దర్శకుడు

‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌కు వచ్చిన బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ 

ఇక్కడ సెట్టింగ్‌లతో పని లేదు
కాకినాడ – ఉప్పాడ తీర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు చేస్తే సెట్టింగ్‌లతో పని ఉండదు. అంతా ప్రకృతి అందాలతో ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిని చిత్రీకరించాలంటే ఇక్కడి కంటే మంచి లొకేషన్లుండవు. సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో మంచి లొకేషన్లలో సినిమాలు తీసుకోవడానికి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది. అందుకే ఇక్కడ ‘కనకం 916 కెడిఎం’ సినిమా తీశాం. షూటింగ్‌కు స్థానిక ప్రజలు చాలా సహకరించారు. 
– రాకేష్‌ కనకం, సినిమా డైరెక్టర్‌
 
కనకం 916 కేడీఎం సినిమా షూటింగ్‌లో హీరోకు దర్శకుడు రాకేష్‌ సూచనలు 

మరిన్ని వార్తలు