మా ఊళ్లో నన్ను సుకుమార్‌ అని పిలుస్తారు!

11 Feb, 2021 03:06 IST|Sakshi

‘‘నేను ఎప్పుడూ మా ఇంటి గడప నుంచే కథ వెతుకుతాను. మా ఇంటి లోపల ఏదైనా కథ ఉందా? మా వీధి, మా ఊరు, మా స్నేహితులు.. ఇలా ముందు నా దగ్గర కథే వెతుక్కుంటాను. కల్మషం లేని భావోద్వేగాలతో కూడిన కథే మట్టి కథ. ‘ఉప్పెన’ అలాంటి సినిమాయే’’ అన్నారు బుచ్చిబాబు. వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉప్పెన’. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన విశేషాలు..


► నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు సుకుమార్‌గారు నా లెక్కల మాస్టర్‌. సినిమాల్లోకి వెళ్లబోతున్నానని చాలా తక్కువమంది స్టూడెంట్స్‌తో ఆయన చెప్పుకునేవారు. వారిలో నేను ఒకడిని. సుకుమార్‌గారు ఇండస్ట్రీకి వచ్చి ‘ఆర్య’ సినిమా తీశారు. డైరెక్ట్‌గా సినిమా అంటే మా ఇంట్లో పంపించరని, నేను ఎమ్‌బీఏ చదువుకుంటూ సుకుమార్‌గారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పలు సినిమాలు చేశాను.

► కొన్ని తమిళ సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కథలను మన కంటెంట్‌తో కూడా చెప్పవచ్చు కదా అనిపిస్తుంటుంది. లక్కీగా ‘ఉప్పెన’ సినిమా అలాంటిదే. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో అల్లుకున్న ఫ్యామిలీ డ్రామా ‘ఉప్పెన’ సినిమా. కూతురిది ఉప్పెనంత ప్రేమ. తండ్రిది ఉప్పెనంత కోపం. ప్రేమకు హద్దులు లేవని చెప్పడమే ఈ సినిమా కథ.

► చిరంజీవిగారికి ఈ కథ చెప్పినప్పుడు ‘హిట్‌ ఫార్ములా. నువ్వు తీయడాన్ని బట్టి ఉంటుంది. వైషూ  (వైష్ణవ్‌తేజ్‌) నువ్వు చేస్తావా? లేక నన్ను చేయమంటావా?’ అని వైష్ణవ్‌ తేజ్‌తో అన్నారు. అంటే.. ఆయన సినిమా చేస్తారని కాదు. అదొక కాంప్లిమెంట్‌. సినిమా కథ బాగుందని చెప్పడం చిరంజీవిగారి అభిప్రాయం.

► క్యాస్ట్‌ గురించిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కానీ పరిధి మేరకు ఉన్నాయి. సెన్సార్‌ వారు ఒక్క కట్‌ కూడా చెప్పలేదు. దాదాపు 70మందికి పైగా ఈ సినిమా చూశారు. సినిమా బాగోలేదని ఎవరూ చెప్పలేదు. ‘ఇప్పుడు నా కొడుకు చిన్నవాడు. భవిష్యత్‌లో డైరెక్టర్‌ అవుతాడో లేదో తెలీదు. నా పెద్దకొడుకు (బుచ్చిని ఉద్దేశించి) సినిమా తీశాడనుకుంటాను’ అని సుకుమార్‌ అన్నారు. సుకుమార్‌గారితో నాది 20 ఏళ్ల పరిచయం. మా ఊళ్లో నన్ను సుకుమార్‌ అని పిలుస్తుంటారు. ఒక డైరెక్టర్‌గా కన్నా కూడా సుకుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నాకు పేరువస్తే హ్యాపీ ఫీల్‌ అవుతాను.

► ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా షూటింగ్‌ స్పెయి¯Œ లో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్‌కు కథ చెప్పాను. అది ‘ఉప్పెన’ కథ కాదు. మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థలో మరో సినిమా చేయబోతున్నాను.

మరిన్ని వార్తలు