Shaylee Krishnen Biography: అందుకే.. జీవితంలో ఏం జరిగినా పెద్దగా చలించను: నటి

22 May, 2022 12:42 IST|Sakshi

ఈమె పేరు.. శైలీ క్రిష్ణ్‌. 2011లో సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఉరుమి’ అనే సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. కానీ పెద్ద గుర్తింపేమీ రాలేదు. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ ‘ది లాస్ట్‌ అవర్‌’ తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. రూపంలో శైలీ.. 1985లో నేషనల్‌ జాగ్రఫిక్‌ మ్యాగజైన్‌ కవర్‌ మీద అచ్చయిన అఫ్గానిస్తాన్‌ రెఫ్యూజీ అమ్మాయి ‘షర్‌బత్‌ గులా’ను పోలి ఉంది అని సినీ, వెబ్‌ సిరీస్‌ విమర్శకులు కితాబూ ఇచ్చారు. 

 ► శైలీ  తల్లిదండ్రుల స్వస్థలం అనంత్‌నాగ్‌. అక్కడి నుంచి జమ్మూకశ్మీర్‌ రెఫ్యూజీ క్యాంప్‌కి తరలి రావాల్సి వచ్చింది. ఆ రెఫ్యూజీ క్యాంప్‌లోనే శైలీ పుట్టింది. ఆమెకు ఎనిమిదేళ్లు వచ్చే వరకూ రెఫ్యూజీ క్యాంపుల్లోనే పెరిగింది. తర్వాత శైలీ తండ్రికి బ్యాంక్‌లో ఉద్యోగం రావడంతో క్యాంపుల నుంచి ఓ ఇంటికి మకాం మార్చారు. అలా అద్దం ముందు నుంచి వెండి తెర మీదకు వచ్చేసింది మలయాళం సినిమా ‘ఉరుమి’తో.

► శైలీ మోడలింగ్‌ చేస్తున్న సమయంలో రవి వర్మన్‌ అనే సినిమాటోగ్రాఫర్‌కు ఆమె నచ్చి.. ఫొటో షూట్‌ చేశాడు. ఆ ఫొటోలను దర్శకుడు సంతోష్‌ శివన్‌కు చూపించాడు. అప్పుడు  సంతోష్‌ శివన్‌ తాను తీస్తున్న ‘ఉరుమి’లో స్క్రీన్‌ టెస్ట్‌గా శైలీకి చిన్న భూమికనిచ్చాడు.

► శైలీకి చిన్నప్పటి నుంచీ సినిమాలు అంటే ఇష్టం. రెఫ్యూజీ క్యాంపుల్లో ఉన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలు వింటూ .. దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే సినిమాలు చూస్తూ నటన మీద ఆసక్తి పెంచుకుంది. ఆ ప్రభావంతో అద్దం ముందు నిలబడి తనే పాటలు పాడుకుంటూ.. డైలాగులు చెప్పుకుంటూ తనకు తోచినట్టు అభినయించేదట. 

 ఆ తర్వాత సంతోష్‌ శివనే తీసిన ‘మోహ’లోనూ నటించింది. 2021లో బెర్ముడా, జాక్‌ అండ్‌ జిల్‌ అనే మరో రెండు మలయాళ సినిమాల్లోనూ హీరోయిన్‌గా చేసింది. 

 తాజాగా ‘ది లాస్ట్‌ అవర్‌’తో వెబ్‌ దునియాలోకీ అడుగుపెట్టింది. ఆ సిరీస్‌లో శైలీది ప్రధాన భూమిక. అందులో ఆమె అందానికీ, అభినయానికీ ముగ్ధులవుతున్నారు వెబ్‌ వీక్షకులు.

► రెఫ్యూజీ క్యాంపుల్లో జీవితాలు ఎలా ఉంటాయో నాకు అనుభవం. అందుకే జీవితంలో ఏం జరిగినా పెద్దగా చలించను. జయాపజయాలను మనసు మీదకు తీసుకోను. 
– శైలీ క్రిష్ణ్‌ 

మరిన్ని వార్తలు