సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం

31 Oct, 2022 05:38 IST|Sakshi
తమ్మారెడ్డి, అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, అల్లు అరవింద్, బాలకృష్ణ, రాకేష్‌ శశి, అచ్చు రాజమణి, ధీరజ్‌

– బాలకృష్ణ

‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాకేష్‌ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్‌ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు  అల్లు అరవింద్‌.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్‌ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్‌ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్‌ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్‌ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘శిరీష్‌ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్‌టైనర్‌ అండ్‌ ఓ ఇన్‌డెప్త్‌ డిస్కషన్‌ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్‌ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్‌లో మా జోష్‌ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్‌ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్‌. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్‌ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్‌ శశి.

ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్‌ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్‌ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్, ‘గీతాఆర్ట్స్‌’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్‌ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు