హెచ్‌1బీ వీసా సమస్యలు పరిష్కరిస్తాం

14 Mar, 2021 03:17 IST|Sakshi

బైడెన్‌ ప్రభుత్వం హామీ

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయ టెక్కీలు అత్యధికంగా వినియోగించే హెచ్‌–1బీ తదితర వీసాలపై గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో తీసుకువచ్చిన  త్రీ పాలసీ మెమొస్‌ విధానం కారణంగా ఏర్పడిన ప్రతికూలతను పరిష్కరిస్తామని జో బైడెన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసినప్పటికీ దాని వల్ల ఏర్పడిన వ్యతిరేక ప్రభావాల్ని సవరించే అంశాలను పునఃపరిశీలిస్తామని అమెరికా సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌  శుక్రవారం ప్రకటించింది. జో బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయంతో భారత్‌ సహా విదేశీ టెక్కీలకు భారీగా ఊరట లభించనుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో విధిం చిన ఆంక్షలతో  భారతీయ వృత్తి నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా చెల్లుబాటు కాలం, యాజమాన్యానికి, ఉద్యోగులకి మధ్య ఉన్న సంబంధాలు,  విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఆంక్షలు విధించింది.

విదేశీయులకు కనీస వేతనం అమలు వాయిదా
హెచ్‌1–బీ వీసా వినియోగదారులకు కూడా అమెరికన్లతో సమానంగా అధిక వేతనాన్ని చెల్లించాలంటూ ట్రంప్‌ హయాంలో తీసుకున్న నిర్ణయం అమలును బైడెన్‌ సర్కార్‌ మే 14వరకు వాయిదా వేసింది. తక్కువ వేతనానికి భారతీయులు సహా ఇతర విదేశీయుల్ని పనిలోకి తీసుకోవడం వల్ల అమెరికన్లకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. అయితే బైడెన్‌ నిర్ణయం అమలును వాయిదా వేయడంతో భారతీయ టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు