వాలెంటైన్‌ డే స్పెషల్‌..టాలీవుడ్ వెండితెర ప్రేమ కథలు చూశారా? 

14 Feb, 2024 00:43 IST|Sakshi

ప్రతి మనిషికి ప్రాణం ఉన్నట్లే .... ప్రతి మనసుకు ఓ ప్రేమకథ ఉంటుంది. ఒకరి ప్రేమ సఫలం... మరొకరిది విఫలం... ఇంకొకరిది త్యాగం... ఇలా ఒక్కో ప్రేమకథది ఒక్కో ముగింపు. మరి.. రానున్న ప్రేమకథా చిత్రాల్లో ఏ కథ ముగింపు ఎలా ఉంటుందో వెండితెర పైనే చూడాలి. ‘పడ్డారండి ప్రేమలో మరి..’ అంటూ సిల్వర్‌ స్క్రీన్‌ కోసం కొందరు హీరోలు–హీరోయిన్లు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. 

సైనికుడి ప్రేమకథ... ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘సలార్‌’... ఇలా యాక్షన్‌ చిత్రాలే కాదు.. ప్రభాస్‌ కెరీర్‌లో ‘వర్షం’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’, ‘రాధేశ్యామ్‌’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభాస్‌ మరో ప్రేమకథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. 2022లో ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్‌ ప్రేమకథను ఇచ్చిన హను రాఘవపూడి మరో ప్రేమకథను రెడీ చేశారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తారని టాక్‌. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ప్రభాస్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తారనీ టాక్‌. అలాగే ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘రాజా సాబ్‌’ ఒకటి. ఫ్యాంటసీ హారర్‌ ఎలిమెంట్స్‌తో పాటు ఓ మంచి లవ్‌ట్రాక్‌ కూడా ఈ చిత్రంలో ఉందట. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లు. 


మరో లవ్‌స్టోరీ... ‘లవ్‌స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మరో ప్రేమకథా చిత్రం ‘తండేల్‌’. నాగచైతన్యతో ‘ప్రేమమ్‌’ వంటి లవబుల్‌ సినిమా తీసిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరంలకు చెందిన మత్స్యకారులు 2018లో గుజరాత్‌కు వలస వెళ్లి, సముద్రంలో చేపల వేటను కొనసాగిస్తుంటారు. ఓ 24 మంది మత్స్యకారులు పాకిస్తాన్‌ కోస్ట్‌ గార్డులకు బందీలుగా చిక్కుతారు. వీరిలో ఓ మత్స్యకారుడి  వివాహం జరిగి ఏడాది మాత్రమే అవుతుంది. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆ మత్స్యకారుడు పాకిస్తాన్‌లో బందీ కాబడతాడు. ఈ వ్యక్తి జీవితం ఆధారంగా ‘తండేల్‌’ను ప్రేమకథప్రాధాన్యంగా తీస్తున్నారు మేకర్స్‌. 


 ప్రేమికులే శత్రువులయితే... విడిపోయిన ప్రేమికులు శత్రువులుగా ఎదురుపడితే అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న లవ్‌స్టోరీ మూవీ ‘డెకాయిట్‌’. ‘ఒక ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. అడివి శేష్, శ్రుతీహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో కెమెరామేన్‌ షానీ డియోల్‌ దర్శకుడిగా మారారు. 


రెండు ప్రేమకథల్లో... గత ఏడాది ‘బేబీ’ అనే లవ్‌స్టోరీ మూవీతో హిట్‌ అందుకున్నారు హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవీ చైతన్య (విరాజ్‌ మరో లీడ్‌ రోల్‌ చేశారు). ఈ ‘బేబీ’ జోడీ రిపీట్‌ అవుతోంది. ‘బేబీ’ దర్శకుడు  సాయి రాజేశ్‌ ఈ సినిమాకు కథ అందించగా, రవి నంబూరి దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే మరో లవ్‌స్టోరీ ‘డ్యూయెట్‌’ కూడా చేస్తున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఈ ఎమోషనల్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో రితికా సింగ్‌ కథానాయిక. మిథున్‌ వరదరాజ కృష్ణన్‌ దర్శకత్వం వహిసున్నారు. ఇలా ఒకేసారి రెండు ప్రేమకథా చిత్రాల్లో నటిస్తున్నారు ఆనంద్‌ దేవరకొండ. 

డబుల్‌ లవ్‌... డీజే టిల్లు ఓ డిఫరెంట్‌ లవర్‌. పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో తేడా వస్తే ప్రేయసినైనా జైలుకు పంపిస్తాడు. అలాంటి డీజే టిల్లు మళ్లీ లవ్‌లో మునిగాడు. మరి.. ఈసారి అతని లవ్‌స్టోరీ ఏ టర్న్‌ తీసుకుంటుందో చూడాలంటే మార్చి 29వరకు ఆగాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు ‘తెలుసు కదా’ అనే లవ్‌స్టోరీ కూడా చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. 


లైలా లవ్వు... ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి.. దేవుడా!’, ‘పాగల్‌’ వంటి లవ్‌స్టోరీ చిత్రాల్లో నటించారు విశ్వక్‌ సేన్‌. ఈ యంగ్‌ హీరో రీసెంట్‌గా మరో లవ్‌స్టోరీకి  పచ్చజెండా ఊపారు. ఆ సినిమా పేరు ‘లైల’. ఈ సినిమాలో తానే టైటిల్‌ రోల్‌ చేస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తానని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు విశ్వక్‌.  

 
దిల్‌ రుబా... కెరీర్‌లో తొలి సినిమానే ‘రాజావారు రాణిగారు’ వంటి లవ్‌స్టోరీ చేశారు కిరణ్‌ అబ్బవరం. ఆ తర్వాత కిరణ్‌ అబ్బవరం హీరోగా చేసిన ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాల్లో మంచి లవ్‌ట్రాక్‌ ఉంది. ఇప్పుడు ఈ యంగ్‌ హీరో ఓ కంప్లీట్‌ లవ్‌స్టోరీ సినిమా చేస్తున్నారు. విశ్వ కరుణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌ అని తెలిసింది. ఈ సినిమాకు ‘దిల్‌ రుబా’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

సాధారణంగా లవ్‌స్టోరీస్‌ ఎక్కువగా అబ్బాయిల దృష్టి కోణంలో నుంచి వస్తుంటాయి. ఓ అమ్మాయి తన ప్రేమకథను చెబితే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగా వస్తున్న చిత్రం ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’. ‘చి.ల.సౌ’ వంటి సినిమా తీసిన నటుడు– దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ కొత్త లవ్‌స్టోరీకి దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.


∙అభిషేక్‌ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్‌ ఫణి, సతీష్‌ సారిపల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జస్ట్‌ ఏ మినిట్‌’. పూర్ణస్‌ యశ్వంత్‌ దర్శకత్వంలో అర్షద్‌ తన్వీర్, ప్రకాశ్‌ ధర్మపురి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి తాజాగా ‘నువ్వంటే ఇష్టం’ అనే పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. యస్‌. కె భాజీ ఈ సినిమాకు స్వరకర్త.

ఇంద్ర , కోమల్‌ నాయర్, దీపు, స్వాతి శర్మ, ఇమ్రాన్, షీతల్‌ భట్‌ లీడ్‌ రోల్స్‌ చేసిన చిత్రం ‘ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడు’.  ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘నా కల..’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ విడుదల చేశారు. లక్ష్మణ్‌ జెల్ల దర్శకత్వంలో చంద్ర ఎస్‌. చంద్ర, డా. విజయ రమేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. శ్రవణ్‌ భరద్వాజ్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

ఈ ప్రేమికల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా ఇప్పటికే విడుదలైన కొన్ని ప్రేమకథా చిత్రాలు మళ్లీ రిలీజ్‌  కానున్నాయి. ఆ వివరాలు... 
►సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా ఆనంద్‌ రంగ దర్శకత్వం వహించిన  ‘ఓయ్‌!’ (2009), దుల్కర్‌ సల్మాన్‌– మృణాళ్‌ ఠాకూర్‌ జోడీగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ (2022), గత ఏడాది విడుదలైన ‘బేబీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సూర్య ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (2008) తెలుగు అనువాదం సైతం రీ రిలీజ్‌ అవుతోంది. ఇలా మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.  

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega