వాణీ జయరామ్‌కి వాణీ అని ఎందుకు పెట్టారంటే?

5 Feb, 2023 08:05 IST|Sakshi

దాదాపు ఐదు దశాబ్దాలుగా తన గొంతుతో సంగీత ప్రియుల్ని అలరించిన వాణీ జయరామ్‌(78) మరణంతో చిత్ర సీమలో విషాదం నెలకొంది. వాణీ జయరామ్‌ అసలు పేరు ‘కలైవాణి’. పదకొండు మంది పిల్లల్లో ఎనిమిదో సంతానం అయిన వాణి నామకరణ వేడుక చేయడానికి ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలొచ్చాయట. దీంతో వాణి పదిరోజుల పాపగా ఉన్నప్పుడు ఓ సిద్ధాంతి దగ్గరకు వెళ్లి మా పాపకు ఏదైనా పేరు సూచించమని అడిగితే ‘పాపకు పూర్వజన్మ పుణ్యఫలం ఉంది. దేవుణ్ణి తేనెతో అభిషేకాలు చేసింది. అందుకే ‘కలైవాణి’ అని పేరు పెట్టండి’ అని ఆ సిద్ధాంతి చెప్పారట. ఆ సమయంలో సిద్ధాంతి మాటలకు దురైస్వామి హాయిగా నవ్వుకున్నప్పటికీ, పాప భవిష్యత్తు గురించి ఇప్పుడే కలలు కనడం ఎందుకని అనుకున్నారట. కానీ పేరు మాత్రం కలైవాణి అని పెట్టారు. సిద్ధాంతి చెప్పినది నిజం అయింది. సినీ గాయనిగా, భక్తి గీతాల గాయనిగా వాణి  ఎంతటి విశేష ప్రతిభ కనబరిచారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక తన తల్లి పద్మావతి తెలుగువారు కాబట్టి తెలుగులోనూ  మంచి పాటలు పాడటం పట్ల వాణి పలు సందర్భాల్లో ఆనందం వ్యక్తం చేశారు.

ఇంట్లో ఒప్పించి సినీ గాయనిగా...
వాణీ జయరామ్‌ సంగీత ప్రియుల కుటుంబంలోనే జన్మించినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు సినిమా సంగీతం పట్ల మంచి అభిప్రాయం ఉండేది కాదు. సినిమాలు, సినిమా పాటలు వారి ఇంట్లో నిషేధం. సంగీతం అంటే వారి దృష్టిలో శాస్త్రీయ సంగీతమే. అయితే వాణీకి సినిమాల్లో నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకోవాలని కల. కానీ ఆమె తల్లి పద్మావతి ఇష్టపడలేదు. ఇంట్లో ఒప్పించి, స్వయంకృషితో తన కలను నెరవేర్చుకున్నారు వాణి. కూతురి కీర్తి చూసి, తల్లి సంతోషించారు. అయితే వాణి విజయాలను ఆమె తండ్రి దురైస్వామి చూడలేకపోయారు. 1969లోనే ఆయన మరణించారు. తన సక్సెస్‌ను తండ్రి చూడలేకపోవడం కాస్త బాధ కలిగించిందని వాణి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు