అక్కడ ఇందిరాగాంధీ, ఇక్కడ వాణిశ్రీ

26 Mar, 2021 09:23 IST|Sakshi

గోల్డెన్‌ మెమొరీస్‌ - కథానాయకురాలు 50

మగాళ్ళదే పెత్తనమైన రోజుల్లో... అదీ హీరోలదే రాజ్యమైన సినిమా రంగంలో... హీరోయిన్‌ ప్రాధాన్యంతో సినిమా వస్తే? అదీ ఓ అప్‌కమింగ్‌ తారతో? పైపెచ్చు, హీరోయిన్‌ ఓరియంటెడ్‌ టైటిల్‌తో..అదీ ఏ క్రైమ్‌ సినిమానో కాకుండా సాంఘికమైతే? ఇప్పుడంటే ఓకే కానీ, బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలంలో... యాభై ఏళ్ళ క్రితం ఇలాంటివి ఆర్థికంగానూ, ఆదరణ రీత్యా కష్టమే. 

కానీ, వాణిశ్రీ నాయికగా, శోభన్‌బాబుతో దర్శక–నిర్మాత గిడుతూరి సూర్యం చేసిన ప్రయత్నం 1971 మార్చి 25న రిలీజైన ‘కథానాయకురాలు’. ‘తనువా హరిచందనమే...’ లాంటి పాపులర్‌ పాటలు, విలక్షణమైన విలనీ డైలాగులతో ఆ సినిమా ఇప్పటికీ చాలామందికి గుర్తే. అభ్యుదయ భావాలతో, సామ్యవాదాన్ని ప్రబోధించే భావాలతో సాటి అభ్యుదయ కవులు, రచయితలైన శ్రీశ్రీ, సుంకర సత్యనారాయణ, ఏల్చూరి, రెంటాల గోపాలకృష్ణ తదితరుల సృజనాత్మక భాగస్వామ్యంతో గిడుతూరి చేసిన ఆ ప్రయోగానికి ఇప్పుడు 50 వసంతాలు.

లేచింది... నిద్రలేచింది మహిళాలోకం!
అది 1971. అప్పుడప్పుడే సమాజంలో మార్పు వస్తోంది. వివిధ రంగాలలో స్త్రీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరా గాంధీ సారథ్యంలో సరికొత్త కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. 1966 జనవరిలోనే తొలిసారి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ, తాజాగా మధ్యంతర ఎన్నికలతో దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు. అప్పటికే ఆమె రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతో నెహ్రూ మార్కు సోషలిజానికి తన దూకుడును జోడించారు. ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మహిళ నాయకురాలై, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న వేళ అది. 

సమాజంలోని మార్పులకు తగ్గట్టుగా సినిమాల్లో కథలు, స్త్రీ పాత్రలు మారాల్సిన సమయం వచ్చింది. స్త్రీలను చేతకానివాళ్ళుగా, వంటింటి కుందేళ్ళుగా చూపిస్తే ఇష్టపడరనే ఆలోచన మొదలైంది. సినీ విశ్లేషకుడు, సినీ పంపిణీ రంగ నిపుణుడు స్వర్గీయ కాట్రగడ్డ నరసయ్య మాటల్లో చెప్పాలంటే, ‘‘సమాజ అభివృద్ధిలో, సంఘంలోని కుళ్ళును కడిగేయడంలో ముఖ్యపాత్ర వహించేవారిగా స్త్రీలను చూపించాల్సిన అవసరం వచ్చింది. తెరపై వీరోచిత చర్యలను కథానాయకులు చేసినట్లే స్త్రీలే ప్రాముఖ్యం వహించే పాత్రలు అవసర’’మయ్యాయి. సరిగ్గా ఆ పరిస్థితుల్లో వచ్చినవే – భానుమతి నటించిన ‘మట్టిలో మాణిక్యం’. ఆ వెనువెంటనే వాణిశ్రీ ‘కథానాయకురాలు’.

సూపర్‌హిట్‌ శోభన్‌బాబు– వాణిశ్రీ
ఇందిరా గాంధీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సరిగ్గా వారం రోజులకు వచ్చిన చిత్రం ‘కథానాయకురాలు’. సామ్యవాదాన్ని ప్రబోధిస్తూ, లేడీ ఓరియంటెడ్‌ టైటిల్‌తో అలా ఓ సినిమా రావడం అప్పట్లో విశేషం. గిడుతూరి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూర్చి, నల్ల వెంకట్రావుతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా హీరోను విప్లవ నాయకుడిగా చూపించడం బాక్సాఫీస్‌ ఫార్ములా. కానీ, కార్మిక సంఘ నాయకురాలిగా హీరోయిన్‌ను చూపించడం, ఆమె ఓ ధనిక యజమానితో కార్మిక ప్రయోజనాల కోసం పోరాడడం వెరైటీ.

‘మనుషులు మారాలి’ (1969) లాంటి హిట్స్‌తో పేరు తెచ్చుకొని, హీరోగా స్థిరపడుతున్న రోజుల్లో శోభన్‌బాబు కథానుగుణమైన ఆ టైటిల్‌కి ఒప్పుకోవడం విశేషం. శోభన్‌–వాణిశ్రీ జంట తర్వాతి కాలంలో ‘చెల్లెలి కాపురం’, ‘జీవన తరంగాలు’, ‘ఖైదీ బాబాయ్‌’, ‘జీవనజ్యోతి’తో హిట్‌ పెయిర్‌గా నిలవడం గమనార్హం. ‘కథానాయకురాలు’ లాంటి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథలో చేసిన శోభన్‌ ఆనక హీరోయిన్ల హీరోగా, హీరోలు సైతం అసూయపడే అందాల నటుడిగా ఇమేజ్‌ సాధించడం ఓ చరిత్ర.

తారాపథానికి... ‘కథానాయకురాలు’ వాణిశ్రీ
అనాథైన ఒక పేదపిల్ల చదువు – సంస్కారం అలవరచుకొని, నాయకురాలై, కార్మిక ఉద్యమాన్ని ఎలా జయప్రదంగా నడిపిందీ, సంఘవిద్రోహుల్ని ఎలా ఎదిరించిందీ కార్మిక విప్లవ ప్రబోధ చిత్రం ‘కథానాయకురాలు’ చూపెడుతుంది. కార్మికుల హక్కుల కోసం ప్రాణాలకు తెగించే హీరోయిన్, ధనికుల బిడ్డ అయినా తానెవరో చెప్పకుండా హీరోయిన్‌ పోరాటానికి అండగా నిలిచే హీరో, కార్మికలోకాన్ని అణచివేయాలనుకొనే మిల్లు నిర్వాహకుడు – ఈ 3 ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ మూడు పాత్రల్లో వాణిశ్రీ, శోభన్‌బాబు, నాగభూషణం ఆకట్టుకుంటారు. ఇంకా అల్లు రామలింగయ్య, కాకరాల, ఛాయాదేవి, రామ్మోహన్, రావుగోపాలరావు, కామెడీకి రాజబాబు– ఇలా పేరున్న తారాగణమే ఉంది. ‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న పాత్రలో నటించారు. 

అప్పటికే వాణిశ్రీ తారాపథానికి పరుగులు తీస్తున్నారు. ఎన్టీఆర్‌ ‘కోడలు దిద్దిన కాపురం’, అక్కినేని ‘దసరా బుల్లోడు’ హిట్స్‌ తరువాత ‘కథానాయకురాలు’ వస్తే, ఆ వెంటనే కృష్ణ ‘అత్తలూ – కోడళ్ళు’, ఆ ఏడాదే శోభన్‌తోనే ‘చెల్లెలి కాపురం’ – ఇలా హీరోలందరి పక్కనా వాణిశ్రీ మెరిశారు. అయితే, ఒక రకంగా ఈ సినిమా వాణిశ్రీ బహుముఖ నటనను తెరపై చూపే రకరకాల గెటప్పులకు అవకాశమిచ్చింది. కార్మికనేతగా, ప్రేయసిగా, హిరణ్యకశిపుడిగా, తమిళ యువతిగా – విభిన్న వేషాలలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు. 

ఎన్టీఆర్‌ ‘సంగీతలక్ష్మి’ తీసిన సూర్యమే...
దర్శకుడు గిడుతూరి సూర్యం పేరు చెప్పగానే ఎన్టీఆర్‌ – జమునల ‘సంగీతలక్ష్మి’, యస్వీఆర్‌ – రామకృష్ణల ‘విక్రమార్క విజయం’, కాంతారావు ‘రణభేరి’, విజయలలిత ‘పంచకల్యాణి– దొంగల రాణి’, మంజుభార్గవి ‘అమృతకలశం’ లాంటి వేర్వేరు కోవల సినిమాలు సినీ ప్రియులకు గుర్తుకొస్తాయి. ప్రసిద్ధ సినీ దర్శకులు కృష్ణన్‌ – పంజు, భీమ్‌సింగ్‌లకు ఆయన శిష్యుడు. లేఖా జర్నలిస్టుగా, రచయితగా జీవితం ప్రారంభించి సినిమాల్లో ఎదిగిన ఆయన ఆ తరం అభ్యుదయ కవి, రచయిత. విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, నాట్యాచార్యులు పసుమర్తి కృష్ణమూర్తి – డి. వేణుగోపాల్‌ల వద్ద కథారచన, చిత్రలేఖనం, కవిత్వం, నాటక రచన, నృత్యం – ఇలా అనేక కళలను నేర్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.

కళారాధనలో... కమ్యూనిస్టులు
అభ్యుదయ కవులు బెల్లంకొండ రామదాసు, అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరిసుబ్రహ్మణ్యం,రెంటాల గోపాల కృష్ణ తదితరులు గిడుతూరికి మిత్రులు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ చదివి, ‘ప్రజానాట్యమండలి’లో, ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌’లో గిడుతూరి నాటక రచన, దర్శకత్వం చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. బలిజేపల్లి వద్ద నాటక, సినీ రచన నేర్చిన ఆయన రష్యా వెళ్ళి, అక్కడి మాస్కో మాస్‌ ఫిలిమ్‌ స్టూడియోలో శిక్షణ పొంది వచ్చాక, ఎన్టీఆర్‌ ‘సంగీత లక్ష్మి’ (1966)తో మొదలుపెట్టి పలు చిత్రాలను రూపొందించారు. ‘సంగీత లక్ష్మి’ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి, ‘సంగీత లక్ష్మి’, ‘కథానాయకురాలు’ రెండూ గిడుతూరి నవలల ఆధారంగా వచ్చిన సినిమాలే. భార్య సరస్వతీదేవి పేరిట ‘శ్రీ సరస్వతీ చిత్ర’ పతాకం నెలకొల్పి, ఆయన సినిమాలు తీశారు. ఏంచేసినా అభ్యుదయ భావాల్ని వదిలిపెట్టలేదు. సినిమాలతో సహా తన ప్రతి సృజనలోనూ వాటిని వీలైనంతగా జొప్పించేవారు. ‘కథానాయకురాలు’ కూడా ఆ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే.

ఆ గీతాలన్నీ అభ్యుదయ రచయితలవే!
అభ్యుదయ కవులు శ్రీశ్రీ,ఆరుద్ర,ఏల్చూరితో ‘కథానాయకురాలు’కి పాటలు రాయించారు గిడుతూరి. ‘‘సోషలిస్టు విధానాల కోసం మన ఇందిరాగాంధీ బడా నాయకుల్ని ఎదిరించి, ఘనవిజయం సాధించింది! కార్మిక సంక్షేమం కోసం మన కథానాయకురాలు దుష్టశక్తుల నెదిరించి, అపూర్వ విజయం సాధించింది!’’ అని ఈ సినిమా గురించి ఆ రోజుల్లో ప్రముఖంగా ప్రకటించారు. ‘అభినవ ప్రహ్లాద చరితం’ అంటూ దరిద్ర నారాయణుడే దేవుడిగా శ్రీశ్రీ రాసిన నాటకం హైలైట్‌. అలాగే, ‘మాభూమి’ నాటకకర్త సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ మరో హైలైట్‌. తర్వాతి కాలంలో ‘ఆంధ్రభూమి’ వీక్లీ ఎడిటర్‌గా పాపులరైన సికరాజు కూడా సినిమాలో జ్యోతిలక్ష్మిపై వచ్చే ‘చూడు షరాబీ...’ అనే శృంగార గీతం రాశారు.

సెక్సప్పీల్‌ వల్లే సక్సెస్‌లా?
‘‘ధనస్వామ్యమా, జనస్వామ్యమా? ఈనాడు దేశానికేది కావాలి?’’ అని కథానాయకురాలు ద్వారా దర్శక – నిర్మాత ప్రశ్న సంధించారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ అందమైన లోగో, డిజైన్లతో ఉగాది కానుకగా, 1971 మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి, ఆ ఫిబ్రవరిలోనే గిడుతూరి దర్శకత్వంలోనే ‘విక్రమార్క విజయం’ వచ్చింది. సక్సెస్‌ అయింది. ఆ వెంటనే స్వీయ నిర్మాణమైన ఈ సాంఘికంతో పలకరించారు గిడుతూరి. దేశంలో సెక్స్, క్రైమ్‌ చిత్రాలకే తప్ప, చక్కనికథతో సినిమా తీస్తే, దానికి డబ్బు రావడం లేదని అప్పటికే ఆయన ఆవేదన చెందుతూ ఉండేవారు. అందుకు తగ్గట్టే ‘కథానాయకురాలు’ పేరు తెచ్చినంత, డబ్బు తేలేదు. కాకపోతే, బి, సి సెంటర్లలో రిపీట్‌ రన్లతో ఎంతో కొంత లాభమే తెచ్చింది.

అప్పటికే ఆడుతున్న ‘దసరా బుల్లోడు’, ‘రాజకోట రహస్యం’ లాంటి వాణిజ్య సినిమాల మధ్య కార్మిక విప్లవం లాంటి ప్రబోధాలిచ్చిన ‘కథానాయకురాలు’ నలిగిపోయింది. అయితే ‘తనువా...’ లాంటి పాటలతో, మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని చాటిన చిత్రంగా ‘కథానాయకురాలు’ ఇప్పటికీ ప్రత్యేకమే!

ఆల్‌ టైమ్‌ క్లాసిక్‌ హిట్‌ సాంగ్‌!
అన్ని రకాల పాటలున్న ‘కథానాయకురాలు’లో ‘తనువా హరిచందనమే...’ పాట మాత్రం ఇవాళ్టికీ హైలైట్‌. హీరో శోభన్‌ బాబు, హీరోయిన్‌ వాణిశ్రీల కెరీర్‌లో పాపులర్‌ క్లాసికల్‌ హిట్‌ సాంగ్‌ ఇది. ఈ సినిమా రిలీజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందరే 1971 మార్చి 21న ఆలిండియా రేడియో హైదరాబాద్, విజయవాడల్లో వివిధ భారతి – వాణిజ్య ప్రసారాలను ప్రారంభించారు. రేడియోలో తరచూ సినీగీతాలు వినే సావకాశం తెలుగునాట దక్కింది. ఆ వెంటనే ఆ నెలాఖరునే వాణిశ్రీయే హీరోయిన్‌ గా నటించిన ఎన్టీఆర్‌ ‘జీవితచక్రం’తో తెలుగు సినిమాలకు రేడియో పబ్లిసిటీ కూడా తొలిసారిగా మొదలైంది.

మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా ‘తనువా హరిచందనమే’ పాట ఎస్పీబీ, పి. సుశీల గళాల్లో రేడియోలో తరచూ వినిపిస్తూనే ఉంది. టీవీలో, యూ ట్యూబుల్లో కనిపిస్తూనే ఉంది. ప్రసిద్ధ సినీ గాయని చిత్ర సైతం ఇటీవలే ఓ టీవీ షోలో ఈ పాట పాడడం దీనికున్న పాపులారిటీకి తాజా నిదర్శనం. సినీ రంగంలో ఎ.ఎ. రాజ్‌ గా ప్రసిద్ధుడైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆకుల అప్పలరాజుకు ఇది కెరీర్‌ బెస్ట్‌ సాంగ్‌. గమ్మత్తేమిటంటే, తక్కువ పాటలే రాసినా, ఈ ఒక్క పాట సినీ గీత రచయితగా గోన విజయరత్నాన్ని చిరంజీవిని చేసింది. 

డైలాగుల్లో... విప్లవతత్వం! విలనీ!!
గిడుతూరి సూర్యం తన ఆప్తమిత్రుల్లో ఒకరైన ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, నాటకకర్త రెంటాల గోపాలకృష్ణకు సినిమా సంభాషణల రచన బాధ్యత అప్పగించారు. అప్పటికే ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదక వర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న రెంటాల అనేక అనువాదాలు, రచనలు చేసిన సుప్రసిద్ధులు. సినీ రంగంతో అనుబంధం, సినీ విమర్శకుడిగా పేరూ ఉన్నవారు. రంగస్థలంపై పేరున్న రెంటాల అంతకు ముందు గిడుతూరి తీసిన జానపదం ‘పంచకల్యాణి – దొంగలరాణి’ (1969 ఆగస్టు 2)కి డైలాగ్స్‌ రాశారు. ప్రజానాట్యమండలిలో, బెజవాడ హనుమంతరాయ గ్రంథాలయం ఆంధ్ర ఆర్ట్‌ థియేటర్‌లో నటుడిగా, నాటకకర్తగా కృషిచేసిన రెంటాల సామ్యవాదాన్ని ప్రబోధించే సాంఘిక చిత్రం ‘కథానాయకురాలు’లోనూ తన కలం పదును మరోసారి చూపారు. 

యజమాని, కార్మికుల సంఘర్షణ ప్రధాన ఇతివృత్తమైన ఈ చిత్రానికి రెంటాల రాసిన సంభాషణలు ‘‘ఆయా సన్నివేశాలకు తగినట్టు భావస్ఫోరకంగా, విప్లవతత్వాన్ని వెదజల్లుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అప్పట్లో సినీ విమర్శకులు, సమీక్షకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రత్యేకించి, ‘‘సత్యారావు పాత్ర ధరించిన నటుడు నాగభూషణానికి రాసిన డైలాగ్స్‌ ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి’’ అని పేర్కొన్నారు. రంగస్థలంపై మిత్రులు ఆచార్య ఆత్రేయ ‘విశ్వశాంతి’, అనిసెట్టి ‘గాలి మేడలు’ సహా అనేక నాటకాల్లో రెంటాల నటించారు. ఈ సినిమాలోనూ ఫ్యాక్టరీలో జీతాల పంపిణీ వేళ కార్మికుడు గోపయ్యగా కీలక ఘట్టంలో వెండితెరపైనా కనిపించడం విశేషం. 

బొంబాయి స్ఫూర్తితో... బెజవాడ దుర్గాకళామందిరం! 
1920 జనవరి 17న ఏలూరులో సంపన్న చేనేత కుటుంబంలో జన్మించిన గిడుతూరి సూర్యంకి కళల పట్ల ఆసక్తి కలగడానికి ప్రేరణ ఒక రకంగా విజయవాడలోని ప్రసిద్ధ శ్రీదుర్గాకళామందిరం. బెజవాడలో నాటకశాలగా మొదలై 90 ఏళ్ళు దాటినా ఇప్పటికీ సినిమా హాలుగా నడుస్తున్న దుర్గాకళామందిరం నిర్మాణంలో గిడుతూరి తండ్రి బంగారు పాత్ర చాలా ఉంది. 1920లలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఆజ్ఞపై బొంబాయి వెళ్ళి, నాటకాలు ప్రదర్శించే థియేటర్లు సందర్శించి వచ్చారు బంగారు.

బొంబాయి థియేటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్నీ, స్టేజీ ఏర్పాట్లనూ అనుసరిస్తూ, 1929 జూన్‌ ప్రాంతంలో పంతులు గారికి విజయవాడలో దుర్గాకళామందిరం నిర్మాణం చేశారు. ప్రదర్శకుల కోసం రొటేటింగ్‌ డిస్క్, వైర్‌ వర్క్స్, పాతాళంలోకి వెళ్ళేటట్టు స్టేజీ పైన అక్కడక్కడా పలకలు కిందకు తెరుచుకొనే ఏర్పాట్లు, ఇంకా అనేక టెక్నికల్‌ సదుపాయాలను కళామందిరంలో గిడుతూరి తండ్రి కల్పించారు. అనేక ప్రఖ్యాత నాటక సంస్థలు ఆయన కూర్చిన టెక్నికల్‌ సదుపాయాలతో అప్పట్లో అక్కడ అద్భుత ప్రదర్శనలిచ్చేవి. పంతులు గారి ప్రోత్సాహంతో దుర్గాకళామందిరంలో నిత్యం నాటకాలు, మూకీలు చూస్తూ కళల వైపు మొగ్గారు గిడుతూరి. అదే ఆయన సినీరంగ ప్రస్థానానికి బాటలు వేసింది.
– రెంటాల జయదేవ

చదవండి: హీట్‌ పెంచుతున్న కృతి.. సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్

అవసరాల శ్రీనివాస్‌ బట్టతల వీడియో‌.. అసలు విషయం ఇదే!

మరిన్ని వార్తలు