చిరంజీవి ఫోన్‌ చేశారు: వరలక్ష్మీ శరత్‌కుమార్‌

15 Feb, 2021 15:08 IST|Sakshi

‘‘నన్ను నేను ఓ ఇమేజ్‌ చట్రానికి పరిమితం చేసుకోవాలనుకోలేదు. ఒకే తరహా పాత్రలు చేయకూడదని ఇండస్ట్రీలోకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నా.. అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే పరిపూర్ణమైన నటి అనిపించుకోగలం. నా దృష్టిలో నటన ఓ ఉద్యోగంలాంటిది. క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అన్నారు. ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. సతీష్‌ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి మాట్లాడుతూ–‘‘నాంది’ సినిమాలో ఆద్య అనే క్రిమినల్‌ లాయర్‌ పాత్ర చేశా.  ఆద్య పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. లాయర్‌ పాత్ర కాబట్టి భారీ డైలాగులు చెప్పాల్సి వచ్చేది. దీంతో స్కూల్‌ పిల్లల్లా రాత్రిళ్లు డైలాగ్స్‌ బట్టీ పట్టి, ఉదయం షూటింగ్‌కి వెళ్లేదాన్ని. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా విజయ్‌ ఈ కథ తయారు చేసుకున్నాడు. సౌత్‌లో  30కి పైగా సినిమాల్లో అన్ని రకాల పాత్రల్లో నటించా.. ఇకపై కూడా నటిస్తాను.

ఈ విషయంలో నటుడు విజయ్‌ సేతుపతిగారే నాకు స్ఫూర్తి. ఇటీవల విడుదలైన ‘క్రాక్‌’ సినిమాలో నేను నటించిన జయమ్మ పాత్ర బాగుందని నాన్నగారు(శరత్‌కుమార్‌) గర్వంగా ఫీలయ్యారు.  చిరంజీవిగారు ఫోన్‌ చేసి ‘జయమ్మ పాత్రలో చక్కని నటన కనబరిచావు.. డబ్బింగ్‌ కూడా బాగుంది’ అని అభినందించడంతో చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగులో సందీప్‌ కిషన్‌తో ఓ సినిమా చేస్తున్నా.. మరో రెండు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు