Varalaxmi Sarathkumar: 'నన్ను చూసి భయపడుతున్నారేమో.. తమిళంలో ఛాన్సులు రావట్లేదు'

13 Feb, 2023 08:58 IST|Sakshi

తమిళంలో తనకు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారని నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈమె కథానాయకిగా నటించిన చిత్రం కొండ్రాల్‌ పావం. నటుడు సంతోష్‌ ప్రతాప్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఈశ్వరి రావు, చార్లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రతాప్‌ కృష్ణ మనోజ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి దయాళ్‌ పద్మనాభన్‌ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించారు.

కొండ్రాల్‌ పావం చిత్రాన్ని తెలుగులో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా తమిళనాడుకు చెందిన ఈయన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 3వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి మాట్లాడుతూ.. చాలా గ్యాప్‌ తరువాత తమిళంలో కథానాయకిగా నటిస్తున్నానని తెలిపారు. దర్శకుడు కన్నడ చిత్రాన్ని చూపించగానే ఇందులో తాను నటిస్తానని చెప్పానన్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు.

ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తున్నారు.. ఎందుకని అడుగుతున్నారని, అయితే తనకు తమిళంలో అవకాశాలు రావడం లేదని స్పష్టం చేశారు. 2011లో పోడా పోడి చిత్రం ద్వారా తమిళంలో కథానాయకిగా పరిచయం అయ్యానని, అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు ఇక్కడ నటించినా రాని గుర్తింపు తెలుగులో క్రాక్‌ చిత్రంతో వచ్చిందని చెప్పారు. తాను ప్రతినాయకిగా రకరకాల పాత్రల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ నటించానని, అయినా ఇక్కడ సరైన స్థానం కల్సించడం లేదని అన్నారు.

కారణం తనను చూసి భయపడుతున్నారో, లేక ఇన్‌ సెక్యూరిటీగా ఫీల్‌ అవుతున్నారో తెలియదన్నారు. అయితే తెలుగులో మంచి పాత్రలతో పాటు గౌరవం, అడిగినంత పారితోషికాన్ని కరెక్టుగా చెల్లిస్తున్నారని తెలిపారు. అందుకే చాలా మంది కళాకారులు తెలుగు చిత్రపరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. సంతోష్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ.. తాను కూడా తెలుగు చిత్రాలపై శ్రద్ధ చూపడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు