ఉదయ్‌కిరణ్‌, తరుణ్‌లతో నన్ను పోల్చకండి : వరుణ్‌ సందేశ్‌

23 Jul, 2021 15:54 IST|Sakshi

Varun Sandesh : హ్యాపీడేస్‌ చిత్రంతో తొలిసారి తెలుగుతెరకు పరిచయం అయ్యాడు హీరో వరుణ్‌ సందేశ్‌. ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాతో మరో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వరుణ్‌ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో వరుణ్‌ కెరీర్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయిందనుకున్న సమయంలో బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుణ్‌ ఆటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.


బిగ్‌బాస్‌-3 నుంచి బయటకు వచ్చిన అనంతరం వరుణ్‌ నటించిన తొలి సినిమా ఇందువదన. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న వరుణ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరీర్‌ను తరుణ్‌, ఉదయ్‌కిరణ్‌లతో పోల్చవద్దని తెలిపాడు. నాకు ఉదయ్‌, తరుణ్‌ బాగా తెలుసు. ఉదయ్‌కు అలా జరగడం చాలా బాధాకారం. కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కెరీర్‌ను అలా పోల్చి చూడలేం.


ఇక నా విషయానికి వస్తే..నేను కోల్పోయినదాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. బిగ్‌బాస్‌ తర్వాత కొన్ని కథలకు సైన్‌ చేశా. కానీ కోవిడ్‌ సహా మరికొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్స్‌ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇక తర్వాత నేను యూఎస్‌ వెళ్లి ఐటీ కోర్స్‌ చేశాను. వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాలనే ఆలోచన కూడా ఉంది అని వరుణ్‌ వివరించాడు. ప్రస్తుతం వరుణ్‌ సందేశ్‌ నటించిన ఇందువదన చిత్రంలో ఫ‌ర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడదులైన మూవీ ఫస్ట్‌ లుక్‌ సినిమాపై ఆకస్తిని కలిగించేలా ఉంది. 

మరిన్ని వార్తలు