వరుణ్‌ తేజ్‌ ప్రత్యేకత ఇదే

19 Jan, 2021 13:56 IST|Sakshi

మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ.. కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో వరుణ్ తేజ్. మొదట్లో కథల విషయంలో తడబడ్డా.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. మెగా హీరోలంతా పక్కా కమర్షియల్‌ సినిమాలను ఎంచుకుంటే.. ఈ మెగా ప్రిన్స్‌ మాత్రం అన్ని రకాల మూవీలు చేస్తూ టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పకీ.. కష్టపడి పైకొస్తున్న హీరో వరణ్‌ తేజ్‌. చేసింది తొమ్మిది సినిమాలే అయినా.. ప్రతీది ఓ ప్రయోగమే. నేడు(జనవరి 19) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన వరణ్‌ సినీ ప్రస్థానం మీకోసం..

ఎంట్రీయే ఓ ప్రయోగం
మాములుగా హీరోలు ఎక్కువగా మాస్‌ సినిమాతోనే ఎంట్రీ ఇస్తారు. ఇక మెగా ఫ్యామిలీ హీరో అంటే.. పక్కా మాస్‌ సినిమా రావాల్సిందే. కానీ వరుణ్‌ తేజ్‌ మాత్రం అలా ఎంట్రీ ఇవ్వలేదు. కుటుంబా కథా చిత్రం ‘ముకుందా’తో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలై ఆకట్టుకోలేకపోయింది. కానీ, నటుడిగా అతడికి మంచి పేరును తెచ్చింది. 


‘కంచె’తో గుర్తింపు

తొలి సినిమా ‘ముకుంద’ మెగా అభిమానులను కాస్త నిరుత్సాహపర్చినప్పటికీ ఈ మెగా హీరో మాస్‌ సినిమా జోలికి పోలేదు. రెండు సినిమా కూడా వైవిద్యమైన కథను ఎంచుకున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ వరణ్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో ఆర్మీ మ్యాన్‌గా, ప్రేమికుడిగా వరుణ్ వైవిధ్యమైన నటనను కనబరిచాడు. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.

మూడో సినిమాతో మాస్‌ జోన్‌లోకి అడుగు

తొలి రెండు చిత్రాల్లో క్లాసికల్‌ లుక్‌లో కనిపించిన వరుణ్‌.. మూడో చిత్రంలో మాత్రం రఫ్‌గా కనిపించాడు. డైనమిక్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లోఫర్‌’ చేసి మాస్‌ జోన్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా వరుణ్‌కు మాస్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మిస్టర్’ డిజాస్టర్ కావడంతో వరుణ్ కాస్త ఇబ్బంది పడ్డారు.

‘ఫిదా’తో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌

వరుణ్‌ తేజ్‌ సినీ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఫిదా’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము దులిపింది. వరుణ్‌ నటనకు ఫ్యాన్స్‌ ‘ఫిదా’ అయ్యారు. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరణ్‌ మార్కెట్‌ కూడా పెరిగిపోయింది. 

‘తొలి ప్రేమ’తో మరో హిట్‌

ఇక ఫిదా ఇచ్చిన జోష్‌లో వరుణ్‌ ‘తొలి ప్రేమ’ సినిమా చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘అంతరిక్షం’తో మరో ప్రయోగం చేసి విఫల మయ్యాడు. ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పేస్ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించారు.. మెప్పించారు.

 
ఎఫ్‌2 తో ఫన్‌ జోన్‌లోకి

తొలి నుంచి సోలోగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ వచ్చిన వరుణ్‌... తొలిసారి విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ఎఫ్‌2 అనే మల్టీస్టారర్‌ సినిమా చేశాడు. ఇది వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు, వరుణ్ తేజ్‌లోని కామెడీ కోణం కూడా ప్రేక్షకులను పరిచయం చేసింది. 

‘గద్దలకొండ గణేష్’గా భయపెట్టిన వరుణ్‌

హీరోగా పాజిటివ్‌ పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్న వరుణ్‌.. తొలిసారి తనలోని రౌడీయిజాన్ని కూడా తెరపై చూపించాడు. 2019లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’తో ఫ్యాన్స్‌ను భయపెట్టాడు వరుణ్‌. ‘జిగర్తాండ’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో వరుణ్‌ ఒదిగిపోయాడు. హరీశ్‌ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రౌడీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు వరుణ్. 

‘గని’తో బాక్సర్‌గా 

ఇక తాజాగా మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు వరుణ్‌. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ  టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. 

మరిన్ని వార్తలు