టాప్‌ గేర్‌లో కొనసాగుతున్న వరుణ్‌ తేజ్‌ కెరీర్‌

20 Jun, 2021 19:42 IST|Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ప్రస్తుతం రెమ్యునరేష‌న్ల విష‌యం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఎందుకంటే గ‌తంతో పోలిస్తే.. ఇటీవ‌ల కాలంలో హీరోల రెమ్యున‌రేష‌న్లను చూస్తే.. మూవీ బడ్జెట్‌లో అధిక భాగంగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో అగ్రహీరోలుగా కొనసాగుతున్న నటులు తమ రెమ్యునరేషన్‌ను రూ.35 నుంచి 50 కోట్ల వర‌కు తీసుకుంటుండుగా, వారి తరువాత జాబితాలో కొనసాగుతున్న మీడియం రేంజ్ హీరోలు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వ‌ర‌కు నిర్మాతలు ముట్టచెప్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం రెండో జాబితాలోకి మెగా హీరో వ‌రుణ్ తేజ్ కూడా చేరిపోయాడు. ఇటీవల కాలంలో వరుణ్‌ నటించిన సినిమాలు.. ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్‌, ఎఫ్‌ 2 వరుసగా హిట్‌ కావడంతో తన సినిమాలు మినిమం గ్యారెంటీ లిస్ట్‌లో చేరిపోయాయి. దీంతో వరుణ్‌ తేజ్‌ రెమ్యూనరేషన్‌ పెంచినట్లు తెలుస్తోంది. ఈ వరుసలో ‘అంతరిక్షం’  చిత్రం ఆడగపోయినా ఆ ప్రభావం వరుణ్‌ పారితోషకంపై పడలేదు. ‘ఎఫ్‌ 2’ కు సీక్వెల్‌ గా వస్తున్న ‘ఎఫ్ 3’ సినిమా కోసం వ‌రుణ్ తేజ్ రూ.8 కోట్ల వరకు రెమ్యున‌రేష‌న్ తీసుకోగా.. తాజాగా ఒప్పుకుంటున్న సినిమాల‌కు రూ.12 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నాడ‌ని వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి‌.

అందులో రూ.8 కోట్లు రెమ్యున‌రేష‌న్ కాగా.. మిగిలిన మొత్తం షేర్ రూపంలో తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక రెండో జాబితా నటుల్లో శ‌ర్వానంద్‌, నితిన్‌ అంత పారితోషికం తీసుకోవడం లేదు. నాని ప్రస్తుతం రూ.10 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నట్లు టాక్‌.  ఇవ‌న్నీ చూస్తే మీడియం హీరోల జాబితాలో అధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటూ టాప్ ప్లేస్ లో వ‌రుణ్ తేజ్‌ ఉన్నాడనే తెలుస్తోంది.

చదవండి: నేను ప్రేమలో ఉన్నా.. నా దృష్టి మొత్తం దానిపైనే : నటి

మరిన్ని వార్తలు