వైద్యుడు.. నలుగురు గర్భిణులు..! 

11 Jul, 2021 10:42 IST|Sakshi

చెన్నై : ఒక వైద్యుడు.. నలుగురు గర్భిణుల ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం వాసువిన్‌ గర్బిణీగల్‌. విజయ్‌ కథానాయకుడిగా మాస్టర్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సేవియర్‌ బ్రిట్టో తాజాగా తన ఎస్తల్‌ ఎంటర్‌టైనర్‌ పతాకంపై అళగియ కన్నె అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు వాసువిన్‌ గర్బిణీగల్‌ అనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెన్సిల్‌ చిత్రం ఫేమ్‌ మణి నాగరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నీయా నాన్న గోపినాథ్, నటి అనిక, సీత, అనితా విజయకుమార్, లెనా కుమార్, అభిషేక్, సచిన్, క్రిషికా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీకే వర్మ ఛాయాగ్రహణ, విష్ణు మోహన్‌ సితార సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడించారు. ఒక వైద్యుడు, నలుగురు గర్భిణుల ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం వాసువిన్‌ గర్భిణీగల్‌ అని చెప్పారు. గర్భిణుల సమస్యలకు పరిష్కారం చూపించే కథాంశంతో, కథకు ప్రాముఖ్యతనిచ్చి తెరకెక్కిస్తున్న చిత్రమని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

మరిన్ని వార్తలు