వీరప్పన్‌ కూతురు కథానాయికగా తెరంగేట్రం 

3 Apr, 2021 07:01 IST|Sakshi

చెన్నై: గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్ను ఎట్టకేలకు 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ గురించి ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు రూపొందాయి. కాగా వీరప్పన్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఇక రెండవ కూతురు విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమె  సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా అవతారమెత్తారు. విజయలక్ష్మి కథానాయికగా నటిస్తున్న చిత్రానికి మావీరన్‌ పిళ్లై అనే టైటిల్ని నిర్ణయించారు.

కేఎన్‌ఆర్‌ మూవీస్‌ పతాకంపై కేఎన్‌ఆర్‌. రాజ్శ్రీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ సంగీతాన్ని, మంజునాథ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్‌ శుక్రవారం విడుదల చేశారు. విశేషమేమిటంటే మావీరన్‌ పిళ్లై చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్‌ గెటప్‌లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంతో వీరప్పన్‌ వారసురాలు సినీరంగంలో ఎలాంటి పేరును సంపాదించుకుంటారో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
చదవండి: మలైకాకు కోవిడ్‌ వ్యాక్సిన్‌  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు