Sirivennela Sitaramasastry: 'నమ్మలేని నిజం...జీర్ణించుకోలేకపోతున్నా'

1 Dec, 2021 14:45 IST|Sakshi

ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి

Live Updates:

Sirivennela Sitaramasastry: మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిసాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి  మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో  పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు.

ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.

ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు: ఎన్టీఆర్‌
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిసార్లు మన మాటల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు, ఆయన ఎన్నో పాటలు రాశారు. రాబోయే తరానికి ఈ పాటలు ఆదర్శవంతంగా ఉంటాయి. రాబోయే తరానికి ఆయన పాటలు బంగారు బాటలు. తెలుగుజాతి బతికున్నంత కాలం.. ఆయన సాహిత్యం బతికే ఉంటుంది అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు.ఆయన మరణం చాలా బాధ కలిగించిందని, గొప్ప సాహిత్య సినీ గేయ రచయిత కనుమరుగు అయ్యారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

ఇలా కలుస్తాననుకోలేదు: దేవీశ్రీ ప్రసాద్‌
చాలారోజుల నుంచి కలవాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా కలుస్తాననుకోలేదు. మా నాన్నగారి తర్వాత నన్ను కొట్టేవారు, తిట్టేవారు ఆయన ఒక్కరే. అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నేను ఏమైనా పాట రాస్తే అది వివరించి చెప్పేవారు.కరోనా మా మధ్య దూరం పెంచింది. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు శ్రీకాంత్‌ నివాళులర్పించారు.

రాజశేఖర్‌ సినిమాలకి ఆయన ఎన్నో పాటలు రాశారు. నేను ఆయనను చాలా మిస్‌ అవుతున్నాను అని  జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని రాజశేఖర్‌ అన్నారు. 

సామాన్యులకి కూడా అర్థం అవుతాయి: తలసాని

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు..అందరికీ బాధాకరం అని తలసాని అన్నారు. 'మూడు వేలకు పైగా పాటలు రాసిన గొప్ప వ్యక్తి. సిరివెన్నెల పాటలు అంటే పండుగ లాంటి పాటలు. పద్మశ్రీ, 11 నంది అవార్డులు రావడం ఎంతో గొప్ప వరం. సామన్యులకి కూడా అర్థం అయ్యేలా ఆయన పాటలు ఉంటాయి. ఈరోజు తెలుగు వారంతా బాధలో ఉన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రైటర్స్‌కి సిరివెన్నెల స్పూర్తి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం 'అని తలసాని అన్నారు. 

మంచి వ్యక్తిత్వం..ఆ పాట గుర్తొస్తుంది: నాగార్జున
సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు

అది ఊహించడమే కష్టం: మహేశ్‌ బాబు
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని మహేశ్‌ అన్నారు. 

అందుకే విష్ణు రాలేదు: నరేశ్‌
'తెలుగు సినీ పరిశ్రమకి బాలు, సిరివెన్నెల లాంటి వారు రెండు రధ చక్రాలను కోల్పోయాం. పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం. సమురు లేని దీపం కుండలా సినీ పరిశ్రమ మిగిలిపోయింది. బాబాయ్‌ కర్మకి విష్ణు వెళ్లారు. అందుకే రాలేదు' అని నరేశ్‌ అన్నారు.

ప్రతిరోజూ ఆయన పాటలు వింటాం: సింగర్‌ కౌసల్య
సిరివెన్నెలను కోల్పోవడం చాలా బాధాకరం.సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాశారు.ఆయన పాటలు తెలియని ప్రజానీకం లేరు. ఆయనతో నేను చాలా పాటలు పాడాను. సిరివెన్నెల గారు రాసిన పాటలు ప్రతిరోజూ వింటూ ఉంటాం.

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ నివాళులు అర్పించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికిసింగర్ గీతామాధురి, నటుడు శివబాలాజీ నివాళులు అర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

జీర్ణించుకోలేకపోతున్నాను: సింగర్‌ సునీత
'సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. వరుస కథలు, ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పదాలతో ఎన్నో అర్థాలు చెప్పడం ఆయన సొంతం. మహానుభావుడు చరిత్ర సృష్టించి నిద్రలోకి జారుకున్నారు. సిరివెన్నెల చీకటి మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అని సునీత పేర్కొన్నారు.

శకం ముగిసింది: అల్లు అరవింద్‌
'సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమాకి కూడా పాటలు రాశారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే...సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. బన్నీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు' అంటూ అల్లు అరవింద్‌ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  

అల్లు అర్జున్‌ నివాళులు
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సందర్శించిన అల్లు అర్జున్‌ ఆయనకు నివాళులు అర్పించారు

కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ
'ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల. తాను పుట్టిన నేలకి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన., సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉంది. సాకు సాహిత్యం అంటే ఇష్టం. మేం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకి వెళ్ళారు' అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు.

మంచి స్నేహితుడిని కోల్పోయా : మణిశర్మ
'జగమంత కుటుంబాన్ని వదిలేసి సిరివెన్నెల వెళ్లిపోయారు. మంచి సాహిత్యవేత్తతో పాటు మంచి వ్యక్తిని కోల్పోయాం. మంచి స్నేహితుడిని కోల్పోయాను' అని సంగీత దర్శకుడు మణిశర్మ భావోద్వేగానికి లోనయ్యారు. 

ఒక వటవృక్షం కూలిపోయింది: తనికెళ్ల భరణి
'సిరివెన్నెల భౌతికకాయాన్ని చూసి నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోరోజులు కలిసి పనిచేశాం. ఒక వటవృక్షం కూలిపోయింది. ఇక అంతా శూన్యమే. దీన్ని భర్తీ చేయలేము. ప్రతిరోజూ నవ్వుతూ ఉండేవారు. ఆయన ప్రతీ పాట ప్రకాశిస్తుంది. సిరివెన్నెల లేని లోటు తీర్చలేం' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి రామజోగయ్య శాస్త్రి నివాళులర్పించారు.

గుండె తరుక్కుపోతుంది: పరుచూరి
'పాటే శ్వాసగా జీవించిన వ్యక్తి సిరివెన్నెల. అన్నగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. ఆయన లేడు అంటే గుండె తరుక్కుపోతుంది. ఆ మహానుభావుడు లేడంటే బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వేటూరి తర్వాత స్థానం సిరివెన్నెలదే. 

సిరివెన్నెల ప్రతి పాట ఆణిముత్యం: సాయికుమార్‌
సిరివెన్నెల పార్థివదేహానికి సినీ నటుడు సాయికుమార్‌ నివాళులర్పించారు.  'ప్రతి అడుగులో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆయన రాసే ప్రతి పాట ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల. ఎవడు సినిమాలో సిరివెన్నెల కుమారుడు నటించాడు. నేను విలన్‌ పాత్ర పోషించాను' అంటూ సాయికుమార్‌.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

పోలీసుల మీద పాట రాశారు: సజ్జనార్‌
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 'ఒక మంచి గేయ రచయితని కోల్పోయాం. రెండేళ్ల నుంచి సిరివెన్నెలతో నాకు పరిచయం. పోలీసుల మీద మంచి పాటలు రాశారు. పోలీసుల తరపున, టీఎస్‌ఆర్టీసీ తరపున ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం' అని సజ్జనార్‌ అన్నారు. 

సిరివెన్నెల లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే: సి. కల్యాణ్‌
'ఆరోజుల్లో సినిమా సాహిత్యం వేరు..ఇప్పుడు వేరు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు' అని  నిర్మాత సి. కల్యాణ్‌ పేర్కొన్నారు.

నారప్ప వరకు కలిసి పనిచేశాను: హీరో వెంకటేశ్‌
'సిరివెన్నెల మరణవార్త ఎంతో బాధాకరం. ఎంతో మంచి వ్యక్తి. సర్ణకమలం నుంచి మొన్న వచ్చిన నారప్ప సిరివెన్నెలతో కలిసి పనిచేశాను. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సాహిత్యరంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని వెంకటేశ్‌ అన్నారు. 

ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది: డైరెక్టర్‌ మారుతి
'ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. గత ఐదారేళ్ల నుంచి ఆయన ఇంట్లో కుటుంబసభ్యుడిలా ఉంటున్నా. మా ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది. సిరివెన్నెల ఇంకా మనతోనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన పాటలు ప్రతిరోజూ వింటాం'  అని మారుతి తెలిపారు. 

ఈ లోటు తీరేది కాదు: ఎస్వీ కృష్ణారెడ్డి
'సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఆయన లోటు తీరేది కాదు' అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు